మహిళలు ఆర్థికంగా ఎదగాలి

ABN , First Publish Date - 2023-07-18T23:47:54+05:30 IST

మహిళలు వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా పరిపుష్టిని సాధించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని రోటరీక్లబ్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ఆఽధ్వర్యంలో మహిళా మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి
మహిళలకు చెక్‌ను అందిస్తున్న కలెక్టర్‌, బ్యాంక్‌ అధికారులు

కామారెడ్డి టౌన్‌, జూలై 18: మహిళలు వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా పరిపుష్టిని సాధించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలోని రోటరీక్లబ్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ ఆఽధ్వర్యంలో మహిళా మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడుతూ మహిళలు వ్యవసాయంతో పాటు చేపలు, తేనెటీగలు, పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, కూరగాయల సాగు, ఆయిల్‌పాం వంటి వాటిని చేపట్టి ఆర్థికంగా బలోపేతం కావాలని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ చైర్మన్‌ శోభ మాట్లాడుతూ అర్హత గల స్వయం సహాయక సంఘాలకు రూ.20లక్షల వరకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఆర్థిక క్రమ శిక్షణతో మహిళలు అభివృద్ధికి బాటలు వేసుకోవాలని తెలిపారు. పొదుపు రికవరీ విషయంలో నిర్లక్ష్యం తగదని ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రామీణ బ్యాంక్‌ ద్వారా పంట రుణాలు, బంగారంపై రుణాలు, గృహ, వ్యక్తిగత, విద్య, మార్టిగేజ్‌ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. గృహ రుణంపై ఫిక్స్‌డ్‌ రేట్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌, డిపాజిట్లపైన వడ్డీ రేట్లు అన్ని బ్యాంకుల కంటే అధిక వడ్డీరేటు అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి సామాజిక భద్రత పథకాల్లో చేరి ఆర్థిక భరోసా పొందాలని తెలిపారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ 427 శాఖల్లో 25వేల కోట్ల రూపాయ వ్యాపారాన్ని అధిగమించడం జరిగిందని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ స్వయం సహాయక సంఘాలకు రూ.35 కోట్ల రుణాలను అందించారు. ఈ కార్యక్రమంలో రీజినల్‌ మేనేజర్‌ నవీన్‌, డీఆర్‌డీవో సాయన్న, లీడ్‌బ్యాంక్‌ మేనేజర్‌ సుధీర్‌ భార్గవ్‌, డీపీఎం రవీందర్‌, గ్రామీణ బ్యాంక్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితా రూపకల్పన పకడ్బందీగా అమలు చేయాలి

ఓటర్ల జాబితా రూపకల్పన పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎన్నికల అధికారులకు ఓటర్ల జాబితా రూపకల్పనపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రెండో విడత ఓటరు జాబితా సవరణలో భాగంగా డ్రాఫ్ట్‌ ఓటరు జాబితా విడుదల ముందు వచ్చిన ప్రతీ దరఖాస్తును పరిశీలన పూర్తి చేయాలని తెలిపారు. ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటరు వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి ధ్రువీకరణ పూర్తి చేయాలని తెలిపారు. ఇంటింటి సర్వే నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులు, ఆన్‌లైన్‌ ద్వారా ఫారం-6,7,8 కింద వచ్చిన దరఖాస్తులను ఈనెల 27 నాటికి క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఆర్‌డీవో శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌, ఎన్నికల సూపరింటెండెంట్‌ సాయిభుజంగరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-18T23:47:54+05:30 IST