Gaddar No More : గద్దర్ మృతి పట్ల సీఎం కేసీఆర్, ప్రముఖుల సంతాపం

ABN , First Publish Date - 2023-08-06T19:30:26+05:30 IST

ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), పలువురు మంత్రులు, రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ కూడా ఉద్యమ గళానికి సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా.. తెలంగాణ కోసం గద్దర్ చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని గులాబీ బాస్ స్మరించుకున్నారు...

Gaddar No More : గద్దర్ మృతి పట్ల సీఎం కేసీఆర్, ప్రముఖుల సంతాపం

ప్రజా యుద్ధనౌక గద్దర్ (Gaddar) మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), పలువురు మంత్రులు, రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ కూడా ఉద్యమ గళానికి సంతాపం తెలిపింది. ఈ సందర్భంగా.. తెలంగాణ కోసం గద్దర్ చేసిన సాంస్కృతిక పోరాటాన్ని, గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని గులాబీ బాస్ స్మరించుకున్నారు. ‘తెలంగాణ పాటకు ప్రపంచ ఖ్యాతి తెచ్చిన ప్రజా వాగ్గేయకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో తన పాటద్వారా పల్లె పల్లెనా భావజాలవ్యాప్తి చేసిన గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలంగాణ కోసం తన ఆట పాటలతో ప్రజల్లో స్వరాష్ట్ర చైతన్యాన్ని రగిలించిన గదర్ ప్రజాయుద్దనౌకగా ప్రజల హృదయాల్లో నిలిచారు. ప్రజలకోసం తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసి ప్రజలకోసమే బతికాడు. గద్దర్ మరణంతో యావత్ తెలంగాణ గొప్ప ప్రజా కవిని కోల్పోయింది. సాధారణ బుర్రకథ కళాకారుడుగా ప్రారంభమైన గద్దర్ కళాజీవితం, విప్లవ రాజకీయాలతో మమేకమై, అనంతరకాలంలో తెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో సాంస్కృతిక పోరాటంలో ఉన్నతస్థాయికి చేరింది. కవిగా గద్దర్ ప్రజాకళలకు, ఉద్యమాలకు చేసిన సేవలు మరుపురానివని. వారు లేని లోటు పూడ్చలేనిది. ప్రజా కళాకారులకు కవులకు మరణం ఉండదనీ, ప్రజాకళలు వర్ధిల్లినంతకాలం ఆయన పేరు అజరామరంగా నిలిచి ఉంటుంది. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని కేసీఆర్ ఓ ప్రకటనలో తెలిపారు.


Gaddar Death.jpeg

కేటీఆర్: తెలంగాణ పాటకు ప్రపంచ కీర్తి తెచ్చారు. ఆయన మృతి బాధించింది. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ప్రజా కలలు వర్డిల్లినంత కలాం ఆయన పేరు ఉంటుంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.

హరీష్ రావు : ప్రజా యుధ్ధ నౌకగా పేరుగాంచిన కవి, రచయిత గద్దర్ గారి మృతి దిగ్భ్రాంతి గురిచేసింది. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా, తనదైన పాటలతో అందరినీ కదిలించిన గొప్ప ప్రజాగాయకుడు. అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా.. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ తెలంగాణ ఉద్యమంలో తన గళంతో కోట్ల మందిని ఉత్తేజపరిచారు. గద్దర్ గారి మృతి బాధాకరం.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

ప్రశాంత్ రెడ్డి : ప్రజా యుద్ద నౌక గద్దర్ ఆలియాస్ గుమ్మడి విఠల్ గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి తీరని లోటు. తన పాటతో ప్రజలను చైతన్యం చేసిన గద్దర్ జనం గుండెల్లో చిరకాలం జీవించే ఉంటాడు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి.. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

కాసాని జ్ఞానేశ్వర్ : తన పాట ద్వారా ఎంతోమందిని చైతన్య పరిచిన ప్రజా యుద్దనౌక గద్దర్ మృతి దిగ్భ్రాంతి కలిగించింది. గద్దర్ గారి మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు. వారు భౌతికంగా లేకపోయినా వారి పాట చిరకాలంగా ఉంటుంది.

రఘునందన్ రావు : మెతుకు సీమ బుద్దు బిడ్డ నేలకొరిగారు. నమ్మిన సిద్దాంతం కోసం నాలుగు దశాబ్దాలు పోరాడారు. మా ఉమ్మడి మెదక్ జిల్లాకు తీరని లోటు. గద్దర్ పాటలు తెలంగాణ ప్రజలను చైతన్యం చేసాయి.

పొంగులేటి శ్రీనివాసరెడ్డి : ప్రజా గాయకుడు గద్దర్ మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రజాపోరాటాల మహాశిఖరం ఒరిగిపోయింది. ప్రజల గొంతు మూగపోయింది. గద్దరన్న ఇక లేడన్న వార్త కలిచివేసింది. యావత్ జీవితం ప్రజలకొరకు చేసే పోరాటాలకు అంకితం చేసిన మహనీయుడు గద్దర్. ఆయన పాడిన పాడిన ప్రతి గేయం అజరామరం. ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణం తెలంగాణకు తీరని లోటు. తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిది. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

2 (8).jpeg

Updated Date - 2023-08-06T19:33:33+05:30 IST