పంచాయతీల్లో యూపీఐ సేవలు

ABN , First Publish Date - 2023-09-08T00:26:42+05:30 IST

గ్రామ పంచాయతీల్లో మరింత పారదర్శకతకు ప్రభుత్వాలు శ్రీకారం చుడుతున్నాయి. ఆదాయ, వ్యయాలపై నిఘా పెడుతునే ప్రతీ పైసా ప్రజాప్రయోజనాలకు ఖర్చు చేసేలా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. పన్నులు వసూలవుతున్నాయా వసూలైనవి ఏమవుతున్నాయో లెక్కలు చెప్పడం కష్టమే. ఈ నేపథ్యంలో పంచాయతీల బలోపేతానికి, డిజిటల్‌ పరంగా మరింత ముందుకు నడిపించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి.

పంచాయతీల్లో యూపీఐ సేవలు

- జిల్లాలోని అన్ని గ్రామాలకు విస్తరించేందుకు చర్యలు

- నిధుల వ్యయంపై నిఘా

- జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు

ఎల్లారెడ్డి, సెప్టెంబరు 7: గ్రామ పంచాయతీల్లో మరింత పారదర్శకతకు ప్రభుత్వాలు శ్రీకారం చుడుతున్నాయి. ఆదాయ, వ్యయాలపై నిఘా పెడుతునే ప్రతీ పైసా ప్రజాప్రయోజనాలకు ఖర్చు చేసేలా నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. పన్నులు వసూలవుతున్నాయా వసూలైనవి ఏమవుతున్నాయో లెక్కలు చెప్పడం కష్టమే. ఈ నేపథ్యంలో పంచాయతీల బలోపేతానికి, డిజిటల్‌ పరంగా మరింత ముందుకు నడిపించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయి. సాంకేతికత పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో మార్కెట్‌లో కూరగాయాలు మొదలుకుని హోటల్‌ చెల్లింపులు, ఇతర వస్తువులు కొనుగోలు సైతం స్మార్ట్‌ఫోన్‌ ద్వారా యూపీఐ(యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేస్‌) సేవలను వినియోగిస్తున్నారు. దీంతో పంచాయతీల్లో సైతం యూపీఐ సేవలు అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని అన్ని గ్రామాలకు యూపీఐ సేవల వినియోగ పంచాయతీలుగా ప్రకటించడానికి పంచాయతీరాజ్‌శాఖ సిద్ధమవుతోంది.

మారుమూల పల్లెల్లో సైతం

గత మూడేళ్లలో మారుమూల పల్లెల్లో సైతం యూపీఐ సేవలు విస్తరించాయి. డిజిటల్‌ సేవలకు అలవాటు పడిన చిన్న దుకాణాలు మొదలుకొని అందరూ దీన్నే వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను నగదు రహిత చెల్లింపుల వైపు ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రతీ పంచాయతీల్లో యూపీఐ అమలుకు చర్యలు తీసుకుంది. ఇప్పటికే దీనిపై పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. యూపీఐ సేవలను వినియోగించేలా పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని సన్నద్ధం చేస్తున్నారు.

పారదర్శకత అక్రమాలకు అడ్డుకట

జిల్లాలో మొత్తం 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మేజర్‌ పంచాయతీల్లో వివిధ రకాల అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు, కొన్ని పత్రాల జారీకి ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ వినియోగంలో ఉన్నాయి. చాలా పంచాయతీల్లో పన్నుల వసూలు ఇప్పటికే నగదు రూపంలోనే చేస్తున్నారు. దీంతో ఆ డబ్బులను వివిధ అభివృద్ధి పనులు లేదా ఇతర ఖర్చుల పేరుతో పద్దులు రాసి పక్కదారి పటిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఇక ముందు పన్నుల వసూలు, పత్రాల జారీకి పంచాయతీల్లో యూపీఐ ద్వారా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా పంచాయతీ వ్యవస్థ పూర్తి పారదర్శకంగా మారి, అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది.

Updated Date - 2023-09-08T00:26:42+05:30 IST