డెంగీ అలజడి
ABN , First Publish Date - 2023-09-23T00:04:00+05:30 IST
భూపాల పల్లి జిల్లాలో డెంగీ పంజా విసురుతోంది. బాధితుల్లో ఎక్కువ చిన్నారులు ఉండడం ఆందోళనను రెట్టింపు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. 2023 జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 37 కేసులు నమోదు అయితే ఒక్క సెప్టెంబర్ నెలలోనే 16కు పైగా కేసులు నమోదు కావడం డెంగ్యూ తీవ్రతకు అద్దం పడుతోంది.
భూపాలపల్లి జిల్లాలో వేగంగా ప్రబలుతున్న వైనం
సెప్టెంబరు ఒక్క నెలలోనే 16 కేసుల నిర్ధారణ
ఇప్పటికే నలుగురు చిన్నారుల బలి
భూపాలపల్లి కలెక్టరేట్, సెప్టెంబరు 22: భూపాల పల్లి జిల్లాలో డెంగీ పంజా విసురుతోంది. బాధితుల్లో ఎక్కువ చిన్నారులు ఉండడం ఆందోళనను రెట్టింపు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. 2023 జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 37 కేసులు నమోదు అయితే ఒక్క సెప్టెంబర్ నెలలోనే 16కు పైగా కేసులు నమోదు కావడం డెంగ్యూ తీవ్రతకు అద్దం పడుతోంది. వ్యాధి చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో నాలుగు మరణాలు జరిగితే ఆ నలుగురు చిన్నారులే కావడం గమనార్హం. చనిపోయిన చిన్నారులు 10 ఏళ్ల లోపు వారు ఉండడంతో ఆయా కుటుం బాల్లో విషాధచాయాలు అలముకున్నాయి. డెంగీ మరణాలు సంభవిస్తున్న వైద్యశాఖ వద్ద ఎటువంటి సమాచారం లేకపోవడం గమనార్హం. చనిపోయిన నలుగురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారే. జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ లక్షణాలతో చేరి చికిత్స పొందుతున్న వారి వివరాలను వైద్యఆరోగ్యశాఖ అధికారులకు ఇవ్వకుండా గోప్యంగా చికిత్స అందిస్తు మరణాలకు కారణం అవుతున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. 2023 జనవరి నుంచి సెప్టెంబరు నాటికి జిల్లా వ్యాప్తంగా 37 డెంగ్యూ కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా సెప్టెంబరు నెలలోనే 16కు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ముఖ్యంగా భూపాలపల్లి, కాటారం, ఘణపురం పీహెచ్‌సీల పరిధిలో సెప్టెంబర్ నెలలో కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయి. జిల్లాలో నమోదు అయిన 37 కేసుల్లో 5 కిపైగా ఆక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. పలు గ్రామాల్లో జ్వరాలు ఉన్నా పరీక్షలు చేస్తే మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
చిన్నారులపై తీవ్ర ప్రభావం
పెద్దలతో పోలిస్తే చిన్నారుల్లో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండడంతో ముఖ్యంగా 15 ఏళ్ల పిల్లలపై డెంగీ వ్యాధి తీవ్ర ప్రభావం చూపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు. తద్వారా పిల్లల్లో ప్లేట్‌లెట్స్ వేగంగా పడిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. జిల్లాలో డెంగీతో మృతి చెందిన నలుగురు చిన్నారులు కావడ మే కాకుండా వారి వయస్సు కుడా పదేళ్ల లోపే. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్‌మార్క్స్ కాలనీకి చెందిన మాదంశెట్టి శివయోధ్(5) డెంగీ జ్వరంతో హనుమకొండలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ఈనెల 10న మృతి చెందాడు. మల్హార్‌రా వు మండలానికి ఎడ్లపల్లి గ్రామానికి చెందిన ఆధ్యశ్రీ (9) హనుమకొండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 19వ తేదిన మృత్యువాత పడింది. భూపాలపల్లి పట్టణానికి చెందిన తిరునహరి లికిత్(6) మొదట భూపాలపల్లి పట్టణంలోని ప్రైవేటుకు సంబంధించిన పిల్లల ఆస్పత్రిలో డెంగీ కారణంగా రక్తకణాలు తగ్గాయని చికిత్స తీసుకోగా వ్యాధి తీవ్రత కారణంగా హనుమ కొండ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అం దిస్తుండగా ఈనెల 20న మృత్యువాత పడ్డాడు. ఈ ముగ్గురు చిన్నారులతో పాటు మల్హార్ మండలంలోని కుంభంపల్లి గ్రామానికి చెందిన ఏడాది వయస్సు ఉన్న తోటపల్లి స్టీఫెన్‌పాల్ డెంగీతో ఈనెల 21న(గురువారం) హైదారాబాద్‌లోని నిలోఫర్‌లో మృతి చెందాడు.
వైద్యఆరోగ్య శాఖ వద్ద సమాచారం నిల్..
జిల్లాలో డెంగీ కేసుల నిర్ధారణ సమాచారం వైద్యఆరోగ్యశాఖ వద్ద ఉండడం లేదు. ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెప్పే ది ఒకటి.. క్షేత్రస్థాయిలో జరిగేది మరోలా ఉంది. డెంగీ వల్ల ఇప్పటి వరకు జిల్లాలో నలుగురు మృత్యు వాత పడితే అధికారుల వద్ద ఒక్క రి సమాచారం కుడా లేకపోవడం గమనార్హం. ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ అయ్యి చికిత్స పొం దుతున్న వారి వివరాలు సైతం వైద్యశాఖ లేనేలేవు. కానీ ప్రైవేటు ఆస్పత్రులు వ్యాధి నిర్ధారణ, చికిత్సపై కుడా అధికా రులకు ఎటువంటి సమాచారం అందించడం లేదు. విషమంగా ఉండి మృతి చెందిన వారి వివరాలు సైతం అధికారులకు తెలియడంలేదు. డెంగ్యూ కేసుల సమా చారం విషయంలో గోప్యత పాటిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవడంలో మాత్రం సంబంధిత శాఖ అఽధి కారులు చేతులు కట్టేసుకున్నట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పడకేసిన పారిశుధ్యం
వర్షాకాలంలో కావడంతో గ్రామాలు, పట్టణల్లో నీరు నిల్వ ఉండడంతో దోమల వ్యాప్తి చెంది వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లాలోని గ్రామాలతో పాటు భూపా లపల్లి మునిసిపాలిటీలో పారిశుధ్య కార్యక్రమాలు పడ కేయడంతో ప్రజలు వ్యాధుల బారినప డుతున్నారు. కాలనీల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతుంది. సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంతో సంబంధిత ప్రజలు జబ్బు పడుతున్నారు. గ్రామాల్లో ఫాగింగ్ నామమాత్రంగా చేస్తుండడంతో దోమలు వేగంగా వృద్ధిచెంది వైరల్ ఫీవర్స్, డెంగీ వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి.
కేసుల వివరాలు అందించాలి.. లేకుంటే కఠిన చర్యలు
- ధనసరి శ్రీరాం, డీఎంహెచ్‌వో, భూపాలపల్లి
ప్రైవేటు ఆస్పత్రుల్లో డెంగీ నిర్ధారణ అయిన కేసుల వివరాలను వైద్యఆరోగ్యశాఖకు అందించాలి. డిపార్ట్‌మెంట్‌కు అందించకుండా చికిత్స చేస్తే కఠిన చర్యలు తప్పవు. డెంగీ చికిత్స విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం. డెంగీ ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటాం.