TSPSC: ఖమ్మంలో సిట్ సోదాలు
ABN , First Publish Date - 2023-04-15T19:43:16+05:30 IST
డీఏవో పేపర్ లీక్ (DAO paper leak) వ్యవహారంలో ఖమ్మం నగరం (Khammam city)లో శనివారం సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఖమ్మం: డీఏవో పేపర్ లీక్ (DAO paper leak) వ్యవహారంలో ఖమ్మం నగరం (Khammam city)లో శనివారం సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. డీఏవో ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో నిందితులైన లౌకిక్, సుష్మితల ఇంట్లో వారు తనిఖీలు నిర్వహించారు. గతంలోనే డీఏవో పేపర్ లీక్ అయినట్టు ధ్రువీకరించుకున్న అధికారులు ఖమ్మం నగరానికి చెందిన లౌకిక్, సుష్మిత దంపతులకు ప్రవీణ్ ఆ పేపర్ విక్రయించినట్టు తేలడంతో వారం రోజుల క్రితం వారిని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా అసలు పేపరు లీకేజీ ఎలా జరిగింది ? ఎంత మందికి విక్రయించారు ? అది వారితోనే ఆగిందా ? లేక కొనుగోలు చేసిన వారు మరెవరికైనా పంపారా ? వంటి కోణాల్లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే శనివారం ఖమ్మం నగరానికి లౌకిక్, సుష్మిత దంపతులను తీసుకుని వచ్చిన అధికారులు వారి ఇంట్లోని ల్యాప్‌ట్యాప్ వంటి పరికరాలతోపాటు, నగదు లావాదేవీలకు సంబంధించి సోదాలు జరిపినట్టు తెలుస్తోంది.
ప్రవీణ్ నుంచి ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసిన లౌకిక్ ఆ ప్రశ్నాపత్రాన్ని మరెవరికైనా షేర్ చేశారా అన్న కోణంలోనూ అధికారులు విచారణ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సిట్ అధికారులు వారి ఇంటి నుంచి పలు విలువైన పేపర్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. అయితే భార్య సుష్మిత కోసం భర్త లౌకిక్ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్టు గతంలోనే గుర్తించిన అధికారులు అతడు పేపర్ కొనుగోలుకు ప్రమీణ్‌తో రూ.10లక్షలు ఒప్పందం చేసుకుని.. ముందుగా రూ.6లక్షలు చెల్లించినట్టు నిర్ధారించారు. కాగా సుష్మిత గతేడాది అక్టోబరులో టీఎస్‌పీఎస్సీ (TSPSC) నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో మెయిన్స్‌కు క్వాలీఫై కాలేకపోయింది. ఆ తర్వాత డీఏవో పరీక్ష పరీక్షకు సంబంధించిన దరఖాస్తులో సాంకేతిక సమస్యలు వచ్చాయి. వాటిని పరిష్కరించుకోవడానికి సుష్మిత తన భర్తతో కలిసి టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వచ్చిన సందర్భంలో వారికి సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ప్రవీణ్‌తో పరిచయం ఏర్పడగా.. పేపరు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది.