Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాన కబురు.. వర్షాలు ఎప్పుడు కురుస్తాయంటే..
ABN , First Publish Date - 2023-09-01T23:17:27+05:30 IST
ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 3 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 3న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఇక వర్షాకాలం మొదలైనట్టేనని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
విజయవాడ: ఈశాన్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఈ నెల 3 నుంచి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 3న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో ఇక వర్షాకాలం మొదలైనట్టేనని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాలను వర్షాలు పలకరించి రోజులు గడుస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఆగస్ట్ నెల చివరి వారంలో ఆంధ్రాలో ఒకపక్క ఎండ కాయగా, మరోపక్క వర్షాలు కురిశాయి. ఉత్తర బంగ్లాదేశ్‌లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే రుతుపవనద్రోణి తూర్పుభాగం పశ్చిమబెంగాల్ మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించింది. దీంతో బంగాళాఖాతం నుంచి వచ్చే తేమగాలులతో వాతావరణ అనిశ్చితి నెలకొని ఉత్తర కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు కురిశాయి.
విజయనగరం జిల్లా నెలివాడలో 96 మి.మీ, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో 85, సంతబొమ్మాళిలో 79.25 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అదే సమయంలో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. ప్రధానంగా దక్షిణ కోస్తాలో ఎండలకు ప్రజలు ఠారెత్తిపోయారు. దేశంలో అత్యధికంగా ఒంగోలులో 39.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో వర్షాలు కురియక పంటలు ఎండిపోతున్నాయి. వరుణ దేవుడి కరుణ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో వర్షాల కోసం వినూత్నంగా కప్పలకు పెళ్లి చేసి ఊరేగించారు. లెంకలపల్లి గ్రామంలో కప్పలకు పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని మహిళలు ఇంటింటికీ బిందెడు నీళ్లు తీసుకువచ్చి ప్రధాన కూడలి వద్ద రెండు కప్పలకు నీళ్లు పోసి పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు మహిళలు కప్పలను ప్రధాన వీధుల గుండా ఊరేగించారు.