Share News

Postal votes: పోస్టల్‌ ఓట్లపై గురి.. రంగంలోకి అభ్యర్థుల టీమ్‌లు

ABN , First Publish Date - 2023-11-25T09:06:46+05:30 IST

ఎన్నికల్లో పోలయ్యే ప్రతీ ఓటు తనకే పడేవిధంగా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సామాజిక వర్గాల

Postal votes: పోస్టల్‌ ఓట్లపై గురి.. రంగంలోకి అభ్యర్థుల టీమ్‌లు

- ఎల్‌బీనగర్‌లో ఓ బార్‌లో విందు ఏర్పాటు

- మల్కాజిగిరిలో విందుతో పాటు నగదు

- ప్రలోభాలకు తెరలేపుతున్న పలు పార్టీలు

గత ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పలువురు అతి తక్కువ ఓట్లతోనే గట్టెక్కారు. నగరంలో అంబర్‌పేట నియోజకవర్గ అభ్యర్థి కేవలం 1,016 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఈ ఓట్లలో కనీసం 550 తనకు అధికంగా వస్తే గెలుపు తనను వరించేదని ప్రత్యర్థి భావించారు. ఇలా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రతీ ఓటును తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ఎత్తుగడలు వేస్తున్నారు.

హైదరాబాద్‌ సిటీ, (ఆంధ్రజ్యోతి) ఎన్నికల్లో పోలయ్యే ప్రతీ ఓటు తనకే పడేవిధంగా అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా, అపార్ట్‌మెంట్ల వారీగా, బస్తీలు, కాలనీలు వారీగా ఓట్ల కోసం కుస్తీ పడుతూనే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల(Postal ballot votes)పై కూడా కన్నేశారు. ఆ ఓట్ల కోసం టీమ్‌లను రంగంలోకి దించారు. కొన్నిచోట్ల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లున్న వారిని ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

గతంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు, సిబ్బందికి, మిలటరీ ఉద్యోగులకు మాత్రమే సర్వీస్‌ ఓట్లు ఉండేవి. ఈ ఓట్లను పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వేసుకునే అవకాశముండేది. ఈసారి ఎయిర్‌పోర్టు, రైల్వే, ఆల్‌ ఇండియా రేడియో, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, వైద్యారోగ్య, విద్యుత్‌, రోడ్లు భవనాలు, పౌరసరఫరాలు, అగ్నిమాపకశాఖ, మీడియా, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎస్‌సీఐ ఇలా అత్యవసర సేవలు అందించే 13 శాఖల ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పించింది. దివ్యాంగులు, 80 ఏళ్లకు పైబడిన వారి ఓటర్లు 12డీ ఫారం ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఇంటి వద్దే ఓట్లను వేసే అనుమతులిచ్చింది. గతంతో పోల్చుకుంటే మరిన్ని శాఖల ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు పోస్టల్‌ ఓట్లు కల్పించడంతో పలు నియోజకవర్గాల్లో ఆ సంఖ్య వెయ్యికి పైనే ఉంటుంది. దాంతో ఆయా ఓట్లను గంపగుత్తగా వేయించుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు.

రంగంలోకి దిగిన అభ్యర్థుల టీమ్‌లు

2009లో 2,479 పోస్టల్‌ ఓట్లు పోలవ్వగా, 2014లో 6,309 ఓట్లు పోలయ్యాయి. 2018లో పది వేల వరకు పోస్టల్‌ ఓట్లు పోలయ్యాయి. ఈసారి మరింత అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఆ ఓట్ల కోసం అభ్యర్థుల టీమ్‌లు రంగంలోకి దిగాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి తమ అభ్యర్థికే వేయించేందుకు ప్రయత్నిస్తున్నాయి. 80 ఏళ్లకు పైబడిన వృద్ధులకు పలు నియోజకవర్గాల్లో తాయిలాలు అందించినట్లు తెలిసింది. కుటుంబసభ్యుల సమక్షంలో ఓటు వేసే ప్రక్రియ జరుగుతుండడంతో ప్రలోభాలకు గురిచేసిన అభ్యర్థి తమకే ఓటు పడినట్లుగా ధీమాతో ఉన్నారు. మల్కాజిగిరి(Malkajigiri)లో ఓ అభ్యర్థి పోస్టల్‌ ఓటు ఉన్న కొందరికి రూ.3వేల వరకు నగదు అందించినట్లు సమాచారం.

పలు పార్టీల పార్టీలు

పోస్టల్‌ ఓటు ఉన్న ఉద్యోగులను ఫోన్‌ చేసి మరీ అభ్యర్థులు విందులకు ఆహ్వానిస్తున్నారు. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ఓ బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో రెండు రోజులుగా విడతల వారీగా పోస్టల్‌ బ్యాలెట్‌ కలిగిన ఉద్యోగులకు విందు ఏర్పాటు చేశారు. ఇతర అభ్యర్థులకు చెందిన టీమ్‌లు కూడా అదే పనిలో ఉన్నాయి. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, కూకట్‌పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్‌, మహేశ్వరం ఇలా పలు శివారు నియోజకవర్గాల్లో కూడా బ్యాలెట్‌ ఓటర్లను అభ్యర్థుల అనుచరులు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2023-11-25T09:06:47+05:30 IST