సర్వేలతోనే టికెట్లు!
ABN , First Publish Date - 2023-08-06T00:22:30+05:30 IST
కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే టికెట్ల కోసం ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా తమ కల నెరవేర్చుకోవాలని ఆశావహులు ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలంతా ఈ సారి టికెట్ ఇచ్చే విధానం మారిందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎవరు బలంగా ఉంటే, సర్వే, నివేదికలు, క్యాడర్ అభిప్రాయాల్లో ఎవరికి మొగ్గు ఉంటే వారికే టికెట్ దక్కుతుందన్నారు.
- టికెట్ ఆశావహులకు కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టీకరణ
- సన్నిహితులకైనా ఇదే వర్తిస్తుందంటున్న టీపీసీసీ
- సర్వేలు, పార్టీ నివేదికలే ప్రామాణికమనే సంకేతాలు
- బీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టాలంటే బలంగా పోరాడాల్సిందేనని సూచన
- సర్వే రిపోర్టులతో నియోజకవర్గాల్లోనే ఆశావహులు
- జిల్లాలో ఎల్లారెడ్డి, జుక్కల్ కాంగ్రెస్‌లో ఆశావహులు ఎక్కువే..
కామారెడ్డి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే టికెట్ల కోసం ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా తమ కల నెరవేర్చుకోవాలని ఆశావహులు ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ అధిష్ఠానంతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలంతా ఈ సారి టికెట్ ఇచ్చే విధానం మారిందని అంటున్నారు. క్షేత్రస్థాయిలో ఎవరు బలంగా ఉంటే, సర్వే, నివేదికలు, క్యాడర్ అభిప్రాయాల్లో ఎవరికి మొగ్గు ఉంటే వారికే టికెట్ దక్కుతుందన్నారు. నియోజకవర్గాల్లోనే ఉండి పని చేసుకోవాలని సూచిస్తుండడంతో పరిస్థితి వేడెక్కింది. జిల్లాలోని ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ల కోసం పోటాపోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్య నాయకులు ఎవరికి హామీ ఇచ్చేది లేదని స్పష్టం చేస్తుండడంతో గాంధీ భవన్ వదిలి నియోజకవర్గాల్లో కార్యాచరణ చేపట్టేందుకు ఆశావహులు కదులుతున్నారు.
టికెట్లపై ఎవరికీ దక్కని హామీ
రాష్ట్రంలో వరుసగా రెండు సార్లు అధికారం దక్కించుకున్న బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టడం సాదాసీదా విషయం కాదని అంచనాల్లో కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాలను పదేపదే మారుస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు వ్యూహకర్తల నివేదికలతో పాటు నాలుగైదు రకాల సర్వే నివేదికలు రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా నియోజకవర్గాల వారీగా నేతల వారిగా తెప్పించుకుంటూ విశ్లేషిస్తున్నారు. వీటితో పాటు పార్టీ క్యాడర్ ద్వారా వచ్చే అభిప్రాయాలను క్రోడీకరించి ఎప్పటికప్పుడు ముఖ్య నాయకులకు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఈ సారి టికెట్ల కేటాయింపు ఉంటుందనే స్పష్టమైన సంకేతాన్ని టీపీసీసీ ముఖ్య నాయకులంతా తమ వద్దకు వచ్చే ఆశావహులకు చెబుతున్నారు. ఏ ఆవావహునికి టికెట్ వస్తుందనే హామీ ఎవరికీ ఇవ్వడం లేదు. అయితే కామారెడ్డి నియోజకవర్గంలో సీనియర్ నాయకుడు షబ్బీర్‌అలీకి టికెట్ ఖాయం కానుందని ఆ పార్టీలో ప్రచారం సాగుతోంది. బాన్సువాడ నియోజకవర్గంలోనూ ఆ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాసుల బాలరాజు తప్ప వేరే నాయకుడు టికెట్ ఆశించడం లేదు. ఇక్కడ అతనికే టికెట్ ఫైనల్ కానుందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. అయితే ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్‌లోని పలువురు ముఖ్యనేతల మధ్య టికెట్లకై తీవ్ర పోటీ నెలకొంటుంది.
క్షేత్రస్థాయిలో బలంగా పోరాడే వారికే టికెట్‌లు
ప్రజల్లో ఉండి స్థానిక సమస్యలపై అధికార పార్టీపై బలంగా పోరాడే నాయకులకే టికెట్‌లు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ అధిష్ఠానం చెబుతున్నట్లు ముఖ్య నాయకులు పేర్కొంటున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్ర మొదలుకుని ఆ తర్వాత చేపట్టిన హాత్ సే హాత్ జోడో అభియాన్ ఇతర ఆందోళనలతో పాటు నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడపడంలో ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయడంలో ఆశావహులు ఏ మేర పని చేస్తున్నారనే అంశాన్ని అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. తప్పనిసరిగా నిర్వహించే ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు, ప్రెస్‌మీట్‌లతో పాటు ఎక్కడికక్కడ ప్రజల ఇబ్బందులపై స్పందిస్తున్న నాయకులు ఎవరు.. ప్రభుత్వ వైఫల్యాలను బలంగా నిలదీస్తున్న వారేవరు.. నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యలపై బలంగా పోరాడుతున్నది ఎవరు.. అధికార పార్టీపై దూకుడుగా వెళ్తున్న వారు ఎవరు.. నియోజకవర్గంలోని బలమైన వర్గాలతో ఈ నాయకుల్లో విశ్వసనీయత ఎవరికి ఉంది.. వంటి పలు లోతైన అంశాలను పరిగణలోకి తీసుకుని ఆశావహులు పనితీరున అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఆ పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. పార్టీ జాతీయ విధానాలు, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే అంశాలపై ఇప్పటికే ప్రకటించిన డిక్లరేషన్‌లను చదవడం ద్వారా ఓటర్లను తమ వైపు తిప్పుకోలేమని అభివృద్ధి సంక్షేమం పథకాలతో స్పష్టమైన ఓటు బ్యాంక్‌ను కలిగి ఉండడంతో పాటు విస్తృత స్థాయిలో బలంగా ఉన్న బీఆర్‌ఎస్‌ను క్షేత్రస్థాయిలో ఢీకొట్టాలంటే అవి సరిపోవని పార్టీ ముఖ్యులు భావిస్తున్నారు. ఈ అంశాలతో పాటు నియోజకవర్గంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు స్థానికంగా ప్రజల్లో విశ్వసనీయత కలిగి ఉండడం, స్థానిక అంశాలపై బలంగా పోరాడే సమర్థత కలిగి ఉండడం కూడా ఈ సారి టికెట్లు సాధించడంలో ఉపయోగపడుతాయని అధిష్ఠానం ముఖ్యనేతలు సంకేతాలు ఆశావహులకు ఇస్తున్నారు. స్థానిక సామాజిక పరిస్థితులు కూడా ఆశావహులలకు కలిసి వచ్చే అంశాలు కానున్నాయి. వీటన్నింటిని క్రోడీకరించుకుని క్షేత్రస్థాయిలో బలంగా పోరాడే వారికే టికెట్‌లు దక్కుతాయని తెలుస్తోంది.
నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ ఆశావహులు
ప్రజల్లో ఉండే వారికే టికెట్లు ఇస్తామంటూ కాంగ్రెస్ అధిష్ఠానం చెబుతుండడంతో ఆ పార్టీ ఆశావహులు నియోజకవర్గాల్లోనే మకాం వేస్తున్నారు. జిల్లాలో ముఖ్యంగా ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో పలువురు కాంగ్రెస్ ఆశావహుల మధ్య టికెట్ల పోటీ నెలకొంటుంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్ ్జ వడ్డెపల్లి సుభాష్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మదన్‌మోహన్‌లు టికెట్లు ఆశిస్తున్నారు. గత కొనేళ్లుగా ఈ ఇరువురు నేతలు పార్టీ తరపున ఎవరికి వారే కార్యక్రమాలు చేపడుతునే అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు టికెట్ల కోసం కాంగ్రెస్ అధిష్ఠానంలోని ముఖ్యనేతలను కలుస్తూ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గంలోను ముగ్గురు నేతల మధ్య పోటీ నెలకొంటుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు నేతలైన గంగారాం, గడుగు గంగాధర్, లక్ష్మీకాంత్‌రావులు టికెట్‌లు ఆశిస్తున్నారు. ఈ ముగ్గురు నేతలు ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజా సమస్యలపై ఆందోళన చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఆయా సామాజిక వర్గాలతో పాటు కుల సంఘాల నేతలను కలుస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్‌లోని పలువురు నాయకుల మధ్య టికెట్ల కోసం పోటీ నెలకొంటుంది. అధిష్ఠానం మాత్రం ప్రజల్లో ఉండే నాయకులకు టికెట్ ఇస్తామని చెబుతుండడంతో వీరంతా నియోజకవర్గాల్లోనే మకాం వేస్తున్నారు.