భావితరాల భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి
ABN , First Publish Date - 2023-02-03T04:16:16+05:30 IST
భారతదేశంలో రాజకీయ నాయకులు రాబోయే ఎన్నికలపైనే దృష్టి పెడతారని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికలపై కాదని.. రాబోయే తరాల భవిష్యత్తుపై దృష్టి సారించాలని చెప్పారు.
చైనా, జపాన్‌లో అభివృద్ధిపై ఫోకస్.. మన దగ్గర మాత్రం రాజకీయాలపైనే!
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రాలకు కేటాయింపులు సమానంగా ఉండాలి
సరైన నిర్ణయాలతోనే తెలంగాణ అభివృద్ధి
దేశంలోని నేతలంతా మాలాగా పనిచేస్తే ‘5 ట్రిలియన్’ లక్ష్యం కష్టం కాదు: కేటీఆర్
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో రాజకీయ నాయకులు రాబోయే ఎన్నికలపైనే దృష్టి పెడతారని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాజకీయ నాయకులు ఎన్నికలపై కాదని.. రాబోయే తరాల భవిష్యత్తుపై దృష్టి సారించాలని చెప్పారు. నేతలు తప్పనిసరిగా ఆర్థిక లెక్కలపైనా దృష్టి సారించాలన్నారు. చైనా, జపాన్ దేశాల నేతలు అభివృద్ధిపై దృష్టి పెట్టడంతోనే అవి దూసుకెళుతున్నాయని.. మన దగ్గర మాత్రం నేతల దృష్టంతా రాజకీయాలపైనే ఉంటుందని తెలిపారు. గురువారం హెచ్‌ఐసీసీలో జరిగిన ‘డీకోడింగ్ ద ఎకనామిక్ ఫ్యూచర్’ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. 2023-24 కేంద్ర బడ్జెట్‌ను ప్రస్తావిస్తూ ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశం 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారాలన్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేంద్ర బడ్జెట్‌ను రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జీడీపీ పరంగా భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్న విషయమై కేటీఆర్ స్పందిస్తూ.. తలసరి ఆదాయం పరంగా చూస్తే 142వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. భారత్ జనాభాలో 65 శాతం యువతేనని చెప్పారు. అయితే దేశ సంపదలో ఎక్కువ శాతం కొందరు వ్యక్తుల చేతుల్లోనే ఉందన్నారు.
సరైన నిర్ణయాలతో..
తెలంగాణ అనతి కాలంలోనే గణనీయమైన అభివృద్ధిని సాధించిందని కేటీఆర్ అన్నారు. కొద్ది సంవత్సరాల్లోనే అనేక మైలురాళ్లను చేరుకుందని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు క్షేత్రస్థాయిలోని సమస్యల గురించి అవగాహన ఉండడం, సమయానుకూలంగా ప్రాజెక్టులను అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. సరైన నాయకులు, సరైన నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని అన్నారు. యాపిల్, మైక్రోసాఫ్ట్, ఉబెర్, అమెజాన్, గూగుల్, వంటి అనేక బహుళజాతి కంపెనీలు అతిపెద్ద క్యాంప్‌సలను నిర్మించేందుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నాయని గుర్తుచేశారు. 2014లో తెలంగాణలో తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు ఉండేదని.. తమ ప్రభుత్వం సహజ, మానవ వనరులను చక్కగా వినియోగించుకోవడం ద్వారా ప్రస్తుతం ఇది రూ.2.75 లక్షలకు చేరిందని కేటీఆర్ చెప్పారు. ప్రపంచ టీకాలకు హైదరాబాద్ రాజధానిగా మారిందన్నారు. గడిచిన ఎనిమిదన్నరేళ్లలో టీఎ్‌సఐపాస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు 22 వేల అనుమతులు ఇచ్చిందని.. తద్వారా ప్రత్యక్షంగా 21 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లయిందని వివరించారు. తెలంగాణ నేతల్లాగా దేశంలోని నేతలందరూ పనిచేస్తే 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని కేటీఆర్ చెప్పారు. జీడీపీకి, సంపదకు మధ్య ఉన్న తేడాను ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. జీడీపీ అంటే దేశ ఆర్థిక కార్యకలాపాలకు ప్రతిరూపం అన్నారు. దేశ సంపద అంటే సహజ, మానవ వనరుల కలయిక అని.. సుదీర్ఘ కాలంలో ఈ రెండూ కలిసి ఆర్థిక కార్యకలాపాలపై ఎంతటి ప్రభావం చూపుతాయన్నదే ముఖ్యమని చెప్పారు. ప్రతిబావంతులైన యువత ప్రపంచశ్రేణి సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలని ఆకాంక్షించారు.
సవరణ
దేశంలో అత్యంత ధనవంతులైన మంత్రుల జాబితాలో టాప్-10లో మంత్రి కేటీఆర్ లేరు. ఏడీఆర్ నివేదికను ఉటంకిస్తూ టాప్-10 ధనవంతులైన మంత్రుల జాబితాలో కేటీఆర్ ఉన్నట్లు గురువారం ప్రచురితమైంది. కానీ ఆ జాబితాలో కేటీఆర్ పేరు లేదు. పొరపాటుకు చింతిస్తున్నాం.
- ఎడిటర్