Polling: భద్రాద్రి జిల్లాలో 4 గంటల వరకే పోలింగ్
ABN , First Publish Date - 2023-10-31T13:01:31+05:30 IST
మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయాన్ని రాష్ట్ర ఎన్నికల
- మావోయిస్టు ప్రభావిత జిల్లా కావడంతో గంట సమయం కుదింపు
- జిల్లాలోని ఐదు నియోజకవర్గాలోనూ అమలు
కొత్తగూడెం, (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు ప్రభావిత జిల్లాగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కుదించింది. నవంబరు 30న జరిగే పోలింగ్ సమయాన్ని ఒక గంట కుదించి.. ఉదయం 7గంటల నుంచి 4గంటల వరకు నిర్వహించనుంది. వాస్తవానికి సాయంత్రం 5గంటలకు ముగియాల్సి ఉన్నా... భద్రతాకారణాల దృష్ట్యా భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, పినపాక, భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల్లో 4గంటలకే ముగించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. అయితే సాయంత్రం 4గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఈ విషయంపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఎన్నికల అధికారులు ముందస్తు ప్రచారం నిర్వహించనున్నారు. భద్రాచలం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, కొత్తగూడెం(Bhadrachalam, Pinapaka, Illendu, Ashwarapeta, Kothagudem) నియోజకవర్గాల పరిఽధిలో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. అయా ప్రాంతాల నుంచి నియోజకవర్గంలోని స్ర్టాంగ్‌రూంల్లోకి పోలింగ్ సామగ్రిని తరలించేందుకు ఆలస్యం కాకుండా ముందుగానే బయలుదేరేందుకు ఒక గంట కుదించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా మొత్తం మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉండడంతో మారుమూల ఏజెన్సీ ప్రాంతాలనుంచి ఈవీఎంలను తరలించేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించనున్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల యంత్రాంగం ఇప్పటి నుంచే ఆయా కేంద్రాలపై నిఘా పెట్టింది. అయా ప్రాంతాల్లో ఓటర్లు ఎలాంటి భయాలు లేకుండా పోలింగ్‌స్టేషన్లకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వృద్దులు, వికలాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లను సైతం చేస్తోంది.