Sirisha Case: కాడ్లాపూర్‌లో ఉద్రిక్తత.. శిరీష తండ్రిపై గ్రామస్తుల ఆగ్రహం

ABN , First Publish Date - 2023-06-12T13:12:14+05:30 IST

జిల్లాలోని పరిగి కాడ్లాపూర్‌లో యువతి శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల విచారణపై అన్న శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Sirisha Case: కాడ్లాపూర్‌లో ఉద్రిక్తత.. శిరీష తండ్రిపై గ్రామస్తుల ఆగ్రహం

వికారాబాద్: జిల్లాలోని పరిగి కాడ్లాపూర్‌లో యువతి శిరీష అనుమానాస్పద మృతి కేసులో పోలీసుల విచారణపై అన్న శ్రీకాంత్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హత్య.. ఆత్మహత్య అంటూ పోలీసులు తికమక చేస్తున్నారంటూ ఆవేదన చెందారు. ఆ చిన్న కుంటలో మోకాలి లోతు నీటిలో ఎలా ఆత్మహత్య చేసుకుంటారో చెప్పాలని యువతి అన్న శ్రీకాంత్ ప్రశ్నించారు. ఆ కుంటలో ఎలాంటి రాళ్ళు లేవన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు సమగ్ర విచారణ చేయాలని..తమ కుంటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ‘‘మా నాన్న తప్పు చేసినా... బావ తప్పు చేసిన శిక్షించాలి’’ అని అన్నారు. అసలు నిజం నిగ్గు తెల్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీసుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సరిగ్గా విచారణ చేయడం లేదని అన్నారు. శిరీషది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. యువతి మృతికి తండ్రి, బావ ఇద్దరు కారణమని.. పోలీసులు సరిగ్గా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నిజం తేలే వరకు అంత్యక్రియలు చేయనివ్వమని గ్రామస్తులు తేల్చిచెప్పారు. శిరీష్ తండ్రి జంగయ్యపైనా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఓ మహిళ శిరీష తండ్రి చెంప చెళ్లుమనించింది. ఓ వైపు పోలీసుల విచారణ... తండ్రి జంగయ్యతో గ్రామస్తుల వాగ్వాదంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రీపోస్ట్‌ మార్టం పూర్తి...

మరోవైపు యువతి శిరీష మృతదేహానికి రీ పోస్ట్ మార్టం పూర్తి అయ్యింది. యువతి మృతదేహానికి పరిగి నుంచి వచ్చిన వైద్యురాలు వైష్ణవి రీ పోస్ట్ మార్టం నిర్వహించారు. నీళల్లో దూకినప్పుడు కళ్ళలో పదునైన కర్రలు గుచ్చుకొని ఉంటాయని వైద్యురాలు అనుమానం వ్యక్తం చేశారు. అయితే గుచ్చివుంటారా లేక గుచ్చుకున్నయా అనే ప్రశ్నకు డాక్టర్ సమాధానం దాటవేశారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పి డాక్టర్ వైష్ణవి వెళ్లిపోయారు.

Updated Date - 2023-06-12T13:12:14+05:30 IST