Congress: ఠాక్రే తీవ్ర ఆగ్రహం.. 20 మంది డుమ్మా
ABN , First Publish Date - 2023-02-15T19:36:31+05:30 IST
తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్- కాంగ్రెస్ పొత్తుల వ్యవహారంపై చేసిన వాఖ్యలపై ప్రస్తుతం వాడివేడిగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పీసీసీ ఉపాధ్యక్షులతో ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే సమావేశమయ్యారు.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్- కాంగ్రెస్ పొత్తుల వ్యవహారంపై చేసిన వాఖ్యలపై ప్రస్తుతం వాడివేడిగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పీసీసీ ఉపాధ్యక్షులతో ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే సమావేశమయ్యారు. అయితే ఠాక్రే సమావేశానికి 20 మంది ఉపాధ్యక్షులు డుమ్మా కొట్టినట్లు సమాచారం. ఉపాధ్యక్షుల తీరుపై ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమీక్షకు హాజరుకానివారంతా వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎల్లుండి మరోమారు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో వెంకట్‌రెడ్డి తీరుపై ఉపాధ్యక్షులు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వెంకట్‌రెడ్డి వ్యవహారంపై మరోమారు మాట్లాడదామని ఠాక్రే సర్దిచెప్పినట్లు సమాచారం.
బీఆర్ఎస్ పొత్తుపై కోమటిరెడ్డి చెప్పిన మాట ఇదే
భవిష్యత్తులో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో ఎవరికి స్పష్టమైన మెజారిటీ రాదని ఆయన జోస్యం చెప్పారు. ఏ పార్టీ కూడా 60 సీట్లను గెలవలేదని హంగ్ తప్పదు అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో కలవక తప్పదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పార్టీని ఒక్కరే గెలిపించడం సాధ్యం కాదని పేర్కొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాడిలో పడుతుందని, కొత్త వారైనా పాతవారైనా గెలిచే వారికే టికెట్ ఇవ్వాలని తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
మరల కోమటిరెడ్డి ఏమన్నారంటే..?
రాష్ట్రంలో హంగ్ వస్తుంది. బీఆర్ఎస్- కాంగ్రెస్ పొత్తు ఉంటుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) చేసిన వ్యాఖ్యలపై ఆయన యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రంలో హంగ్ వస్తుందని తాను అనలేదు. నా వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పిందే తాను చెప్పానని అన్నారు. పార్టీలో చిన్న చిన్న నేతలు కూడా తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. నా వ్యాఖ్యలను బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రంలో హంగ్ వస్తుందని, బీఆర్ఎస్ హోం కాంగ్రెస్ పొత్తు ఉంటుందని తాను అనలేదని తెలిపారు. నేను తప్పు చేయలేదు, రాద్ధాంతం చేయొద్దని అన్నారు. నేను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవని, సోషల్ మీడియాలో వచ్చిన సర్వేల ఆధారంగా ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఆయా పార్టీల బలాబలాలేంటో చెప్పానని అన్నారు. నేను మార్నింగ్ చేసిన వ్యాఖ్యలు అర్ధం చూసుకునేదాన్ని బట్టి ఉంటుందన్నారు.