రెచ్చిపోయిన వీధి కుక్కలు
ABN , First Publish Date - 2023-04-28T00:20:27+05:30 IST
హనుమకొండలో గురువారం కుక్కలు స్వైరవిహారం చేశాయి. ఒకే రోజు తొమ్మిది చోట్ల కుక్కలు జరిపిన దాడిలో మొత్తం 32 మంది గాయపడ్డారు.
నగరంలో తొమ్మిది ప్రాంతాల్లో స్వైరవిహారం
ఒకే రోజు 32 మందిపై దాడి
ఇద్దరికి తీవ్ర గాయాలు.. బాధితుల్లో చిన్నారులు
ఎంజీఎంలో చికిత్స
ప్రత్యేక బృందంతో వచ్చి కుక్కలను పట్టుకున్న అధికారులు
హనుమకొండ క్రైం/మనుమకొండ స్పార్ట్స్/ హనుమకొండ అర్బన్, ఏప్రిల్ 27 : హనుమకొండలో గురువారం కుక్కలు స్వైరవిహారం చేశాయి. ఒకే రోజు తొమ్మిది చోట్ల కుక్కలు జరిపిన దాడిలో మొత్తం 32 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతావారికి ప్రాఽథమిక చికిత్స చేసి పంపించారు. వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమకొండలోని హనుమాన్‌నగర్, వినాయకనగర్, రెడ్డికాలనీ ప్రాంతాల్లో గురువారం ఓ పిచ్చికుక్క జనావాసాల మధ్య సంచరించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా హడలెత్తించింది. పిల్లలు ఆరుబయట ఆడుకుంటుండగా నలుగురిని కరిచింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు అక్కడకు చేరడంతో తల్లిని కూడా కరిచి అక్కడి నుంచి పారిపోయింది. ఈ కుక్క గురువారం ఒక్క రోజే సుమారు 22 మందిని కరిచినట్టు ప్రజలు చెబుతు న్నారు. కేయూ మెయిన్‌రోడ్డు హనుమాన్‌నగర్ వద్ద ఓ వైన్‌షాపు ఎదుట మందు తాగేందుకు వచ్చిన వారిని సైతం పరుగెత్తుతుండగా కాటువేసింది.
ఇక హనుమకొండ 4వ డివిజన్‌లోని యాదవనగర్, గౌతమ్‌నగర్, కృష్ణకాలనీలో మరో పిచ్చికుక్క రోడ్డుపై వెళుతున్న స్థానికులను, బాటసారులను, చిన్నారులపై దాడి చేసి గాయపర్చింది. ఇళ్లలోకి చొరబడి చిన్నారులను సైతం వదలకుండా తలపై, కాళ్లపై, చేతులపై విచక్షణారహితంగా కరిచి గాయపర్చింది. అరగంట సమయంలోనే సుమారు 10 మందికి పైగా కాటువేసింది. డివిజన్‌లో ఏం జరుగుందో తేరుకునేలోపే పిచ్చికుక్క వివిధ ప్రాంతాలకు వెళ్లి అడ్డువచ్చిన వారిని కరిచింది. దీంతో గాయాలపాలైనవారు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లారు.
ఎంజీఎం ఆస్పత్రిలో 20 మందికి వ్యాక్సినేషన్
కుక్కకాటుతో 22 మంది బాధితులు చికిత్స నిమిత్తం ఎంజీఎంకు రాగా తీవ్రగాయాల పాలైన ఇద్దరు పిల్లలను అడ్మిట్ చేసుకున్నట్లు ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి.చంద్రశేఖర్ తెలిపారు. మిగతా 20 మందికి ప్రథమ చికిత్స అందించి ఏఆర్‌వీ ఇంజక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. హనుమకొండ రెడ్డికాలనీ, యాదవనగర్, డబ్బాల జంక్షన్ నుంచి ఈ కేసులు ఎమర్జెన్సీ క్యాజువాలిటీకి వచ్చాయని తెలిపారు. వీరిలో దామెర సుధేష్ణ(6), కోలా అభినయ్(9)లకు తీవ్ర గాయాలు కావడంతో అడ్మిట్ చేసి పిల్లల వార్డులో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ లేనందున కుక్కకాటుకు గురైన బాధితులు ఎంజీఎం ఆస్పత్రిలో ఆందోళన చేసినట్లు సామాజిక మాద్యమాల్లో వచ్చిన వార్తలు నిజం కాదని ఆయన తెలిపారు.
అధికారులతో పర్యటించిన కార్పొరేటర్..
పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తున్నట్టు సమాచారం అందుకున్న 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ బల్దియా అధికారులతో కలిసి డివిజన్‌లో పర్యటించారు. కుక్కకాటుకు గురైన బాధితుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. తక్షణమే కుక్కలను పట్టుకునే వాహనంతో పాటు సిబ్బందిని పిలిపించారు. కుక్కల కోసం డివిజన్‌లోని పలు కాలనీల్లో రెండు, మూడు గంటల పాటు పర్యటించారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో అధికారులు, కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ మూడు గంటల పాటు శ్రమించి కుక్కలు పట్టే సిబ్బందితో ఎట్టకేలకు పిచ్చికుక్కను పట్టుకు న్నారు. దీంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కుక్కల బెదడ నుంచి ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేస్తున్నారు.
రోడ్డుపై వెళుతుండగా కరిచింది..
– పులిచేరు ఎల్లస్వామి, యాదవనగర్
యాదవనగర్ పెట్రోల్‌పంపు సమీపంలో ఉన్న సోడాబండి వద్దకు వెళుతుండగా మార్గంమధ్యలో పిచ్చికుక్క ఒక్కసారిగా మీదకు వచ్చి కరిచింది. కాలును నోటితో పట్టుకుని వదలలేదు. దీంతో అరుస్తుండగా స్థానికులు వచ్చి నన్ను కాపాడారు. కాలు, చేతిపై రెండు చోట్ల కరవడంతో కింద పడిపోయాను. ఆ తర్వాత కొంత సేపు ఏం జరిగిందో అర్థం కాకుండా పోయింది.
ఇంటి ముందు కూర్చుంటే కాలందుకుంది
– ప్రభావతి, యాదవనగర్
మేము హనుమకొండ యాదవనగర్‌లో ఉంటాం. సాయంత్రం ఇంటి ముందు కూర్చున్నాం. ఒక్క సారిగా పిచ్చి కుక్క నాపై దాడి చేసి కాలుపై గాయం చేసింది. హఠాత్తుగా అక్కడి నుంచి లేచి వెళ్లేలోపే కుక్క దాడి చేసి పారిపోయింది. మా ఇంట్లో ఉన్న పిల్లలు కుక్క కోసం వెంబడించగా వారిపై కూడా దాడి చేసే ప్రయత్నం చేసింది.
17 కుక్కల పట్టివేత....
జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ) : హనుమకొండ రెడ్డికాలనీ తదితర ప్రాంతాల్లో కుక్కల దాడి ఘటనతో బల్దియా అధికారులు హుటాహుటిన ఘటనా స్థలాలకు చేరుకున్నారు. గురువారం రెడ్డి కాలనీ నుంచి పెగడపల్లి డబ్బాల వరకు కేయు–పెద్దమ్మగడ్డ రోడ్డులో మొత్తంగా 17 కుక్కలను పట్టుకున్నారు. బల్దియా అధికారులు మొత్తం 17 కుక్కలు పట్టుకొగా అందులో దాడి జరిపిన కుక్కలు ఐదున్నాయి. వీటిలో నాలుగు పిల్లలు, వాటి తల్లి జనాన్ని వెంటాడి గాయపరిచాయి. పిల్లలు దొరికినా గురువారం రాత్రి 9:30 గంటల వరకు తల్లి కుక్క దొరకలేదు. కుక్క కోసం బల్దియా అధికారులు నానా తంటాలు పడ్డారు. చివరకు చిక్కడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ పరిణామం తదుపరి రెడ్డికాలనీకి కొద్ది దూరంలోనే మరో పిచ్చి కుక్క తిరుగుతున్నట్లు బల్దియా అధికారులకు సమాచారం అందింది. ప్రయత్నించినా దొరకకపోవడంతో శుక్రవారం కుక్క పట్టివేత చర్యలు చేపడతామని బల్దియా అధికారులు తెలిపారు. సీఎంహెచ్‌వో డాక్టరు రాజేశ్, వెటర్నరీ డాక్టరు గోపాలరావు, డీసీ జోనా, శానిటరీ సూపర్‌వైజర్ భాస్కర్ తదితరులు కుక్కల పట్టివేత చర్యలను ఘటనా స్థలాల వద్దే ఉండి పర్యవేక్షించారు.
ఇటీవలి ఘటనలు..
హనుమకొండ ఎన్‌జీవో్‌స కాలనీలో కీర్తన్ అబ్రహం కుక్కల దాడికి గురయ్యాడు. 72కు పైగా కాట్లు పడ్డాయి
ఖిలా వరంగల్ విద్యానగర్, ఉర్సులో నలుగురు చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. దాడిలో ప్రణీత పళ్లు ఊడాయి.
ఉర్సులో పాల్, శ్రీరామ్, మోహిత్, సరోజన, రేణులపై కుక్కలు పరుగెత్తించి దాడి చేశాయి.
వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి మేకల సులోచన హనుమకొండ నక్కలగుట్టలో కుక్కల దాడికి గురయ్యారు. వాహనం వెనకాల కూర్చున ఆమె కిందపడ్డారు. హైదరాబాద్ తీసుకెళ్లి చికిత్స జరిపినా ఫలితం లేదు. బ్రెయిన్ డెడ్‌తో మరణించారు.
కొద్ది నెలల క్రితం ఖిలా వరంగల్‌లో చిన్నారులపై కుక్కలు దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు.