‘క్లీన్‌’ ఇమేజ్‌

ABN , First Publish Date - 2023-01-10T00:20:35+05:30 IST

పారిశుధ్య నిర్వహణలో వరంగల్‌ మహానగరం భేష్‌ అనిపించుకుంటోంది. మహానగర పాలక సంస్థ అమలు చేస్తున్న పారిశుధ్య విధానాలు దేశంలోని నగరాలనే కాదు ఇతర దేశాలను కూడా ఆకర్షిస్తున్నాయి.

‘క్లీన్‌’ ఇమేజ్‌
వరంగల్‌ నగర పారిశుధ్య విధానాల అధ్యాయనానికి నగరంలో పర్యటించిన బంగ్లాదేశ్‌ మేయర్ల బృందం (ఫైల్‌)

పారిశుధ్య నిర్వహణలో జీడబ్ల్యుఎంసీ ముందంజ

జాతీయ స్థాయి పోటీల్లో ఉన్నత స్థానాల కైవసం

యేటా మెరుగవుతున్న పారిశుధ్య విఽధానాలు

అధ్యయనానికి వస్తున్న ఇతర దేశాల మేయర్లు

ఫాస్ట్‌ మూవింగ్‌ సిటీ్‌సలో 3వ ర్యాంక్‌తో తనదైన ముద్ర

జీడబ్ల్యూఎంసీ(హనుమకొండ సిటీ), జనవరి 9 : పారిశుధ్య నిర్వహణలో వరంగల్‌ మహానగరం భేష్‌ అనిపించుకుంటోంది. మహానగర పాలక సంస్థ అమలు చేస్తున్న పారిశుధ్య విధానాలు దేశంలోని నగరాలనే కాదు ఇతర దేశాలను కూడా ఆకర్షిస్తున్నాయి. నగరానికి విచేస్తున్న ఇతర రాష్ట్రాలు, దేశాల ప్రజాప్రతినిధులు పారిశుధ్యం మెరుగ్గా ఉందని ప్రశంసిస్తున్నాయి. పారిశుధ్య విధానాల్లో మానవ వనరులే కాకుండా అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని నిర్వహణలో మున్ముందుకు నగరం దూసుకెళ్తోందిన.

ఇతర దేశాల వారి అధ్యయనం

కమిషనర్‌ వివేక్‌యాదవ్‌ హయంలో జాతీయ స్థాయిలో క్లీన్‌సిటీగా పేరొందిన వరంగల్‌ నగరం ఆ తదుపరి క్రమం వెనకంజ వేసింది. వచ్చిన పేరును నిలబెట్టుకోలేకపోయింది. కానీ మూడేళ్ల క్రితం ఆరంభమైన స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలు ఆరంభమైన నాటి నుంచి వరంగల్‌ నగరం పారిశుధ్య నిర్వహణలో ఒడిదుడుకులు ఎదురైనా ఉత్తమ ఫలితాలను సాధించే పట్టుదలతో అడుగులు వేసింది. గడిచిన మూడేళ్లలో మెరుగైన వృద్ధిని సాధిస్తూ భేష్‌ అనిపించుకుంటోంది. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు ఇతర దేశాలలోని నగరాల మేయర్లు, ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్‌ అధికారులు నగరంలోని పారిశుధ్య విధానాల అధ్యయనానికి రావడమే ఇందుకు నిదర్శనం. బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాల ప్రజాప్రతినిధులు, మేయర్లు, అధికారులు ఇటీవలే నగరంలో పర్యటించారు. బంగ్లాదేశ్‌ ప్రజాప్రతినిధులు 40 రోజుల వ్యవధిలో రెండు సార్లు పర్యటించడం విశేషం. వీరంతా జీడబ్ల్యూఎంసీ అధ్వర్యంలో నగరంలోని పారిశుధ్య విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

నగరంలో పర్యటించిన రాష్ట్రాలు, ఇతర దేశాల ప్రజాప్రతినిధులు, అధికారులు సమగ్ర అధ్యయనం జరిపారు. నగరంలో పబ్లిక్‌ టాయిలెట్ల నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంటింటా చెత్త సేకరణ, చెత్త తరలింపు, షీ-టాయిలెట్ల నిర్వహణ, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, సెకండ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు, పారిశుధ్య విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు, మెప్మా సిబ్బంది, ప్రజా సంఘాల భాగస్వామ్యం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధ్యాయనం చేశారు.

శుద్ధీకరణ ప్లాంట్‌తో గుర్తింపు

ఇక అత్యాధునిక సాంకేతిక వనరుల సమకూర్పును కూడా ముఖ్యంగా బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాల ప్రజాప్రతినిధులు, మేయర్లు, అధికార్లను విశేషంగా ఆకర్షించింది. వీటిలో ప్రధానమైనది వరంగల్‌ అమ్మవారిపేటలోని మావన వ్యర్ధాల శుద్థీకరణ ప్లాంట్‌. దేశంలో ప్లాంట్‌ నిర్వహణలో వరంగల్‌ నగరం రెండవ స్థానంలో తెలంగాణలోనే ప్రథమ స్థానంలో ఉండడం వరంగల్‌ నగరానికి మరింత గుర్తింపును తెచ్చింది.

మన దేశంలోని రాష్ట్రాలు, ఇతర దేశాల వారిని మరింతగా ఆకర్షించింది. అమ్మవారిపేటలోనే 150 కేఎల్‌డీ సామర్ధ్యంతో మరో ప్లాంట్‌ కూడా నిర్మాణంలో ఉండడం పట్ల బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాల ప్రజాప్రతినిధులు ప్రశంసలు కురిపించారు. ప్లాంట్ల నిర్వహణపై సమగ్ర అధ్యాయనంతో పాటు ఆస్కీ వారి తో సమాచారాన్ని పొందారు. తమ దేశంలో ప్లాంట్ల నిర్వహణకు తొలి అడుగు పడినట్లేనని వరంగల్‌ పర్యటనలో బంగ్లాదేశ్‌లోని వివిధ నగరాల మేయర్లు ఖలీద్‌ హుస్సేన్‌, జఖియా ఖతూన్‌, ఖాజీ మహ్మదుల్‌ హుస్సేన్‌, నిర్మలేందు వెల్లడించడం గమనార్హం. కేవలం పారిశుధ్య విధానాలే కాదు పార్కుల నిర్మాణం, నిర్వహణ, గ్రీనరీ, సుందరీకరణ వంటి అంశాలు కూడా ఇతర దేశాల ప్రజాప్రతినిధులు ఎంతో ఆకట్టుకున్నాయి.

ఫాస్ట్‌ మూవింగ్‌ సిటీ

వరంగల్‌ నగరానికి ఫాస్ట్‌ మూవింగ్‌ సిటీ్‌సలో జాతీయ స్థా యిలో మూడవ ర్యాంక్‌ రావడం కూడా మరింత గుర్తింపునిచ్చింది. 2021 స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో వరంగల్‌ 115వ ర్యాంక్‌ లో నిలిచి నిరుత్సాహపరిచినా ఏడాది వ్యవధిలో జరిగిన 2022 పోటీల్లో 62వ ర్యాంక్‌ను సాధించి వృద్ధిని చూపింది. ఈ ర్యాంక్‌ సాధనే పది లక్షల జనాభా కేటగిరి నగరాల్లో జరిగిన పోటీల్లో ఫాస్ట్‌ మూవింగ్‌ సిటీ్‌సలో జాతీయ స్థాయిలో వరంగల్‌ నగరం 3వ ర్యాంక్‌లో నిలిపింది. కేంద్ర మినిస్ట్రీ ఆఫ్‌ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ ఎఫైర్స్‌ ప్రకటించిన ఈ ర్యాంక్‌ అవార్డును ఈ నెల 5వ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ ప్రావీణ్యకు అందచేశారు.

మెరుగవుతున్న విధానాలు

నగరంలో పారిశుధ్య విధానాలు యేటా క్రమ క్రమంగా మెరుగవుతున్నాయి. పూర్తి స్థాయిలో జరగాల్సి ఉన్నా నగరం ఒక్కో అడుగు ముందుకు వేస్తోంది. పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణాల సంఖ్య పెరగడం, షీ-టాయిలెట్ల నిర్వహణ, నగర రహదారుల పరిశుభ్రతకు స్వీపింగ్‌ యంత్రాలు, అత్యాధునిక వాహనాలు, ఇంటింటి చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోల సంఖ్యను పెంచడం వంటి వనరులను సమకూర్చుకుంటోంది. అయితే సెకండ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్ల సంఖ్య రెండుకే పరిమితం కావడం, ముఖ్యంగా మడికొండలోని రాంపూర్‌ డంపింగ్‌ యార్డుకు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటికీ చర్యలు లేకపోవడం, ప్రణాళికలకే పరిమితం కావడం వంటి అంశాలు నగరాన్ని కొంత నిరుత్సాహ పరుస్తున్నాయి. ఈ లోపాలను కూడా పూరించుకుంటే నగర కీర్తి మరింత వ్యాప్తి చెందుతుంది.

Updated Date - 2023-01-10T00:20:37+05:30 IST