Revanth Reddy: రకుల్ సినిమాకు...కేటీఆర్ పరువుకు లింక్ చేస్తూ రేవంత్ సెటైర్లు
ABN , First Publish Date - 2023-03-31T18:10:33+05:30 IST
తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR)పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైటర్లు వేశారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR)పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సెటైర్లు వేశారు. పరువులేని వ్యక్తి రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారని ఎంపీ విమర్శించారు. హీరోయిన్స్ రకుల్ (Rakul), సమంత (Samantha) వెబ్ సిరీస్‌లను ప్రస్తావించారు. రకుల్ సినిమాకు సైన్ చేసినట్లా.. సమంత సిరీస్‌కు సంతకాలు పెట్టినట్టా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
టీఎస్‌పీఎస్సీ( TSPSC) దొంగలు, దోపిడీదారులకు అడ్డాగా మారిందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. అనర్హులను సభ్యులుగా నియమించారని పేపర్ లీక్పై ప్రభుత్వం కోర్టులో విచారణ ఎదుర్కొంటుందని విమర్శించారు.
ఆధారాలు బయట పెడితే.. తమమీదే కేసులు పెడుతున్నారని, శంకర్లక్ష్మి నుంచే నేరం మొదలైతే.. ఆమెనే సాక్షిగా పెట్టారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీక్ కేసు (TSPSC paper leak case)లో ప్రభుత్వ పెద్దలకు సంబంధాలు ఉన్నాయని, ప్రభుత్వ పెద్దలను తప్పించడానికే సిట్ను నియమించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పెద్దలను కాపాడి దిగువస్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నారని, పేపర్ లీక్ కేసులో విదేశాల్లో ఉన్నవారితో హవాలా రూపంలో నగదు చేతులు మారిందన్నారు.
సిట్ కొద్దిమందిని విచారించి కొందరిని వదిలేస్తుందని, అందరినీ విచారించాలని ఈడీకి ఫిర్యాదు చేశామని, 'ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయో కేటీఆర్ చెప్పారని రేవంత్ అన్నారు. రహస్య సమాచారం కేటీఆర్కు ఎవరు ఇచ్చారు?, తాము సమాచారం ఇవ్వలేదనీ అధికారులు చెబుతున్నారని, మరి దొంగలు ఇచ్చారా? ఆ దొంగలకు కేటీఆర్కు సంబంధం ఏంటి?' అని రేవంత్ రెడ్డి విమర్శించారు.
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ (TSPSC Question Paper Leakage)పై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీలో నిందితులుగా ఉన్న ఇద్దరు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు షమీమ్, రమేశ్‌తో పాటు మాజీ ఉద్యోగి సురేశ్‌లను విచారించి పేపర్ లీకేజీతో ఇంకా ఎంత మందికి సంబంధం ఉందనే విషయాన్ని తేల్చాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతితో నిందితులను 5 రోజుల కస్టడీకి తీసుకున్నారు. బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి ముగ్గురు నిందితులు షమీమ్, రమేశ్, సురేశ్‌లను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి సిట్ కార్యాలయానికి తరలించారు. ముగ్గురు నిందితులపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.