ponguleti: పొంగులేటి సంచలన కామెంట్స్.. బీఆర్‌ఎస్‌ని భూస్థాపితం చేయాలి
ABN , First Publish Date - 2023-08-23T11:13:05+05:30 IST
రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి రుణపడి ఉన్నామని, రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను భూ స్థాపితం చేసి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు
జూలూరుపాడు(భద్రాద్రి కొత్తగూడెం): రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీకి రుణపడి ఉన్నామని, రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను భూ స్థాపితం చేసి.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు శ్రమించాలని పీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy) పిలుపునిచ్చారు. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదనరావు నివాసంలో మంగళవారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పెట్టిన భిక్షతోనే రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిందని, తొమ్మిదేళ్లల్లో బీఆర్‌ఎస్ చేసిన అరాచకాలు, కేసీఆర్ చెప్పి కల్లబొల్లి మాటలను ప్రజలకు వివరించాలని సూచించారు. తొమ్మిదేళ్ల పాటు ఆర్టీసీ పట్టించుకోని సీఎం కేసీఆర్(CM KCR) ఎన్నికలు రావడంతో ఆ సంస్థ కార్మికులపై ప్రేమ వలకబోస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారన్నారు. ఓటమి భయంతోనే కొత్తకొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారని, కేసీఆర్ కపటనాటకాలను ప్రజలు గమనించాలన్నారు. రైతులపై ప్రేమను కురిపిస్తూ రుణమాఫీ చేస్తున్నామన్నారని, కానీ అందులో అధికభాగం వడ్డీకే సరిపోయిందన్నారు. వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత ప్రతీ కార్యకర్తపై ఉందన్నారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా నాలుగున్నరేళ్లుగా ప్రజలు తనకు అండగా ఉంటున్నారని, పదువులు లేని అనేకమంది నాయకులు ఎన్నికల సమయంలో వస్తే వారిని నమ్మొద్దన్నారు. ఈ సమావేశంలో వైరా నియోజకవర్గ నాయకురాలు బాణోత్ విజయబాయి, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదనరావు, సీనియర్ నాయకుడు ముత్తినేని రామయ్య, నాయకులు ధారావత్ రాంబాబు, దుద్దుకూరి నర్సింహారావు, యండపల్లి చిట్టిబాబు, బొడ్డు కృష్ణయ్య, దుద్దుకూరు సుమంత్, నర్వనేని పుల్లారావు, పోతురాజు నాగరాజు, నరేష్, టి.లక్ష్మయ్య, అమృత తదితరులు పాల్గొన్నారు.