Share News

పువ్వాడకు రూ.51 కోట్లు.. పల్లాకు రూ.21 కోట్ల ఆస్తులు

ABN , First Publish Date - 2023-11-08T11:16:39+05:30 IST

ఖమ్మం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్‌ దాఖలు చేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అఫిడవిట్‌లో తన పేరిట, తన భార్య పేర రూ.51.40 కోట్ల ఆస్తులున్నట్లు ఉన్నట్లు చూపారు.

పువ్వాడకు రూ.51 కోట్లు..  పల్లాకు రూ.21 కోట్ల ఆస్తులు

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి 11.54 కోట్ల సంపద

ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన నేతలు

రాష్ట్రవ్యాప్తంగా 281 నామినేషన్లు దాఖలు

పోలింగ్‌ నిర్వహణపై అధికారులతో ఎన్నికల పరిశీలకుల భేటీ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఖమ్మం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్‌ దాఖలు చేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అఫిడవిట్‌లో తన పేరిట, తన భార్య పేర రూ.51.40 కోట్ల ఆస్తులున్నట్లు ఉన్నట్లు చూపారు. 2022-23 మార్చి నాటికి ఆయన ఆదాయం రూ.89.93 లక్షలు, సతీమణి వసంత లక్ష్మి ఆదాయం రూ.1.60 కోట్లుగా పేర్కొన్నారు. ఆయన చేతిలో రూ.2.95 లక్షలు, సతీమణి చేతిలో రూ.1.90 లక్షల నగదు ఉన్నట్టుగా చూపించారు. అజయ్‌కు రూ.7.55 కోట్లు, వసంతలక్ష్మి పేరు మీద రూ.4.40 కోట్ల చరాస్తులున్నట్లు వెల్లడించారు. ఆయన పేరు మీద రూ.21.18 కోట్లు, సతీమణి పేరు మీద రూ.18.26 కోట్లు స్థిరాస్తులున్నట్టుగా తెలిపారు. ఇక రూ.3.50 కోట్ల అప్పులున్నట్లు పేర్కొన్నారు.

పల్లాకు రూ.21.46 కోట్ల ఆస్తులు!

జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి తన పేరిట, తన భార్య పేర మొత్తం రూ.21.46 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. చేతిలో నగదు, తనకున్న ఐదు బ్యాంకు ఖాతాలు, తన భార్య పేరు మీద ఉన్న నీలిమ హాస్పిటల్‌లో షేర్లు, ఎల్‌ఐసీ పాలసీలు, వాహనాల విలువ అంతా కలిపి తనకు రూ.8.14 కోట్ల చరాస్తులున్నాయని పేర్కొన్నారు. భార్య నీలిమ పేరు మీద రూ.3.49 కోట్లు ఉన్నాయని ప్రకటించారు. స్థిరాస్తుల విషయానికొస్తే హనుమకొండ జిల్లా వేలేరు మండలం షోడషపల్లి, అదే మండలంలోని మల్లికుదుర్లలో సాగు భూములతో పాటు వాణిజ్య భవనాలు, నివాస గృహాల ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం రూ.6.47 కోట్లని తెలిపారు. ఆయన సతీమణికి రూ.3.36 కోట్ల స్థిరాస్తులున్నట్లు పొందుపరిచారు. తనకు 30.25 ఎకరాలు, తన భార్యకు 10.13 ఎకరాల సాగు భూమి ఉందని తెలిపారు. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ సంస్థల్లో కలిపి తనకు రూ.2.95 కోట్లు, తన భార్యకు రూ.2.05 కోట్ల అప్పులున్నాయని వివరించారు.

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్తులు రూ.11.54 కోట్లు

భువనగిరి ఎంపీ, నల్లగొండ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన పేరిట, భార్య పేర రూ.11.54 కోట్లు ఆస్తులున్నట్లు చూపించారు. ఈ మేరకు ఆయన నామినేషన్‌ దాఖలు చేసి అఫిడవిట్‌లో వివరాలు చూపారు. భార్యాభర్తల పేరిట స్థిరచరాస్తులు రూ.11.54 కోట్లు, అప్పులు రూ.6.44 కోట్లుగా అందులో వెల్లడించారు.

281 నామినేషన్లు దాఖలు..

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 281 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి బాన్సువాడలో, హుజూరాబాద్‌లో బీజేపీ తరఫున ఈటల రాజేందర్‌, ఆయన సతీమణి జమున, జడ్చర్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా చిత్తరంజన్‌దా్‌స నామినేషన్‌ వేయగా.. ఆయన వెంట గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌మహాజన్‌ ఉన్నారు. జగిత్యాల నుంచి కాంగ్రెస్‌ తరఫున టి.జీవన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.

పోలింగ్‌ సజావుగా జరగాలి..

ఎన్నికల ప్రక్రియలో అంతిమంగా పోలింగ్‌ కేంద్రాల్లో నిబంధనలు అమలు కావాలని, అక్కడ విధులు నిర్వహించే సిబ్బందికి పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక పరిశీలకులు అజయ్‌ వి.నాయక్‌, దీపక్‌ మిశ్రా, ఆర్‌.బాలక్రిష్ణన్‌ పేర్కొన్నారు. సీఈవో వికా్‌సరాజ్‌తో కలిసి వారు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

Updated Date - 2023-11-08T11:18:50+05:30 IST