త్వరలో ఏపీ మూడు ముక్కలు!
ABN , First Publish Date - 2023-01-06T04:14:44+05:30 IST
ఆంధ్రప్రదేశ్ మరో మూడు ముక్కలు అవ్వడానికి సిద్ధంగా ఉందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్య
‘రాజ్యం.. మతం.. కోర్టులు.. హక్కులు’ వ్యాస సంకలనం ఆవిష్కరణ
హైదరాబాద్ సిటీ, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ మరో మూడు ముక్కలు అవ్వడానికి సిద్ధంగా ఉందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వేర్పాటువాదం ఇలానే కొనసాగితే దేశం రెండుగా ఎందుకు ఉండకూడదనే ప్రశ్న ఉదయించడానికి ఎంతో సమయం అవసరం లేదన్నారు. ఆలపాటి సురే్‌షకుమార్ రాసిన ‘రాజ్యం - మతం - కోర్టులు - హక్కులు’ ఓ జర్నలిస్టు దృక్కోణం.. వ్యాస సంకలనం ఆవిష్కరణలో భాగంగా ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ లౌకికవాదంతో పాటు సమాఖ్యస్ఫూర్తి, సార్వభౌమాధికారం భావనలను, భాషాప్రయోక్త రాష్ట్రాల స్వరూప స్వభావాల రూపురేఖలను మారుస్తున్నారని అన్నారు. జాతీయవాదులమని చెబుతున్నవాళ్లు కూడా తెలుగు రాష్ట్రాలు రెండుగా ఉంటే తప్పేంటని అన్నారని గుర్తు చేశారు. కుల, మత సమస్యలను నాటి జాతీయోద్యమ నాయకులు నిర్లక్ష్యం చేశారని, అవి మరింత ముదిరి దేశంలో కొత్త సమస్యలను సృష్టిస్తున్నాయని చెప్పారు. రాజ్యాంగ విలువలను రాజ్యం కాలరాస్తున్న పరిస్థితుల్లో, ప్రజలను మేల్కొలిపేందుకు సురేష్ రాసిన విశ్లేషణాత్మక వ్యాసాలు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ఏపీ హైకోర్టు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాడి ఢిల్లీలో రైతులు కొత్త చరిత్ర రాశారని, రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతులు కూడా చరిత్ర రాస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజా ఉద్యమాల అణిచివేతకు పాలకులు న్యాయస్థానాలను వాడుకోవడం ప్రమాదకరమైన పరిస్థితికి నిదర్శనమన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను సశాస్త్రీయంగా విశ్లేషిస్తూ ఆలపాటి సురేష్ రాసిన వ్యాసాలను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఆలపాటి సురేష్ తన వ్యాస సంకలనంలో ప్రస్తుత దేశ రాజకీయాలను మరకలు లేని అద్దంలా చూపారని సీనియర్ జర్నలిస్టు ఆర్వీ రామారావు అభిప్రాయపడ్డారు. అకారణంగా సాటి మనిషిని ద్వేషించే మానసిక వైకల్యం ప్రస్తుతం దేశంలో ఉందని, ఆ ధోరణిపై తన అభిప్రాయాలను వ్యాస రూపంలో చెప్పానని ఆలపాటి సురేష్ వెల్లడించారు.