Shirisha Case: శిరీష మృతదేహానికి రెండు సార్లు పోస్టుమార్టం
ABN , First Publish Date - 2023-06-12T20:31:22+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష హత్య కేసు మిస్టరీగా మారింది. నిన్న(ఆదివారం) హత్యగానే తేల్చిన పోలీసులు ఇప్పుడు ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు. శిరీష ముఖానికి, శరీర భాగాలపై గాయాలను పరిశీలిస్తే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మాత్రం ఎటూ తేల్చక సస్పెన్స్‌గా కొనసాగిస్తున్నారు.
పరిగి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష హత్య కేసు మిస్టరీగా మారింది. నిన్న(ఆదివారం) హత్యగానే తేల్చిన పోలీసులు ఇప్పుడు ఆత్మహత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు. శిరీష ముఖానికి, శరీర భాగాలపై గాయాలను పరిశీలిస్తే హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు మాత్రం ఎటూ తేల్చక సస్పెన్స్‌గా కొనసాగిస్తున్నారు. పరిగి మండలం కాళ్ళాపూర్ గ్రామానికి చెందిన జట్టు శిరీష(19) శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులో చెరువు దగ్గర హత్యకు గురైన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే సోమవారం బంధువులు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా పోలీసులు వెళ్లి నిలిపివేశారు. అనంతరం శిరీష మృతదేహాన్ని రీ పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు. మహిళా డాక్టర్‌ను గ్రామానికి తీసుకెళ్లి రీ పోస్టుమార్టం నిర్వహించారు. అయితే శరీర భాగాలను పరిశీలించి వైద్యులు వివరాలు సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. 24గంటల వ్యవధిలోనే రెండు సార్లు పోస్టుమార్టం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శిరీష మృతదేహంపై గాయాలు, కళ్లను పొడిచినట్లు, శరీరం కింద భాగంగా స్ర్కూడ్రైవర్ లాంటి వస్తువుతో గాయపరిచినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. అయితే శిరీషది హత్యగా పరిగణిస్తారా.. ఆత్మహత్యగా పరిగణిస్తారా..? అనేది పోలీసులు తెల్చాల్సి ఉంది.
విభిన్న కోణాల్లో దర్యాప్తు
పోలీసులు శిరీష హత్య కేసును విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శిరీష మృతదేహానికి అంత్యక్రియల తర్వాత తండ్రి జంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిరీష బావ అనిల్ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. శిరీష కాల్ డేటా ఆధారంగా శిరీష మృతిచెందిన మరుసటి రోజు యువతి ఫోన్ నుంచి గ్రామంలో ఓ వ్యక్తి ఫోన్‌కాల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. శనివారం రాత్రి ఇంటి వద్ద గొడవ జరిగినప్పుడు శిరీష వద్ద నుంచి ఫోన్‌ను లాగేసుకున్నామని బావ అనిల్ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఫోన్ పాస్‌వర్డ్ తెలియక పోలీసులు డేటా డిలీట్ కాకుండా సీడీఆర్ ద్వారా కాల్ హిస్టరీ సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. శిరీష బావకు పాస్‌వర్డ్ తెలియకుంటే మరుసటి రోజు ఆ ఫోన్ నుంచి కాల్ ఎలా వెళ్తుందన్న ప్రశ్నకు జవాబు లభించాల్సి ఉంది. రీ పోస్టుమార్టం సమయంలో శిరీష శరీరభాగాలపై బలమైన గాయాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. అయితే శిరీషపై లైంగిక్ దాడి జరిగిందా..? ఆ తర్వాతనే హత్య చేసి ఉంటారా..? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. శిరీష హత్యలో తండ్రి జంగయ్య, బావ అనిల్ పాత్రపై కూడా నిశితంగా విచారిస్తున్నారు. ఫోన్ నుంచి వెళ్లిన కాల్ డేటా ఆధారంగా గ్రామానికి చెందిన అజయ్, మహేశ్ అనే ఇద్దరు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.