Share News

Telangana Politics: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-12-06T15:43:11+05:30 IST

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది మాత్రమే ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు తీర్చే క్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Telangana Politics: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో నివాళులర్పించిన ఆయన.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది మాత్రమే ఉంటుందని ప్రకటించారు. ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని రాజా సింగ్ అన్నారు. కేసీఆర్ చేసిన అప్పులు తీర్చే క్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రకటించిన కేసీఆర్‌నే తెలంగాణ ప్రజలు మార్చేశారని రాజా సింగ్ ఎద్దేవా చేశారు. దేశంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అందరూ నివాళులర్పిస్తున్నారని.. వాళ్లు గర్వంగా జీవించడానికి.. వాళ్లకు న్యాయం జరగడానికి అంబేద్కర్ కారణమని రాజా సింగ్ తెలిపారు. అందుకే అన్ని వర్గాలు అంబేద్కర్‌ను స్మరించుకుంటాయని పేర్కొన్నారు.

గత పదేళ్లలో కేసీఆర్ పాలన గురించి ప్రస్తావిస్తూ.. తెలంగాణలో రావణ రాజ్యం అంతమైందని రాజా సింగ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ రావణుడు అని.. తెలంగాణ ప్రజలను మోసం చేశాడని ఆరోపించారు. ఎస్సీలను కేసీఆర్ మోసం చేశారన్నారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తామని.. మూడెకరాల భూమి, దళిత బంధు ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేసినట్లు వివరించారు. అంబేద్కర్‌కు కేసీఆర్ ఎప్పుడూ నివాళులర్పించలేదన్నారు. బీజేపీ ఒత్తిడితోనే హైదరాబాద్‌లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. ఎస్సీ సమాజాన్ని మోసం చేసి కేసీఆర్ ఫాంహౌస్‌లో కూర్చున్నాడని.. కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని ప్రజలు బహిష్కరించారని రాజా సింగ్ విమర్శలు చేశారు. కేసీఆర్ స్కీంలను అమలు చేస్తానని రేవంత్ అన్నారని.. దళితులను రేవంత్ మోసం చేస్తే బీజేపీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అంబేద్కర్ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి మోదీ అని రాజా సింగ్ పేర్కొన్నారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-06T15:49:36+05:30 IST