Share News

Ponguleti: ఐదేళ్లుగా అధికార పార్టీ నాయకులు ఎక్కడ గడ్డి పీకారు..

ABN , First Publish Date - 2023-10-13T11:50:18+05:30 IST

ఐదేళ్లుగా కాంట్రాక్టర్లు, సింగరేణి నుంచి వసూళ్లు చేసుకునే పనిలో ఉన్న అధికార పార్టీ పార్టీ నాయకులకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే సరికి ప్రజలు

Ponguleti: ఐదేళ్లుగా అధికార పార్టీ నాయకులు ఎక్కడ గడ్డి పీకారు..

- ఎన్నికలొచ్చే సరికి ప్రజలు గుర్తుకొచ్చారా?

- కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే సత్తుపల్లి జిల్లా ఏర్పాటు చేస్తాం

- కొండూరు సుధాకర్‌ పాదయాత్ర ముగింపు సభలో పొంగులేటి

సత్తుపల్లి(ఖమ్మం): ఐదేళ్లుగా కాంట్రాక్టర్లు, సింగరేణి నుంచి వసూళ్లు చేసుకునే పనిలో ఉన్న అధికార పార్టీ పార్టీ నాయకులకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే సరికి ప్రజలు గుర్తుకొచ్చారని టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్‌ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) మండిపడ్డారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేత కొండూరు సుధాకర్‌ చేపట్టిన పాదయాత్ర గురువారం ముగియగా సత్తుపల్లి రింగ్‌ సెంటర్‌లో జరిగిన ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లుగా ప్రజలను పట్టించుకోని వారు.. ఇప్పుడు దళితబంధు, బీసీ బంధు, గృహలక్ష్మీ ఇస్తామంటూ హడావుడి చేయడమేంటని ప్రశ్నించారు. అలాగే గొర్రెలు ఇస్తామని ఏడాదిన్నర క్రితం యాదవుల నుంచి డబ్బులు వసూలు చేసి వారిని మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. సత్తుపల్లి(Sattupalli) కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామని, సత్తుపల్లిలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల, ప్రతి మండల కేంద్రంలో 50పడకల ప్రభుత్వ ఆసుపత్రి మం జూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే సింగరేణి ఓసీ బ్లాస్టింగ్‌తో ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు ఇందిరమ్మ రాజ్యం రాగానే ఇళ్లు పునఃనిర్మించి ఇస్తామని ప్రకటిం చారు. ఇక బీఆర్‌ఎస్‌ నాయకులు అధికార మదంతో ఉన్నారనడానికి ఒక ఎమ్మెల్సీ మాట్లాడిన వీడియో చూస్తే అర్థమవుతుందని, అధికారంతో విర్రవీగుతున్న వారికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.

అన్నివర్గాలను మోసగించిన బీఆర్‌ఎస్‌: కొండూరు

బీఆర్‌ఎస్‌ పాలనలో అన్నివర్గాలను మోసంచేశారని, తాను నియోజకవర్గంలో ఎనిమిది రోజుల పాటు 140కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఈ సందర్భంగా రైతుల బాధలు తన దృష్టికి వచ్చాయని కొండూరు సుధాకర్‌ పేర్కొన్నారు. సాగుకు విద్యుత్‌ సక్రమంగా అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ప్రతీ గ్రామంలో పేదలు ఇళ్లు, ఇళ్ల స్థలాలు కోరుకుంటున్నారన్నారు. సత్తుపల్లిలోని సింగరేణి బొగ్గు గనుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, రూ.వందల కోట్లు సింగరేణి నుంచి వస్తున్నా అవి ఇతర ప్రాంతాలకు మళ్లుతున్నాయని, అభివృద్ధి కోసం ఈ నిధులను అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నీరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, దీనిని పరిష్కరించడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు.

ముగిసిన పాదయాత్ర: చివరి రోజు పాదయాత్రలో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్‌ మువ్వా విజయబాబు తదితరులు సత్తుపల్లి జేవీఆర్‌ పార్క్‌ నుంచి బస్టాండ్‌ రింగ్‌ సెంటర్‌ వరకు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గ్రాండ్‌ మౌలాలీ, దూదిపాళ్ల రాంబాబు, మందపాటి పద్మజ్యోతి రవీందర్‌రెడ్డి, తోట సుజలరాణిగణేష్‌, సర్పంచ్‌ మందపాటి ముత్తారెడ్డి, నాయకులు ఉడతనేని అప్పారావు, మలిరెడ్డి పూర్ణచంద్రారెడ్డి, పిల్లి నవజీవన్‌బాబు, కొత్తూరు కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

pongu.jpg

Updated Date - 2023-10-13T11:55:02+05:30 IST