Rahul Gandhi: రాహుల్‌గాంధీపై అనర్హతవేటు అప్రజాస్వామికం: భట్టి విక్రమార్క
ABN , First Publish Date - 2023-03-26T18:53:45+05:30 IST
కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికం అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు.
ఆసిఫాబాద్: కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు వేయడం అప్రజాస్వామికం అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బూర్గుడ గ్రామంలో సంకల్ప దీక్ష ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం భయానక పరిస్థితుల్లో ఉందని దానిని కాపాడే దిశగా ప్రజలు కదలాలన్నారు. అదానీకి ప్రధాని మోదీ (Prime Minister Modi) సహకరిస్తున్నారని హిండెన్‌బర్గ్ (Hindenburg) నివేదికతో వెల్లడైనప్పటికీ దానిని బీజేపీ ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర (Bharat Jodo yatra) చరిత్రాత్మకమన్నారు. ఈ యాత్రతో రాహుల్‌గాంధీ బీజేపీలో ఒక భయాన్ని సృష్టించారన్నారు. దీనిని భరించలేకనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారన్నారు. లౌకిక వాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేస్తున్న బీజేపీకి సరైన సమయంలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని భట్టి విక్రమార్క హెచ్చరించారు.
ఎంతో చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన వ్యక్తిని బహిష్కరించడం చరిత్రలో దుర్దినమన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో, పీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సంకల్పదీక్ష నిర్వహిస్తున్నారని, దానికి మద్దతుగా పాద యాత్రలో సంకల్ప దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బీజేపీపై పోరాడుతుందన్నారు. దేశసంపదను అదానీ, అంబానీలకు ప్రధాని నరేంద్రమోదీ దోచి పెడుతున్నారని విమిర్శించారు. ఈ విషయమై రాహుల్‌గాంధీ ప్రశ్నిస్తే తప్పుడు కేసులు బనాయించి జైలుశిక్ష పడేలా చేసి కుట్ర పన్నారన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ వారసుడు రాహుల్‌గాంధీపై అనర్హత వేటువేసి భారత ప్రజాస్వామ్యం తలదించుకునేలా మోదీ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఇలాంటి నీచమైన పనిచేస్తోందని దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీని కాపాడుకోవడం కోసం దృఢమైన దీక్షతో కాంగ్రెస్ శ్రేణులు పోరాటానికి కదం తొక్కాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.