జిల్లాలో అప్రకటిత విద్యుత్ కోతలు
ABN , First Publish Date - 2023-02-10T00:17:56+05:30 IST
జిల్లాలో వ్యవసాయానికి అప్రకటిత విద్యుత్ కోతలు రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. సాగునీటి వసతి లేక బోర్ల కింద పంట లు వేసిన రైతులు ఈ కోతల వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు,
త్రీఫేజ్ సరఫరా లేక రైతుల ఆందోళనలు
అధికారులను నిలదీస్తున్న రైతులు
కెనాల్ నీటిపైనే అన్నదాతల ఆశలు
నిజామాబాద్, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో వ్యవసాయానికి అప్రకటిత విద్యుత్ కోతలు రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. సాగునీటి వసతి లేక బోర్ల కింద పంట లు వేసిన రైతులు ఈ కోతల వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు, త్రీఫేజ్ కరెంట్ రాక పంటలకు నీరందక ఎండుతుండటంతో ఇబ్బం దులు పడుతున్నారు. రాత్రి సమయాల్లో బోర్లవద్దనే ఉండి పంటలను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. ట్రాన్స్‌కో అధికారులు నిరంతర విద్యుత్ సరఫరా చేయకున్నా పొద్దంతా త్రీఫేజ్ కరెంట్‌ను అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆయా సబ్ స్టేషన్‌ల పరిధిలో అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నా రు. పంటలను కాపాడాలని కోరుతున్నారు. ని జాంసాగర్ పరిధిలో కూడా సాగునీటి విడుదల విడతల వారీగా చేస్తుండటం కరెంట్ కోతలు ఉండటంతో ప్రతిరోజూ నీళ్లు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
విడతల వారీగా సరఫరాతో ఇబ్బందులు
విడతలవారీగా త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేయడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని రోజులు ఉదయం 4 నుంచి 6 గంటలు ఇస్తుండటం వల్ల నీరు సరిపోక పంట లు ఎండుతుండటంతో రైతులు ఆయో మయం చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతీరోజు త్రీఫేజ్ కరెంట్ 10 నుంచి 12 గంటలు మత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ కరెంట్ ఎక్కువగా రాత్రి 11 నుంచి ఉదయం 4 గంటల వరకు ఇస్తున్నారు. సబ్ స్టేషన్‌ల వారీగా పగటిపూట 11 గంటల నుంచి 5 గంటల వరకు త్రీఫేజ్ కరెంట్ సరఫరా చేస్తున్నారు. ఎన్‌పీడీసీఎల్ అధికారుల నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నారు. మొత్తంగా త్రీఫేజ్ కరెంట్ రాత్రిపగలు కలిసి 10 నుంచి 12 గంటలకు మించకుండా సరఫరా చేస్తున్నారు.
పెరిగిన వినియోగం
జిల్లాలో శ్రీరాంసాగర్, నిజాంసాగర్ పరిధిలో సాగయిన విస్తీర్ణంలో 2 లక్షల వరకే పంటలు ఉండగా మిగతా పంటలన్నీ బోర్ల కిందనే ఉండ టం వల్ల ఈ వినియోగం ఎక్కువైంది. జిల్లాలో మొత్తం లక్షా 77వేల 334 వ్యవసాయ కనెక్షన్లున్నాయి. ప్రతీరోజు రైతులు ఈ మోటర్లను వినియోగించడం వల్ల ఎక్కువ మొత్తంలో కరెంట్ వినియోగం అవుతోంది. వరిపంటకు ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే ఎక్కువగా నీళ్లు అవసరం ఉంది. పంట పొట్టదశతోపాటు పూత, గొలుసు దశ వరకు నీటి అవసరం ఉంటుంది. వరి ఏ దశలో ఎండినా దిగిబడిపై ప్రభావం చూపుతోంది. నీళ్లు సక్రమంగా అందితేనే పంట చేతికి వస్తుంది. భూగర్భ జలాలలోపాటు ప్రాజెక్టులలో నీళ్లు అందుబాటులో ఉన్నాయన్న నమ్మకంతోనే రైతులు పంటలు వేశారు. ప్రస్తుతం ఈ విద్యుత్ కోతలను విధించడం వల్ల ఇబ్బందులు పడుతున్నారు. బోర్ల కింద ఎక్కువ మొత్తంలో సాగుచేసినవారికి కొన్నే గంటలు రావడం వల్ల మోటార్లు నడవక, కింది పొలాలకు నీళ్లు అందని పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ కోతలు ఇలాగే కొనసాగితే వరి ఎండే అవకాశం ఉంటంతో రైతులు సబ్ స్టేషన్‌ల పరిధిలో అధికారులను కలుస్తున్నారు. నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు. కొన్నిచోట్ల ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని బోధన్ డివిజన్ పరిధిలో నిజాంసాగర్ నీళ్లను విడతల వారీగా సరఫరా చేయడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. కరెంట్ రాక, ప్రాజెక్టు నీళ్లు రాక పంటలు ఎండే పరిస్థితి ఉందని విడతల వారీగా బంద్‌చేసి ప్రతీరోజు సాగునిటిని అందించాలని కోరుతున్నారు.
జిల్లా ఎన్‌పీడీసీఎల్ అధికారులు మాత్రం వ్యవసాయానికి ఇబ్బందులు కలుగగకుండా త్రీఫేజ్ కరెంట్‌ను సరఫరా చేస్తున్నామని చెబుతున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు జిల్లాకు సరఫరా అయ్యే విద్యుత్ ఆధారంగా త్రీ పేజ్ కరెంట్‌ను సరఫరా చేస్తున్నామని ఎస్‌ఈ (విద్యుత్) రవీందర్ తెలిపారు. పంటలకు ఇబ్బందులు కాకుండా చూస్తున్నామన్నారు. కొన్ని సబ్‌స్టేషన్‌ల పరిధిలో సమస్యలుండటం వల్ల ఇబ్బందులన్నాయని తెలిపారు.
24 గంటల త్రీఫేజ్
కరెంటు సరఫరా చేయాలి
మాక్లూర్, ఫిబ్రవరి 9: రైతులకు 24 గంటల త్రీఫేజ్ కరెంటు సరఫరా చేయాలని భారతీయ జనతా కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రైతులు వేసిన వరి, మొక్కజొన్న, ఎర్రజొన్న ఆకుకూరల పంట సాగుకు త్రీఫేజ్ నుంచి కరెంటు సరఫరా సరిగా లేనందున రైతులు పంట నష్టపోవల్సి వస్తుందని, 24గంటల త్రీఫేజ్ కరెంటును సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని గురువారం ఏఈకి ఆయన వినతిపత్రం అందజేశారు. 24 గంటల విద్యుత్ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో మండలంలోని అన్ని సబ్‌స్టేషన్‌లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గంగోని సంతోష్, వినోద్, ఉప్పడి గంగారెడ్డి, శివరాజ్, తదితరులు పాల్గొన్నారు.