కాంగ్రెస్‌లో టికెట్‌ ఉత్కంఠ

ABN , First Publish Date - 2023-08-27T00:01:04+05:30 IST

అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎవరనేది తేలింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ టికెట్‌లు ఎవరిని వరించనున్నాయో మరికొన్ని రోజుల్లో తేలనుంది. టికెట్‌లకై కాంగ్రెస్‌ పెద్దలు స్వీకరించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో సుమారు 21 మందికి పైగా కాంగ్రెస్‌ ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్‌లో టికెట్‌ ఉత్కంఠ

- టికెట్‌ల కోసం పూర్తయిన దరఖాస్తుల స్వీకరణ.. మొదలైన స్ర్కూట్ని

- టికెట్‌లు దక్కని వారికి బుజ్జగింపుల్లో కాంగ్రెస్‌ పెద్దలు

- టికెట్‌లపై కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్కంఠ

- జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ

- ఒక్కో కాన్సెస్టెన్సీలో ముగ్గురుకు పైగానే ఆశావహులు

- కామారెడ్డిలోనూ ఇద్దరు పోటీ

- వచ్చే నెల రెండో వారంలో టికెట్లు ప్రకటించే అవకాశం

కామారెడ్డి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఎవరనేది తేలింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ టికెట్‌లు ఎవరిని వరించనున్నాయో మరికొన్ని రోజుల్లో తేలనుంది. టికెట్‌లకై కాంగ్రెస్‌ పెద్దలు స్వీకరించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో సుమారు 21 మందికి పైగా కాంగ్రెస్‌ ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ టికెట్లకై పోటీ నెలకొంది. ఎక్కువగా బాన్సువాడ నియోజకవర్గం నుంచి ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో వడపోతపై కాంగ్రెస్‌ పెద్దలు దృష్టి సారించారు. వచ్చేనెల రెండో వారంలో కాంగ్రెస్‌ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా పోటీ ఉండే నియోజకవర్గాల అభ్యర్థులను చివరి వరకు ఆపే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కామారెడ్డిలో ఇద్దరు

కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గం నుంచి పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న సీనియర్‌ నేత షబ్బీర్‌అలీ దాదాపు బరిలో ఉండనున్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున నియోజకవర్గం నుంచి షబ్బీర్‌అలీ రెండు పర్యాయాలు గెలుపొందగా మూడు సార్లు ఓడిపోయారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పని చేశారు. ఆదినుంచి షబ్బీర్‌అలీ కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతుండడం, నియోజకవర్గంలో క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఈ సారి ఎన్నికల్లో ఎలాగైన గెలవాలనే తపనతో గత రెండు, మూడు సంవత్సరాలుగా నియోజకవర్గం మొత్తం తిరుగుతూ పార్టీ పరంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. నియోజకవర్గంలో షబ్బీర్‌అలీ దాదాపు పోటీ చేయడం ఖాయమని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే దరఖాస్తుల చివరి రోజు కామారెడ్డి నియోజకవర్గం నుంచి మరో కార్యకర్త టికెట్‌కై దరఖాస్తు చేసుకున్నారు. దీంతో నియోజకవర్గం నుంచి పార్టీ పరంగా ఇద్దరు టికెట్‌లు ఆశిస్తూ దరఖాస్తులు చేశారు.

ఎల్లారెడ్డిలో ముగ్గురు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. గత అసెంబ్లీ నియోజకవర్గంలో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 9 సీట్లలో ఒకే ఒక కాంగ్రెస్‌ గెలుచుకున్న నియోజకవర్గం ఎల్లారెడ్డి. దీంతో ఈ ఎన్నికల్లోనూ పార్టీ పరంగా నిలుచుంటే గెలిచే అవకాశాలు ఉంటాయని పలువురు ఆశావహులు భావిస్తున్నారు. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనూ ముగ్గురు అభ్యర్థులు టికెట్‌కై పార్టీ పెద్దలకు దరఖాస్తు చేసుకున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆ పార్టీ సీనియర్‌ నేత వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్‌మోహన్‌రావులు టికెట్‌లు ఆశిస్తున్నారు. వీరిద్దరు గత కొన్ని రోజులుగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ ఇరువురు నేతలు పోటాపోటీగా పార్టీ కార్యక్రమాలే కాకుండా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఇద్దరు నేతలు ఎల్లారెడ్డి నుంచి టికెట్‌కై కాంగ్రెస్‌ పెద్దలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు మరోనేత తాడ్వాయికి చెందిన రాజేశ్వర్‌రెడ్డి టికెట్‌కై దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఎవరికి టికెట్‌ వరించనుందో చూడాలి.

బాన్సువాడలో అత్యధికంగా 11 మంది.. జుక్కల్‌లో నలుగురు

బాన్సువాడ నియోజకవర్గంలో మొన్నటి వరకు కాసుల బాలరాజు ఒక్కరే టికెట్‌ ఆశించారు. గతంలోనూ బాల్‌రాజే పార్టీ పరంగా పోటీచేసి స్పీకర్‌పై ఓడిపోయారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ తరపున నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ నియోజకవర్గం నుంచి మరో 11 మంది కాంగ్రెస్‌ నాయకులు టికెట్లకై దరఖాస్తు చేసుకోవడం విశేషం. కాంగ్రెస్‌కు చెందిన అంబర్‌సింగ్‌, ప్రతాప్‌సింగ్‌, శ్రీనివాస్‌రావు, రాజిరెడ్డి, సురేష్‌, శ్రీనివాస్‌గౌడ్‌, మోతీలాల్‌, వెంకటరాంరెడ్డిలతో పాటు మరో ఇద్దరు టికెట్‌కై దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. జుక్కల్‌ నియోజకవర్గంలోనూ ముగ్గురు నేతల మధ్య టికెట్‌కై పోటీ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే గంగారాం, మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్‌, ఎన్‌ఆర్‌ఐ లక్ష్మీకాంత్‌రావులు టికెట్‌లు ఆశిస్తున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ఇద్దరు నేతలు టికెట్‌కై కాంగ్రెస్‌ పెద్దలకు దరఖాస్తు చేసుకున్నారు.

గెలిచే అభ్యర్థుల కోసం కసరత్తు

కాంగ్రెస్‌ అధిష్ఠానం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో కాంగ్రెస్‌ పెద్దలు నియోజకవర్గాల వారీగా స్ర్కూట్ని మొదలుపెట్టినట్లు తెలిసింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆకర్షణ, ప్రత్యర్థులను ఎదుర్కునే సత్తా ఏ నేతకు ఉంది, ఆర్థిక, అంగబలం ఎవరికి ఉన్నాయి, సర్వేలు ఎవరికి అనుకూలంగా వచ్చాయో వాటి ఆధారంగా కాంగ్రెస్‌ అధిష్ఠానం వడపోత చేపడుతున్నట్లు తెలిసింది. గెలిచే అభ్యర్థులకే టికెట్‌లు ఇచ్చేందుకు కాంగ్రెస్‌ పెద్దలు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. వచ్చే నెల రెండో వారంలో టికెట్‌లు ఖరారు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు ఎవరికైతే టికెట్‌ రాదో వారిని కాంగ్రెస్‌ పెద్దలు బుజ్జగించే పనిలో పడినట్లు తెలిసింది. పార్టీ అభ్యర్థికి మరెవరు పార్టీ పరంగా రెబల్‌గా బరిలో ఉండకుండా అధిష్ఠాన ం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపనుందో దరఖాస్తు చేసుకున్న ఆశావహుల్లోనే కాకుండా పార్టీ శ్రేణుల్లోనూ ఉత్కంఠ నెలకొంటుంది.

Updated Date - 2023-08-27T00:01:04+05:30 IST