వైస్‌ ఎంపీపీలకు అవిశ్వాస గండం

ABN , First Publish Date - 2023-07-14T23:51:44+05:30 IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మండల ప్రజాపరిషత్‌ వైస్‌ ఎంపీపీలకు అవిశ్వాస గండం తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రప్రథమంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే వైస్‌ ఎంపీపీలపై అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

వైస్‌ ఎంపీపీలకు అవిశ్వాస గండం
ఎల్లారెడ్డి ఆర్డీవోకు అవిశ్వాస తీర్మాన నోటీసు అందజేస్తున్న నాగిరెడ్డిపేట ఎంపీటీసీలు

- మొన్న నాగిరెడ్డిపేట, నిన్న ఎల్లారెడ్డి వైస్‌ ఎంపీపీలపై అవిశ్వాసం

- ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే అవిశ్వాసానికి శ్రీకారం

- అవిశ్వాసం సెగ ఇతర మండలాలకు సోకేనా?

- జిల్లా రాజకీయాల్లో అవిశ్వాసంపైనే ముమ్మర చర్చలు

నాగిరెడ్డిపేట, జూలై 14: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని మండల ప్రజాపరిషత్‌ వైస్‌ ఎంపీపీలకు అవిశ్వాస గండం తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రప్రథమంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే వైస్‌ ఎంపీపీలపై అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నాగిరెడ్డిపేట మండల ప్రజాపరిషత్‌ వైస్‌ ఎంపీపీ దివిటి రాజ్‌దాస్‌పైన ఈ నెల 7న మండలానికి చెందిన 8 మంది అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాం పెడుతూ ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీను నాయక్‌కు అవిశ్వాస తీర్మాన నోటీసును అందజేయగా.. తాజాగా నాలుగు రోజుల క్రితం ఎల్లారెడ్డి మండల ప్రజా పరిషత్‌ వైస్‌ ఎంపీపీ పెద్దెడ్ల నర్సింలుపైన ఈ నెల 11న ఎల్లారెడ్డి మండల ఆరుగురు ఎంపీటీసీలు అవిశ్వాసం పెడుతూ ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీను నాయక్‌కు అవిశ్వా తీర్మానం నోటీసును అందజేశారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండు మండలాల వైస్‌ ఎంపీపీలపైన అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టడం రాజకీయంగా జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీలుగా గెలుపొంది అనంతరం వైస్‌ ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం వైస్‌ ఎంపీపీగా ఎన్నికయ్యాక 4 సంవత్సరాల లోపు అవిశ్వాసం పెట్టేందుకు వీలు లేకపోవడంతో నాలుగు సంవత్సరాల పదవీ కాలం పూర్తయ్యే వరకు అధికార పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాసం జోలికి వెళ్లలేదు. ఈ నెల జూలై 5వ తేదీతో వైస్‌ ఎంపీపీల పదవీ కాలం నాలుగు సంవత్సరాలు పూర్తి కావడంతో వైస్‌ ఎంపీపీలపై అవిశ్వాసం పెట్టేందుకు అవకాశం రావడంతో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీటీసీలు ఏకమై నడుం బిగించి వైస్‌ ఎంపీపీల పైన అవిశ్వాసానికి శ్రీకారం చుట్టారు.

రెండు మండలాల వైస్‌ ఎంపీపీలపై అవిశ్వాసం

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండల ప్రజా పరిషత్‌ వైస్‌ ఎంపీపీలపైన అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీటీసీలు ఇటీవలే అవిశ్వాసం పెట్టారు. నాగిరెడ్డిపేట వైస్‌ ఎంపీపీ దివిటి రాజ్‌దాస్‌ పైన అవిశ్వాసం పెడుతూ మండలంలోని ఎనిమిది మంది అధికార పార్టీ ఎంపీటీసీలు ఈ నెల 7న ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీను నాయక్‌కు అవిశ్వాసం నోటీసును అందజేశారు. మండలంలో పది మంది ఎంపీటీసీలకు గాను ధర్మారెడ్డి ఎంపీటీసీగా గెలుపొంది ఎంపీపీగా ఎన్నికైన కృష్ణవేణి పార్టీ విప్‌ దిక్కరణతో ఆమె తన పదవిని కోల్పోయారు. అనంతరం ఆమె అనారోగ్యం కారణంగా మృతి చెందారు. దీంతో వైస్‌ ఎంపీపీగా ఎన్నికైన రాజ్‌దాస్‌ ఇన్‌చార్జీ ఎంపీపీగా బాధ్యతలు చేపట్టి గత నాలుగు సంవత్సరాలుగా ఇన్‌చార్జి ఎంపీపీగా కొనసాగుతున్నారు. దీంతో మండలానికి చెందిన 8 మంది ఎంపీటీసీలు వైస్‌ ఎంపీపీ రాజ్‌దాస్‌పైన అవిశ్వాసం పెట్టారు. అలాగే ఎల్లారెడ్డి మండల ప్రజా పరిషత్‌ వైస్‌ ఎంపీపీ పెద్దెడ్ల నర్సింలు పైన మండలానికి చెందిన ఆరుగురు ఎంపీటీసీలు అవిశ్వాసం పెడుతూ ఈ నెల 11న ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీను నాయక్‌కు అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశారు.

అవిశ్వాసం సెగ ఇతర మండలాలకు పాకేనా?

వైస్‌ ఎంపీపీల అవిశ్వాసం సెగ ఇతర మండలాలకు పాకుతుందేమోనని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఆయా మండలాల వైస్‌ ఎంపీపీలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వైస్‌ ఎంపీపీలపై ఆయా మండలాల అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే రెండు మండలాల వైస్‌ ఎంపీపీలపైన అవిశ్వాసం పెట్టడంతో నియోజకవర్గంలోని ఇతర మండలాల వైస్‌ ఎంపీపీలకు భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 2న అవిశ్వాసంపై బల పరీక్ష

నాగిరెడ్డిపేట మండల ప్రజా పరిషత్‌ వైస్‌ ఎంపీపీ దివిటి రాజ్‌దాస్‌పై ఆగస్టు 2న అవిశ్వాస బల పరీక్ష కోసం అధికారులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. వైస్‌ ఎంపీపీ రాజ్‌దాస్‌పైన మండలంలోని 8 మంది అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీటీసీలు ఇటీవల అవిశ్వాసం నోటీసును ఎల్లారెడ్డి ఆర్డీవో శ్రీను నాయక్‌కు అందజేశారు. దీనిలో భాగంగా అధికారులు ఎంపీటీసీల సంతకాలను పరిశీలించి అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన ఎంపీటీసీల సంతకాలు సరైనవేని నిర్ధారించారు. ఈ మేరకు ఆగస్టు 2వ తేదీన ఉదయం 11 గంటలకు నాగిరెడ్డిపేట మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో బల పరీక్ష కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు, సమావేశానికి హాజరు కావాల్సిందిగా మండల ఎంపీటీసీలందరికీ అధికారులు నోటీసులు అందజేశారు.

Updated Date - 2023-07-14T23:51:44+05:30 IST