వివాదాల దళితబంధు

ABN , First Publish Date - 2023-07-01T00:14:10+05:30 IST

దళితులను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథ కం ములుగు జిల్లాలో వివాదాస్పదమైంది.

వివాదాల దళితబంధు
గతేడాది జూన్‌ 4న మొదటి విడత దళితబంధు పథకంలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన వాహనాలు (ఫైల్‌)

రెండో విడతకు సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌

ఈసారి నియోజకవర్గానికి 1100 యూనిట్లు

లబ్ధిదారుల ఎంపిక మళ్లీ ఎమ్మెల్యేలకే

మొదలైన దరఖాస్తు ప్రక్రియ

గతంలో సొంత పార్టీపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తల తిరుగుబాటు

ఎమ్మెల్యే సీతక్క కాంగ్రెస్‌ కార్యకర్తలకే ఇస్తున్నారని ఆరోపణ

ఇన్‌చార్జి మంత్రి సత్యవతి, ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందనపై ఆసక్తి

ములుగు, జూన్‌ 30: దళితులను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్ధేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథ కం ములుగు జిల్లాలో వివాదాస్పదమైంది. పథకం లక్ష్యం గొప్పదే అయినా అమలు తీరుతో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీలో అంతర్గత విబేధాలకు దారితీ స్తోంది. జీవో ప్రకారం లబ్ధిదారుల ఎంపిక బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదే కాగా జిల్లాలో ఉన్న ఇద్దరు శాసనసభ్యులు ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చెందిన వారు కావడంతో వివాదానికి కారణమైంది. తమకు పథకం దక్కడం లేదని గులాబీ కార్యకర్తలు అమాత్యుల ఎదుటే అసహనం, అసంతృప్తిని బహిర్గ తం చేశారు. రెండో విడత దళితబంధుకు ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఈసారైనా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పథకం వర్తిస్తుందా..? జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యవతి రాథోడ్‌ ఎలా స్పందిస్తారు..? అనే ఆసక్తి నెలకొంది.

తొలి విడతలో 119 మందికి..

ములుగు జిల్లాలో తొమ్మిది మండలాలుండగా ఏడు ములుగు అసెంబ్లీ, రెండు మండలాలు భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. మొత్తం 119 యూనిట్లు మంజూరు కాగా, ములుగుకు 79, భద్రాచలంలోని రెండు మండలాలకు 40 యూనిట్లు కేటాయించారు. వీరిలో 97 మంది వాహనాల కొనుగోలుకే మొగ్గుచూపడం గమనార్హం. ఎన్నికలు దగ్గరపడు తున్న నేపథ్యంలో ప్రభుత్వం రెండో విడత దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు నిర్ణయించింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి అత్యధికంగా 1100 యూనిట్లను కేటాయించింది. ఈ మేరకు జూన్‌ 24న ఎస్సీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు.

ఎమ్మెల్యేలకే ఎంపిక బాధ్యత

దళితబంధు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యేలకే అప్పగించింది. మొదటి విడత అమలు సమయంలో జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ పథకాన్ని అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈసారి 1100 యూనిట్లు మంజూరు కాగా ఎమ్మెల్యేలకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో దళితులు క్యాంపు కార్యాలయానికి వచ్చి దరఖాస్తులు అందజేస్తున్నారు. ఎమ్మెల్యేలు సూచించిన జాబితాను ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు జిల్లా ఇన్‌చార్జి మంత్రికి పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందితే క్షేత్ర స్థాయిలో ఎంపీడీవోలు విచారణ జరిపి లబ్ధిదారులను గుర్తిస్తారు. ఆవిధంగా రూపొందించిన తుది జాబితాను జిల్లా కలెక్టర్‌ ప్రభుతానికి నివేదించనుండగా.. ఆ లిస్టులో ఉన్న వారికే దళితబంధు సాయం అందుతుంది. లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రస్తుతానికి తుది గడువు నిర్ణయించకపోగా ఎన్నికల గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో తొందరలోనే లబ్ధిదారుల గుర్తింపు, యూనిట్ల పంపిణీ జరుగుతుందని తెలుస్తోంది.

ఈసారైనా దక్కేనా..?!

ఎలాంటి షరతులు, లబ్ధిదారు వాటా లేకుండా వంద శాతం రాయితీతో రూ.10 లక్షల సాయం అందుతుండటంతో దళిత వర్గాల్లో దళితబంధు పథకంపై అమితాసక్తి నెలకొంది. ఒక్క యూనిట్‌ దక్కితే ఆర్థికంగా కుదురుకోవచ్చనే ఆశ కలిగింది. అందుకే జాబితాలో తమ పేరు కోసం తండ్లాడుతున్నారు. ఈక్రమంలో పథకానికి రాజకీయ రంగు అంటుకుంది. జిల్లా పరిధిలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు కావడంతో వివాదానికి కారణమైంది. వారు తమ పార్టీ కార్యకర్తలకే పథకాన్ని ఇస్తున్నారని, దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆ పార్టీ నేతలు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఈ వివాదం నడుమే మొదటి విడత పంపిణీ పూర్తయ్యింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యవతి రాథోడ్‌ చొరవ తీసుకొని ఎమ్మెల్యేలతో మాట్లాడితే 70ః30 నిష్పత్తిలోనైనా కొద్దిపాటి యూనిట్లు దక్కుతాయోనని ఆశపడ్డ వారికి భంగపాటు ఎదురైంది. రెండో విడతలోనైనా తమ పార్టీ కార్యకర్తలకు అవకాశం దక్కుతుందా..? అని గులాబీ నేతలు ఎదురుచూస్తున్నారు.

అమాత్యులకు నిరసన సెగ..

మొదటి విడత దళితబంధు పథకం బీఆర్‌ఎస్‌ పార్టీలో అసంతృప్తి సెగను రాజేసింది. ఈ పథకం తమకంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మైలేజీ ఇస్తుండటం, తమనే నమ్ముకున్న కార్యకర్తలకు ఏం చేయలేకపోతుండటం తో సొంత పార్టీ నేతలు, మంత్రులనే నిలదీసే పరిస్థితి ఎదురైంది. పథకం రూపకల్పన, అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను సవరించే అవకా శం లేకపోవడంతో అధికార పార్టీ పెద్దలు మౌనం వహించాల్సి వచ్చింది. మొదటి విడతలో 119 యూనిట్లను ఎమ్మెల్యేలు మొత్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని, మొదటి నుంచి జెండా మోసిన మా పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తూ కొందరు దళిత నేతలు, కార్యకర్తలు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యవతిరాథోడ్‌ వాహనాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు. జడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల అధ్యక్షులు సమావేశమై మంత్రులు, నేతలపై విమర్శనాస్ర్తాలు సంధించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు లోపాయి కారంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీశాయి. అయితే కొంతమందే ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ ఎమ్మెల్యేల కోసం మొత్తం పథకం గైడ్‌లైన్స్‌ను మార్చేందుకు సర్కారు సుముఖంగా లేకపోవడం.. మొదటి విడత మార్గదర్శకాలనే మళ్లీ అమలు చేస్తుండటంతో జిల్లా గులాబీ శ్రేణుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది.

సవాల్‌ చేశారు.. మరి స్పందిస్తారా..?

ములుగు జిల్లాకు సత్యవతిరాథోడ్‌ ఇన్‌చార్జి మంత్రి కాగా, అదే స్థాయి లో మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రభావం చూపుతున్నారు. సత్యవతితో పోల్చుకుంటే ఎర్రబెల్లికి ఎక్కువ మంది అనుచరులున్నారు. ఈక్రమంలో దళితబంధు పథకాన్ని సొంత పార్టీ కార్యకర్తలకు ఇప్పించేం దుకు వారు ఏవిధంగా స్పందిస్తారోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. జూన్‌ 7వ తేదీన మంత్రి కేటీఆర్‌ ములుగు పర్యటనకు వచ్చిన సందర్భం గా జరిగిన సభలో ఈ ఇద్దరు మంత్రులు వచ్చే ఎన్నికల్లో సీతక్కను ఓడించి తీరుతామంటూ కార్యకర్తలలో భరోసా నింపారు. ఎర్రబెల్లి అయితే ఓ దశలో సీతక్కపై పరోక్ష విమర్శలతో విరుచుకుపడ్డా రు. ఇన్నాళ్లు కారెక్కుతానని సీతక్క తమను నమ్మించ డంతో పెద్దగా పట్టించుకో లేదని, ఈసారి తుక్కుతు క్కుగా ఓడిస్తామం టూ వ్యాఖ్యానించారు. సీతక్క కూడా ఘాటుగానే స్పందించారు. తనను ఓడించడం మీతరం కాదని మంత్రులకు సవాల్‌ విసిరారు. ఇలా ఇరువర్గాల నడుమ పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. మంత్రుల వ్యాఖ్యలపై సీరియస్‌గా ఉన్న సీతక్క.. ఇది ఎన్నికల ఏడాది కావడంతో ఎక్కువ మంది కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు, నమ్మకస్తులకు లబ్ధి చేకూర్చడం ద్వారా నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు దళితబంధు పథకాన్ని ఇప్పించుకోవడంలో మంత్రులు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు..? ఈసారైనా అదృష్టం దక్కుతుందా.. లేదా..? అనే చర్చ జోరుగా సాగుతోంది.

Updated Date - 2023-07-01T00:14:53+05:30 IST