Revanth Reddy: ఆంధ్రా కాంట్రాక్టర్లతో అమరుల స్మారకం

ABN , First Publish Date - 2023-06-23T13:06:25+05:30 IST

తెలంగాణ అమర వీరుల స్మారక చిహ్నం’ నిర్మాణంలోనూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అంచనా వ్యయాన్ని ఇష్టానుసారంగా పెంచేశారని, తద్వారా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. స్మారక చిహ్నం నిర్మాణ కాంట్రాక్టు పరంగా కేటీఆర్‌కు పాత్ర ఉందని పేర్కొన్నారు. ఈ నిర్మాణంలో కేటీఆర్‌ కమీషన్లు దండుకున్నారని ఆరోపిస్తూ ఇదంతా కేసీఆర్‌కు కనిపించదా?

Revanth Reddy: ఆంధ్రా కాంట్రాక్టర్లతో అమరుల స్మారకం

ఇది తెలంగాణ సమాజాన్ని వెక్కిరించడమే!

నిర్మాణంలో అవినీతి.. ఇష్టారీతిన వ్యయం

63.75 కోట్ల నుంచి 179.05 కోట్లకు పెంపు

తొలుత కేసీ పుల్లయ్య కంపెనీకి టెండర్‌ అప్పగింత

కేటీఆర్‌తో కలిశాక ‘కేపీసీ ప్రాజెక్టు’గా మార్పు

డిసెంబరు 9 నాటికి అధికారంలోకి కాంగ్రెస్‌

వెంటనే ఫలకంపై 1569 మంది అమరుల పేర్లు

అమరుల కుటుంబాలకు 25వేల పింఛన్‌: రేవంత్‌

హైదరాబాద్‌, జూన్‌22 (ఆంధ్రజ్యోతి): ‘తెలంగాణ అమర వీరుల స్మారక చిహ్నం’ నిర్మాణంలోనూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అంచనా వ్యయాన్ని ఇష్టానుసారంగా పెంచేశారని, తద్వారా అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. స్మారక చిహ్నం నిర్మాణ కాంట్రాక్టు పరంగా కేటీఆర్‌కు పాత్ర ఉందని పేర్కొన్నారు. ఈ నిర్మాణంలో కేటీఆర్‌ కమీషన్లు దండుకున్నారని ఆరోపిస్తూ ఇదంతా కేసీఆర్‌కు కనిపించదా? అని ప్రశ్నించారు. తమ దోపిడీ కోసం అమరుల స్మారకాన్ని సైతం వాడుకున్నారని ఆరోపించారు. రూ.63.75 కోట్ల అంచనా వ్యయంతో మొదలైన నిర్మాణం రూ.179.05 కోట్లకు చేరిందని, దీనిపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. స్మారక చిహ్నం చూడగానే అమరవీరుల పోరాటాలు, త్యాగాలను స్ఫురణకు రావాలని, అయితే స్మారక చిహ్నాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లతో కట్టించి అపవిత్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అమరుల స్మారకం అంటే శ్రీకాంతా చారి, ఇషాన్‌ రెడ్డి, కానిేస్టబుల్‌ కిష్టయ్య తదితర వందల మంది అమరులు గుర్తొచ్చేలా ఉండాలి. పవిత్రమైన ఈ అమరుల స్మారకాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు ఇచ్చి అపవిత్రం చేశారు. చరిత్ర పుటల్లో నిలవాల్సిన నిర్మాణాన్ని ఆంధ్రా వాళ్లకు అప్పగిస్తారా? ఇది తెలంగాణ సమాజాన్ని వెక్కిరించడం కాదా? ఇది బరితెగింపు కాదా?’’ అని ప్రశ్నించారు. అమరుల త్యాగాలను తన రాజకీయ స్వార్థానికి కేసీఆర్‌ ఉపయోగించుకున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1,569 మంది అమరులయ్యారని, అయితే కల్వకుంట్ల చరిత్రనే తెలంగాణ చరిత్ర అన్నట్లుగా కేసీఆర్‌ వ్యవహరిస్తూ అమరుల బలిదానాలను అవమానిస్తున్నారని విమర్శించారు. 2017, జూన్‌ 17న ప్రభుత్వం అమరవీరుల స్థూపం నిర్మాణానికి సంబంధించి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి డిజైన్‌, అంచనాల కోసం, పనులను పరిశీలించడానికి 6 శాతం ఫీజు చెల్లించాలని పేర్కొందన్నారు. 2018, జూన్‌ 28న నిర్మాణం కోసం రూ.63.75 కోట్ల వ్యయంతో టెండరు ప్రకటన ఇచ్చారని దీనికి ఒకే కంపెనీ మూడు డమ్మీ టెండర్లు వేసి కేసీ పుల్లయ్య కంపెనీ టెండరు దక్కించుకుందన్నారు. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్‌తో కలిసిపోయిన తర్వాత కేపీసీ ప్రాజెక్స్ట్‌ లిమిటెడ్‌ గా మారిందని పేర్కొన్నారు. ప్రొద్దుటూరు, కడప జిల్లాకు చెందిన కేపీసీ కంపెనీ అడ్రస్‌ విజయవాడకు మారిందని చెప్పారు.. కేటీఆర్‌ స్నేహితుడు తేలుకుంట్ల శ్రీధర్‌ అని, కేపీసీ ప్రాజెక్స్ట్‌ అనిల్‌ కుమార్‌ కామిశెట్టితో కలిసి కేటీఆర్‌కు మేలు జరిగేలా వ్యూహాత్మకంగా శ్రీధర్‌ చేశారని ఆరోపించారు. ఫలితంగా నిర్మాణ అంచనా వ్యయం రూ.123.5 కోట్లకు పెరిగిందని, ఆ తర్వాత 158.85 కోట్లకు, ఆ తర్వాత 179.05 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచారని పేర్కొన్నారు ఇంత ఖర్చుతో నిర్మించిన స్మారక చిహ్నంలో కేవలం అమరవీరులకు జోహార్లు అని మాత్రమే రాశారని, ఇది సరికాదన్నారు. స్మారక చిహ్నం వద్ద ఉన్న శిలాఫలకంపై అమరుల పేర్లు పెట్టనప్పుడు రాష్ట్రం శిలాఫలకాలపై సీఎం కేసీఆర్‌ పేరు ఎందుకు పెట్టాలి? అని ప్రశ్నించారు. చరిత్రను మలినం చేయడానికి కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని, దీన్ని తెలంగాణ సమాజం గ్రహించాలని పిలుపునిచ్చారు. పదెకరాల్లో నిర్మించిన ప్రగతి భవన్‌ పనులను తొమ్మిది నెలల్లోనే పూర్తి చేస్తే అమరవీరుల స్మారక చిహ్నాన్ని నిర్మించడానికి తొమ్మిదేళ్లు పడుతుందా?’’ అని ప్రశ్నించారు. స్మారక చిహ్నం నిర్మాణంలో పలు లోపాలు ఉన్నాయని ఆరోపించారు. స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌లో సైతం నాణ్యత పాటించలేదన్నారు. కాగా చిహ్నం ఎలివేషన్‌లో 4ఎంఎం పలుచని స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌ను ఉపయోగించారని. దీంతో షీట్‌కు షీట్‌కు మధ్య గ్యాప్‌లు ఉన్నాయని చెప్పారు.. ఫలితంగా దగ్గరికి వెళ్తే సొట్టలుగా, స్టీల్‌ షీట్లను జాయింట్‌ చేసినట్లుగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మొత్తం అవినీతికి కారణం కేటీఆర్‌, ఆయన ేస్నహితుడు శ్రీధర్‌లని పేర్కొన్నారు. అంబేద్కర్‌ విగ్రహం నిర్మాణ బాధ్యతలనూ పుల్లయ్య కంపెనీకే ఇచ్చారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్‌ విగ్రహం, అమరుల స్మారకం, సచివాలయ నిర్మాణాలపై విజిలెన్స్‌తో విచారణ చేయిస్తామని, అవినీతి పాల్పడిన వారిని చర్లపల్లి జైలుకు పంపిస్తామని పేర్కొన్నారు. 2014, జూన్‌ 14న అసెంబ్లీలో కేసీఆర్‌ తీర్మానం ప్రవేశపెట్టారని.. తొలి, మలి ఉద్యమాల్లో 1560 మంది అమరులయ్యారని నిండు సభలో చెప్పారని పేర్కొన్నారు. నాడు ప్రభుత్వ తీర్మానాన్ని అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించారని గుర్తు చేస్తూ ఆ తీర్మానాన్నిసైతం కాదని మంత్రులు బరితెగించి మాట్లాడుతున్నారని రేవంత్‌ విమర్శించారు. అమరుల్లో కేవలం 500మందిపైగా మాత్రమే సాయం అందిందని, మిగిలిన వారి విషయంలో అడ్రస్‌ దొరకలేదు అనే సాకులు చెబుతున్నారని విమర్శించారు. ఇంత పెద్ద వ్యవస్థలో అడ్రస్‌ దొరకపోవడం అనే మాట చెప్పడం సిగ్గు చేటన్నారు. తొమ్మిదేళ్లయినా అమరుల వివరాలు దొరక లేదా? అని ప్రశ్నించారు. తక్షణమే మిగతా అమరులను గుర్తించి ఆదుకోవాలని, లేకపక్షంలో కేసీఆర్‌ చరిత్రలో నీచుడిగా మిగిలిపోతారని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ రాగానే అమరుల పేర్లతో ఫలకం

డిసెంబర్‌ 9లోగా తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కారు ఏర్పడుతుందని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే 1,569 మంది అమరుల పేర్లు శిలా ఫలకమ్మీద పొందుపరుస్తామని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. అమరుల తాలూకు వివరాలన్నీ చదివాకే స్మారక స్థూపం దగ్గరికి వెళ్లేలా ఏర్పాట్లు చేస్తామని వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్‌ నిర్లక్ష్యం చేసిన అమరుల కుటుంబాలను గుర్తించి వారిని ఘనంగా సన్మానిస్తామని, నెలకు రూ.25 వేల చొప్పున పెన్షన్‌ అందచేసి, తెలంగాణ సాధన సమరయోధులుగా వారికి గుర్తింపునిస్తామని హామీ ఇచ్చారు. 2009 డిసెంబరు 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై అప్పటి యూపీఏ ప్రభుత్వం ఓ ప్రకటన చేసిందని, 2023, డిసెంబరు 9లోగా తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, అదే డిసెంబరు 9న 1569 మంది అమరవీరులకు చెందిన కుటుంబాలను పిలిపించి సోనియా గాంధీతో సహపంక్తి భోజనాలు చేయిస్తామన్నారు.

పాల్‌ లాగే సంజయ్‌ వ్యాఖ్యలు

బండి సంజయ్‌ మానసిక స్థితి తాను అర్థం చేసుకోగలనని, ఆయన కేఏ పాల్‌ లాగే మాట్లాడుతున్నారని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏడవలేక, పట్టిన చెమట తుడుచుకోలేక ఇబ్బంది పడుతున్నారన్నారు. సానుభూతి వ్యక్తపరచడం తప్ప ఆయన మాటలను సీరియస్‌ గా తీసుకోలేమని రేవంత్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-06-23T13:06:25+05:30 IST