Share News

Telangana Election: ఈ.. ‘‘దూకుడు’’!!.. నాలుగైదు పార్టీలు మారుతున్న వైనం

ABN , First Publish Date - 2023-10-23T05:38:56+05:30 IST

అసలే ఎన్నికల సమయం. నాయకులకు డిమాండ్‌ ఉండే కాలం. టికెట్ల కోసం పార్టీల అధిష్ఠానాల చుట్టూ చక్కర్లు కొట్టే తరుణం.

Telangana Election: ఈ.. ‘‘దూకుడు’’!!.. నాలుగైదు పార్టీలు మారుతున్న వైనం

ఎన్నికల కాలంలో జంపింగ్‌ల జోరు..

తీవ్రంగా దూషించిన పార్టీలోకే చేరిక

నాలుగైదు పార్టీలు మారుతున్న వైనం

ఎవరొచ్చినా ఆహ్వానిస్తున్న పక్షాలు...

నాయకుల తీరుపై ప్రజల్లో విస్మయం

హైదరాబాద్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): అసలే ఎన్నికల సమయం. నాయకులకు డిమాండ్‌ ఉండే కాలం. టికెట్ల కోసం పార్టీల అధిష్ఠానాల చుట్టూ చక్కర్లు కొట్టే తరుణం. ఇదే క్రమంలో పార్టీల్లోకి ‘‘దూకుడు’’లకూ అనువైన వాతావరణం కూడా. అందుకే ప్రస్తుతం రాష్ట్రంలో టికెట్‌ దక్కనివారు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఇలాంటి అసంతృప్తులను గుర్తించి పార్టీలు కూడా పదవుల ఆశ చూపి గాలం వేస్తున్నాయి. కండువాలు కప్పేస్తున్నాయి. కొద్ది రోజులుగా ఇలాంటి జంపింగ్‌ జపాంగ్‌లు ఎక్కువయ్యారు. బీఆర్‌ఎ్‌సలో టికెట్ల పంపిణీదాదాపు పూర్తవడంతో ఆ పార్టీలోని అసంతృప్తులంతా కాంగ్రెస్‌, బీజేపీ వైపు చూస్తున్నారు. టికెట్‌ వచ్చే అవకాశం ఉన్నచోటకు దూకేస్తున్నారు. కొందరైతే టికెట్‌కు చాన్స్‌ కున్నా అధికారంలోకి వస్తుందనుకుంటున్న పార్టీలో చేరుతున్నారు.

వలసలే గెలుపునకు కొలమానం..

సహజంగా ఎన్నికల సమయంలో ఏ పార్టీలోకి పెద్దఎత్తున చేరికలుంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందన్న భావన ఉంటుంది. పెద్ద నాయకులతో పాటు క్షేత్ర స్థాయిలో ఉండే సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ప్రభావం చూపగల నేతలు కూడా ఈ సమయంలో పార్టీలు మారుతుంటారు. వీరు కూడా ఓటరు నాడి పసిగట్టి, ఏ పార్టీలో ఎక్కువగా చేరికలున్నాయా? అని చూస్తుంటారు. కాగా, ఎన్నికలకు ఆర్నెల్ల ముందే పార్టీలు చేరికలపై దృష్టిసారిస్తాయి. వీలైనంతగా ఇతర పార్టీల్లోని ప్రజాప్రతినిధులకు కండువాలను కప్పేస్తుంటాయి. తద్వారా జోష్‌తో పాటు అధికారంలోకి వస్తున్నామన్న భావనను ఓటర్లలో సృష్టిస్తుంటాయి.


తిట్టి మరీ.. అదే పార్టీల్లో చేరిక

రాష్ట్రంలో కొందరు నేతలు దశాబ్ద కాలంలో ప్రధాన పార్టీలన్నిటినీ చుట్టేశారు. మరికొందరు ఏ పార్టీ అధికారంలో ఉంటే అటు చేరడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇలాంటి వలసలను బీఆర్‌ఎస్‌ ఎక్కువగా ప్రోత్సహించింది. ఇలా కిక్కిరిసిన కారులో ఉక్కపోతకు గురైనవారు ఆ పార్టీని వీడుతున్నారు. ఉద్యమ నేతగా ఉన్నప్పుడు, సీఎం అయ్యాక కూడా కేసీఆర్‌ను కొందరు నాయకులు విపరీతంగా దూషించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన చెరుకు సుధాకర్‌, జిట్టా బాలకృష్ణారెడ్డి గతంలో బీఆర్‌ఎ్‌సను వీడి సొంతంగా పార్టీలు పెట్టుకున్నారు. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. మళ్లీ ఇప్పుడు బీఆర్‌ఎ్‌సలోకి వచ్చారు. ఇదే వరుసలో దాసోజు శ్రావణ్‌ కూడా ఉన్నారు.

వారు కాలుపెడితే.. ఓటమేనట?

వలసల పర్వం ఊపుందుకుంటున్న తరుణంలో కొందరు నేతలపై పార్టీల్లో బలమైన అభిప్రాయాలున్నాయి. ఇలాంటివారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాదనేది సెంటిమెంటు. నాలుగైదు పార్టీలు మారి వాక్చాతుర్యం ఉన్న ఓ నేత కొన్ని నెలల కిందట అధికార పార్టీలో చేరారు. ఈయన ఏ పార్టీలో ఉంటే అది అధికారంలోకి రాదనే అభిప్రాయం ఉంది.

కాంగ్రెస్‌ టికెట్‌ రాకున్నా.. బీఆర్‌ఎస్‌పై వ్యతిరేకతతో..

బీఆర్‌ఎ్‌సలో కొందరు ఇమడలేకపోతున్నారు. ఆ పార్టీ పెద్దల తీరును భరించలేకపోతున్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌ కోరుకుంటే తప్ప.. మిగతా సమయాల్లో ఎవరికీ అందుబాటులో ఉండరన్న ప్రచారం బలంగా ఉంది. దీకితోడు హామీలను నెరవేర్చకపోవడం, టికెట్‌ నిరాకరించడం వంటి కారణాలతో బీఆర్‌ఎస్‌ నుంచి వలసలు అధికంగా ఉంటున్నాయి. మూడోసారి అధికారంలోకి రాదన్న భావన కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే, స్పష్టమైన హామీ లేకున్నా.. గెలిస్తే కనీసం అధికార పార్టీలో ఉన్నామన్న భావన కలుగుతుందని కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. కల్వకుర్తి టికెట్‌ ఆశించిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. దీంతో కాంగ్రె్‌సలో చేరారు. మంత్రి పదవి ఇస్తామని బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆఫర్‌ చేసినా ఆయన లెక్క చేయలేదు. మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బీఆర్‌ఎ్‌సను వీడి కాంగ్రె్‌సలో చేరారు. మేడ్చల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఖరారు చేసింది. కానీ, బీఆర్‌ఎ్‌సను ఓడించాలన్న కసితో, హామీ లేకున్నా.. సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

Updated Date - 2023-10-23T09:28:39+05:30 IST