TSPSC Leakage: పేపర్ లీక్ కేసు.. నోరు విప్పిన ప్రవీణ్..!
ABN , First Publish Date - 2023-03-27T19:21:30+05:30 IST
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో (TSPSC Paper Leakage Case) రెండో రోజు సిట్ కస్టడీ ముగిసింది. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌ను సిట్ ప్రశ్నించింది.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో (TSPSC Paper Leakage Case) రెండో రోజు సిట్ కస్టడీ ముగిసింది. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా, రాజేశ్వర్‌ను సిట్ ప్రశ్నించింది. మరోవైపు గ్రూప్-1 పరీక్ష రాసిన 40 మందిని కూడా సిట్ ప్రశ్నించింది. 40 మందికి సిట్ అధికారులు ఎఫీషియన్సీ టెస్ట్ (Efficiency Test) నిర్వహించారు. పరీక్ష రాసిన 40 మందికి లీక్‌తో దాదాపు సంబంధం లేదని నిర్ధారించారు. సిట్ తమదైన శైలిలో ప్రశ్నించడంతో ప్రవీణ్ నోరు విప్పినట్లు తెలుస్తోంది. నిందితుడు ప్రవీణ్ ఇంట్లో 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనంగా శంకర్లక్ష్మి డైరీలోని పాస్వర్డ్ తెలుసుకుని.. కంప్యూటర్లో డేటా చోరీ చేసినట్లు సిట్ తేల్చింది. రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్‌కు సిట్ ఎల్ఓసీ (L0C) జారీ చేసింది. రాజశేఖర్ ద్వారా గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని ప్రశాంత్ పొందాడు. ఏఈ ప్రశ్నాపత్రం లీక్ కేసులో దళారీగా తిరుపతి వ్యవహరించినట్లు గుర్తించారు. డాక్యా నుంచి ప్రశ్నాపత్రాన్ని తీసుకొని రాజేందర్‌కు తిరుపతి విక్రయించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు (SIT Officials).. మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఏఈ ప్రశ్నాపత్రాన్ని నిందితులు డాక్యా అండ్ గ్యాంగ్ బ్లాక్ టికెట్ల మాదిరిగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేయడానికి పెట్టిన ఖర్చును తిరిగి సమకూర్చుకునే క్రమంలో చెయిన్ ప్రాసెస్‌లో కొనుగోలు పెట్టినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. షాద్‌నగర్‌కు చెందిన రాజేంద్రకు రూ.10 లక్షలు ఒప్పందం కింద డాక్యా ఏఈ పేపర్ అమ్మినట్లు తెలిసింది. ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టి ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసిన రాజేంద్ర.. ఆ పేపర్‌ను వేరొకరికి విక్రయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒకరి నుంచి ఒకరికి దాదాపు వంద మందికి ప్రశ్నాపత్రం చేరినట్లు భావిస్తున్నారు. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. కాగా రేణుక, డాక్యా నుంచి అత్యధికంగా పాలమూరు పరిసర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు పేపర్ వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు.