Tenth paper leakage: హన్మకొండ మెజిస్ట్రేట్ ఎదుట బండి సంజయ్‌ను హాజరుపర్చిన పోలీసులు

ABN , First Publish Date - 2023-04-05T18:20:51+05:30 IST

హన్మకొండ మేజిస్ట్రేట్ (Hanmakonda Magistrate) ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ (Bandi Sanjay)ను పోలీసులు హాజరుపర్చారు.

Tenth paper leakage: హన్మకొండ మెజిస్ట్రేట్ ఎదుట బండి సంజయ్‌ను హాజరుపర్చిన పోలీసులు

హన్మకొండ: హన్మకొండ మేజిస్ట్రేట్ (Hanmakonda Magistrate) ముందు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్ (Bandi Sanjay)ను పోలీసులు హాజరుపర్చారు. బండి సంజయ్‌ లాయర్లను మెజిస్ట్రేట్ పిలిపించింది. బండి సంజయ్‌ అరెస్ట్ అక్రమమని న్యాయవాదులు వాదించారు. సంజయ్‌ తరపున లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇరువర్గాల వాదనలు ముగిశాయి. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఉత్తర్వులు వెలువరించనుంది.

గంట ముందు వరంగల్ సీపీ రంగనాథ్‌ (CP Ranganath) మీడియాతో మాట్లాడుతూ టెన్త్ హిందీ పేపర్‌ను ప్రశాంత్ వైరల్ చేశాడని, మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రశాంత్‌, మహేష్‌ ప్రశ్నాపత్రాన్ని బండి సంజయ్‌ (Bandi Sanjay)కు పంపారని, బండి సంజయ్‌కు ఉదయం 11.24 గంటలకు క్వశ్చన్‌ పేపర్ చేరిందని సీపీ వెల్లడించారు. ఏ2 ప్రశాంత్‌ ఎమ్మెల్యే ఈటలకు ఉదయం 10.41 గంటలకు పేపర్ పంపాడని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఉదయం 9.30 గంటలకే ప్రశ్నాపత్రం లీకైనట్లు అసత్య ప్రచారం చేశారని, అరెస్ట్ సమయంలో బండి సంజయ్‌ తన దగ్గర ఫోన్‌ లేదన్నారని సీపీ చెప్పారు. విచారణలో బండి సంజయ్ నేరాన్ని ఒప్పుకున్నారని, బీజేపీలో చాలామందికి పేపర్ షేర్ చేశారని వరంగల్ సీపీ రంగనాథ్‌ పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం పంపాక ప్రశాంత్ 149 మందితో మాట్లాడాడని, పేపర్ లీక్‌కు ముందు రోజు బండి సంజయ్‌, ప్రశాంత్ చాట్ చేసుకున్నారని, పథకం ప్రకారమే ఇదంతా జరిగిందని సీపీ తెలిపారు. కమలాపూర్‌ స్కూల్ నుంచి పేపర్ బయటకు వచ్చిందన్నారు.

పేపర్‌ లీక్‌ కేసులో మరికొందరు కీలక సాక్షులను ప్రశ్నించాల్సి ఉందని, అనవసరంగా ఈ కేసులో ఇరికించాలనే ఉద్దేశం తమకు లేదని, బండి సంజయ్‌ అరెస్ట్‌పై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చామని సీపీ తెలిపారు. విచారణలో ఏ2 ప్రశాంత్‌ కూడా నేరాన్ని అంగీకరించాడని, సంజయ్‌ ఫోన్ దొరికి ఉంటే చాలా విషయాలు బయటకు వచ్చేవి అని సీపీ అన్నారు. ప్రశాంత్ పేపర్ బయటకు పంపిన వెంటనే బండి సంజయ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టారని, బండి సంజయ్‌ దురుద్దేశంతోనే ఇలా చేసినట్లు నిర్ధారణ అయిందని సీపీ స్పష్టం చేశారు.

టెన్త్‌ పేపర్‌ లీక్‌ కేసులో A1గా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు. A2గా బూర ప్రశాంత్‌, A3గా మహేష్‌, A4గా బాలుడు, A5గా మోతం శివగణేశ్‌, A6గా పోగు సుభాష్‌, A7గా పోగు శశాంక్, A8గా దూలం శ్రీకాంత్‌, A9గా పెరుమాండ్ల శార్మిక్, A10గా పోతబోయిన వసంత్‌ను పోలీస్ రిమాండ్ రిపోర్ట్‌లో చేర్చారు.

పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుట్ర చేస్తున్నారని.. అందుకే ముందస్తు చర్యగా ఆయనను అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. వికారాబాద్ (Vikarabad), కమలపూర్‌ (Kamalapur)లో పేపర్ లీకేజ్‌ (Paper Leakage)లపై బండి సంజయ్ ప్రెస్ నోట్ (Press Note) ఇచ్చారని, పేపర్ లీకేజ్‌లకు ప్రభుత్వమే బాధ్యతంటూ.. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని పోలీసులు ఎఫ్ఐఆర్‌ (FIR)లో పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ధర్నాలు చేయాలని, పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగేలా ఆందోళనలు చేయాలని బీజేపీ శ్రేణులకు ఉద్దేశపూర్వకంగా పిలుపునిచ్చారని పోలీసులు పేర్కొన్నారు. బండి సంజయ్ చర్యల వల్ల పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అందుకే ముందస్తుగా అరెస్టు చేశామన్నారు. అనేక మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలోపెట్టుకుని, పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్‌ని ప్రివెన్షన్ కింద అరెస్ట్ చేశామని పోలీసులు స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-05T18:45:07+05:30 IST