Cantonment Board Elections: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్టు ఎన్నికల షెడ్యూల్ ఖరారు

ABN , First Publish Date - 2023-02-24T17:14:01+05:30 IST

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్టు ఎన్నికల (Cantonment Board Elections) షెడ్యూల్ ఖరారు చేసింది. ఏప్రిల్ 30న కంటోన్మెంట్ ఎన్నికలు నిర్వహిస్తారు

Cantonment Board Elections: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్టు ఎన్నికల షెడ్యూల్ ఖరారు

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్టు ఎన్నికల (Cantonment Board Elections) షెడ్యూల్ ఖరారు చేసింది. ఏప్రిల్ 30న కంటోన్మెంట్ ఎన్నికలు నిర్వహిస్తారు. ప్రచారానికి 20 రోజుల సమయం కేటాయించారు. మార్చి 28, 29 తేదీల్లో నామినేషన్లు (Nominations) వేసేందుకు గడువు ఇచ్చారు. ఏప్రిల్ 6 వరకు నామినేషన్లు విత్ డ్రాకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ (April) 10న అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలైనప్పటికీ, సాధారణ ఎన్నికలకు ముందు జరగనుండడంతో అన్ని రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. తాము బలపరచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు అన్ని పార్టీలు పోరాడతాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌‌లో మొత్తం 8 వార్డులున్నాయి. సికింద్రాబాద్తో పాటు మొత్తం 57 కంటోన్మెంట్స్‌లో పోలింగ్ నిర్వహిస్తారు. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పాలక మండలికి 2015లో ఎన్నికలు జరిగాయి. 8 వార్డులకు గాను ఎన్నికైన 8 మంది సభ్యులు తమలో ఒకరిని బోర్డు పాలక మండలి ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

2015 ఫిబ్రవరిలో పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మిలిటరీకి చెందిన ఆంధ్రా, తెలంగాణ (Andhra Telangana) సబ్‌ ఏరియా కమాండర్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. 2020 ఫిబ్రవరిలో ఐదేళ్ల పదవీ కాలం ముగిసింది. అయితే, రక్షణ శాఖ ఎన్నికలు జరుపలేదు. అదే పాలక మండలిని ఆరు నెలల పాటు కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం మరో ఆరు నెలల పాటు పాలక మండలి పదవీకాలాన్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధంగా 2021 ఫిబ్రవరి వరకు పాత పాలక మండలే కొనసాగింది. కంటోన్మెంట్‌కు ఎన్నికల జరుపకుండా రక్షణ శాఖ అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ దాదాపు 9 నెలల పాటు మౌనం వహించింది. 2021 నవంబర్‌ (November)లో ఇతర కంటోన్మెంట్లతో పాటు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌కు కూడా సివిల్‌ నామినేటెడ్‌ సభ్యుడిని నియమించారు. 2022 ఫిబ్రవరిలో మరోసారి నామినేటెడ్‌ సభ్యుడి పదవీకాలాన్ని పొడిగించారు. కంటోన్మెంట్‌ చట్ట సవరణ బిల్లు పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉందని, బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఎన్నికలు జరుగుతాయని పేర్కొంది. తిరిగి 2022 ఆగస్టులో మరోసారి నామినేటెడ్‌ సభ్యుడి పదవీ కాలాన్ని పొడిగించారు.

Updated Date - 2023-02-24T17:14:02+05:30 IST