చెరువులు నిండుగా.. చేలు పచ్చగా..

ABN , First Publish Date - 2023-08-08T23:56:31+05:30 IST

కాలం కరుణించింది.. గత జూలై చివరి వారంలో కురిసిన వానలతో చెరువులు, కుంటలు జలకళ ను సంతరించుకున్నాయి. వారం రోజులపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో ఖరీ్‌ఫకు కాలం అయింది. ఒక దశలో వరిపంట భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో గత నెలలో పడిన వానలతో ఒకటి, రెండు చెరువులు మినహా అన్ని చెరువులు నిండాయి. అలుగులు పోశాయి.

చెరువులు నిండుగా.. చేలు పచ్చగా..

ఐదు రోజుల్లోనే ఏడాదంతా వర్షం

ఊపందుకున్న వరినాట్లు

ఇప్పటికీ 1,06,167 ఎకరాల్లో నాట్లు పూర్తి

జిల్లాలో అలుగు పోసిన 111 చెరువులు

జూలై నెలలోనే రికార్డుస్థాయిలో వానలు

మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, ఆగస్టు 8 : కాలం కరుణించింది.. గత జూలై చివరి వారంలో కురిసిన వానలతో చెరువులు, కుంటలు జలకళ ను సంతరించుకున్నాయి. వారం రోజులపాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో ఖరీ్‌ఫకు కాలం అయింది. ఒక దశలో వరిపంట భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో గత నెలలో పడిన వానలతో ఒకటి, రెండు చెరువులు మినహా అన్ని చెరువులు నిండాయి. అలుగులు పోశాయి. గత 15 ఏళ్ల తర్వాత ఇలాంటి వర్షాలు ఈ ఏడాది మాత్రమే వచ్చాయి. ఈ జూలై నెలలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. చెరువులు నిండటంతో రైతులు ఆనందంతో వరినాట్లను ముమ్మరం చేశారు. మరోవైపు పంట చేనులు పచ్చగా కళకళలాడుతున్నాయి. ఇప్పటి వరకు 1,06,167 ఎకరాల్లో వరి నాట్లు పూర్తి చేశారు.

వానాకాలం ప్రారంభం కాగానే జూన్‌ నెలలో నైరుతి రుతుపవనాలు ప్రారంభం కావాలి. అయితే ఈసారి నైరుతి రైతులతో దోబూచులాడింది. మహబూబాబాద్‌ జిల్లా వ్యాప్తంగా జూన్‌ 1వ తేదీ నుంచి జూలై 1 వరకు 146.6 మిల్లీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉండగా, 76.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షపాతం లోటు మైనస్‌ 48.0 మిల్లీమీటర్లు. 13 మండలాల్లో 20 నుంచి 59 మిల్లీమీటర్లతో వర్షపాతం నమోదు కాగా, నాలుగు మండలాలు డేంజర్‌ జోన్‌లోకి వెళ్లాయి. అంతేకాక ఎండలు కూడ పెరగడంతో రైతులు విలవిలలాడారు. ఈ ఖరీ్‌ఫలో వరి వేయడం కష్టతరమే అని.. అదునుదాటుతున్న వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.

ఐదు రోజుల వానలతోనే ..

ఈ జూలై నెలలో కూడ వర్షాలు పడ్డప్పటికి 18వ తేదీనుంచి ఏకధాటిగా వానలు ప్రారంభమయ్యాయి. అకాశానికి చిల్లులు పడ్డాయా అన్న రీతిలో కుండపోత వర్షాలు కురియడంతో వాగులు, వంకలు నీటి ఉధృతితో పొంగిపొర్లాయి. 2008లో అంత భారీ వర్షాలు పడ్డాయని, ఈ ఏడాది కూడ అంతే భారీ వర్షాలతో రికార్డుస్థాయిలో కురిశాయని పలువురు రైతులు చెబుతున్నారు. జూలై 20న 1,069.0 మిల్లీమీటర్లు, 21న 648.0 మిల్లీమీటర్లు, 25న 1,662.4 మిల్లీమీటర్లు, 26న 686.2 మిల్లీమీటర్లు, 27న 3,181.0 మిల్లీమీటర్ల అతిభారీ వర్షం కురియడంతో ఏడాదికి సరిపోయేంత భారీ వర్షం కురిసింది.

మహబూబాబాద్‌ జిల్లా మొత్తంలో జూలై నెలలో 272.9 మిల్లీమీటర్లు సగటున కురియాల్సి ఉండగా.. 553.1 మిల్లీమీటర్లు సగటున కురిసింది. ఈ వర్షాలు రికార్డు స్థాయిలో కురిశాయి. ఈ భారీ వర్షాలకు జిల్లాలో మూడుచెరువులు మినహా అన్ని చెరువులు నిండాయి.. అలుగులు పోశాయి.

చెరువులకు జలకళ..

భారీ వర్షాల మూలంగా కొన్ని చెరువులు గండిపడి చెరువు కట్ట లు తెగిపోగా, నీరు వృథాగా పోయింది. ఈ ఆగస్టు 1 నుంచి జిల్లా లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం జిల్లాలో 111 చెరువులు అలుగులు పోస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. 1,463 చెరువులు 75 నుంచి 100 శాతం వరకు నిండి ఉన్నాయి. ఒక చెరువు మాత్రం అడుగంటి పోయింది. కొత్తగూడలో 378, గంగారంలో 214, గూడూరులో 108, గార్లలో 85, బయ్యారంలో 85, కురవిలో 65, మహబూబాబాద్‌లో 80, డోర్నకల్‌లో 65, మరిపెడలో 54 చెరవులు నిండి జలకళను సంతరించుకున్నాయి.

జోరందుకున్న వరినాట్లు..

భారీ వర్షాల మూలంగా వరినాట్లు ఊపందుకున్నాయి. జిల్లాలో వివిధ పంటలు 3,58,747 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 2,43,528 ఎకరాల్లో వేసినట్లు జిల్లా వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వరి సాధారణ విస్తీర్ణం 1,59,408 ఎకరాల్లో వేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 1,06,167 ఎకరాల్లో వేశారు. అధికంగా కేసముద్రం, నెల్లికుదురు, పెద్దవంగర, తొర్రూరు మండలాల్లో వరిబాగా సాగు చేస్తున్నారు. అలాగే పత్తి 76,870 ఎకరాల్లో వేశారు. ఈసారి సుమారు 20 వేల ఎకరాల్లో గతేడాది కంటే విస్తీర్ణం తగ్గింది. పచ్చజొన్నలు 22 ఎకరాలు, మొక్కజొన్నలు 49,891, పెసర 3,165 ఎకరాల్లో, మినుములు 152, కందులు 1,841, బొబ్బెర్లు 10, వేరుశనగ 7 ఎకరాలు, పసుపు 374 ఎకరాల్లో వేయగా అయిల్‌పామ్‌ తోటలు 5181 ఎకరాల విస్తీర్ణంలో వేశారు. అయితే 47,586 ఎకరాల్లో మిర్చి తోటలు వేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఎకరం కూడ ఎక్కడ సాగు చేయలేదు. మిర్చినారు పెంచుతున్న కారణంగా మిర్చి ఇంకా సాగు చేయడం లేదు.

కరువు తీరింది..: పోసాని రాములు, రైతు, వెలికట్టే, తొర్రూరు

ఈ వానాకాలంలో కరువు కాలం వస్తుందని ముందుగా భావించాం. వర్షాలు లేకపోవడంతో వాన దేవుడికి ఎన్నో పూజలు చేశాం. అయినప్పటికి ఆలస్యంగా జూలై నెలలో అతిభారీ వర్షాలు కురియడంతో కరువు తీరిపోయింది. చెరువులు నిండుకుండలా ఉన్నాయి. వరినాట్లు పడుతున్నాయి. గతవారం నుంచి మళ్లీ వర్షాలు కురియడం లేదు. వర్షాలు పడితే పత్తిపంట బాగా వస్తుంది.

Updated Date - 2023-08-08T23:56:31+05:30 IST