PM Modi:తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన వేళ.. ఎస్సీ ఉప వర్గీకరణ ప్రకటించే అవకాశం
ABN , First Publish Date - 2023-11-10T09:01:23+05:30 IST
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ప్రధాని మోదీ(PM Modi) షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మాదిగలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న ఎస్సీ(SC) ఉప వర్గీకరణను మోదీ ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ప్రధాని మోదీ(PM Modi) షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మాదిగలు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తోన్న ఎస్సీ(SC) ఉప వర్గీకరణను మోదీ ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలోని ఎస్సీ జనాభాలో మాదిగ కులస్థులు 60 శాతం ఉన్నారు. 20-25 నియోజకవర్గాల్లో వీరు కీలక ఓట్ బ్యాంక్ గా ఉన్నారు. 4 - 5 సెగ్మెంట్లలో రెండో పెద్ద సామాజికవర్గం కావడంతో ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించే పరిస్థితి మాదిగలకు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. రిజర్వేషన్ ఉన్నా తమ ప్రయోజనాలు దెబ్బ తింటున్నాయని మాదిగలు అసంతృప్తి ఉన్నారు. దీంతో ఎస్సీ ఉప వర్గీకరణ చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS) మాదిగలు, ఉపకులాల మహాసభ సమావేశాలు తరచూ నిర్వహిస్తోంది.
ఎస్సీ ఉపవర్గీకరణ చేయాలని 3 దశాబ్దాలుగా ఆ సంస్థ డిమాండ్ చేస్తోంది. వర్గీకరణకు బీజేపీ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వర్గీకరణ చేస్తే.. బీఆర్ఎస్(BRS) ప్రకటించిన దళితబంధు పథకానికి బీజేపీ(BJP) నుంచి గట్టి కౌంటర్ పడుతుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. 2018 ఎన్నికలో ఎంఆర్పీఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. అయితే 2023 ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇస్తుందనే విషయంలో స్తబ్దత కొనసాగుతోంది. ఆ సంస్థ మద్దతు పొందేందుకు బీజేపీ ఆరాటపడుతోంది. అక్టోబర్ లో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amithshah)ను కలిసి ఎస్సీ ఉపవర్గీకరణ చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. తన వినతిపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. 'పరేడ్ గ్రౌండ్ పబ్లిక్ మీటింగ్ లో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణను ప్రకటించి, పార్లమెంట్ లో చట్టాన్ని రూపొందించి ఆమోదిస్తారని మేం ఆశిస్తున్నాం. నవంబర్ 11న ప్రధాని సభ తరువాత మేం ఎవరికి మద్దతు ఇవ్వాలనే నిర్ణయం ఆధారపడి ఉంటుంది' అని మందకృష్ణ తెలిపారు. కాగా ప్రధాని మోదీ నవంబర్ 11న ఎన్నికల పర్యటన నిమిత్తం తెలంగాణకు రానున్నారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసే సభలో ప్రసంగించనున్నారు.