బంజరు భూముల్లో బంగారు పంటలు

ABN , First Publish Date - 2023-08-16T00:05:11+05:30 IST

ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకూ పనికిరావని వదిలేసిన బంజరు భూముల్లో ప్రస్తుతం బంగారు పంటలు పండుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాళేశ్వరం, ఎస్పారెస్పీ, దేవాదుల కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడంతో రాష్ట్రంలోని భూములన్నీ సస్యశ్యామలం అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లాకేందరంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

బంజరు భూముల్లో బంగారు పంటలు

దండగ అన్న వ్యవసాయాన్ని పండగ చేశాం

అన్నదాత సంక్షేమానికే ప్రాధాన్యం

జిల్లాలో రెండు విడతల్లో రూ. 411.54 కోట్ల రుణమాఫీ

ఈ ఏడాది నుంచే మెడికల్‌ కాలేజీ తరగతులు

రూ.221.69 కోట్లతో ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు

‘పల్లె ప్రగతి’తో జాతీయస్థాయి అవార్డులు

పంద్రాగస్టు వేడుకల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

జనగామ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఎందుకూ పనికిరావని వదిలేసిన బంజరు భూముల్లో ప్రస్తుతం బంగారు పంటలు పండుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాళేశ్వరం, ఎస్పారెస్పీ, దేవాదుల కాలువల ద్వారా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడంతో రాష్ట్రంలోని భూములన్నీ సస్యశ్యామలం అయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జిల్లాకేందరంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ దండగలా ఉండేదని, స్వరాష్ట్రం సిద్ధించాక వ్యవసాయాన్ని పండగలా చేసుకున్నామని అన్నారు. గతంలో వ్యవసాయం చేసేటోళ్లకు పిల్లను కూడా ఇచ్చేవారు కారని గుర్తు చేశారు. నిత్యం కరువు కాటకాలతో వెలుగొందిన జనగామ ప్రాంతం ప్రస్తుతం సాగునీరు సమృద్ధిగా అందిస్తుండడం వల్ల సస్యశ్యామలంగా మారిందని అన్నారు. అన్నం పెట్టే రైతన్నకే ప్రభుత్వం ప్రాధ్యానత ఇస్తోందని స్పష్టం చేశారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌, రుణమాఫీ, చెరువుల పునరుద్ధరణ, విత్తనాల సరఫరా, ధాన్యం కొనుగోళ్లు, రైతువేదికల నిర్మాణం వంటి కార్యక్రమాలతో సేద్యంపై రైతుల్లో విశ్వాసాన్ని నింపామని అన్నారు. కేసీఆర్‌ సమర్ధవంతమైన పాలనతో దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అద్భుత విజయాలను సాధించిందని అన్నారు. పదేళ్లలో అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. దేశంలో ఎక్కడా లేనన్ని వినూత్నమైన పథకాలతో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించడం ప్రభుత్వ మెరుగైన పాలనకు నిదర్శమని అన్నారు. జిల్లాలో రైతుబంధు కింద ఇప్పటి వరకు 11 విడతలలో కలిపి రూ.1917.66 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. రైతుబీమా కింద 2512 కుటుంబాలకు రూ. 125.60 కోట్లు అందించామని తెలిపారు. రైతు రుణమాఫీ కింద జిల్లాలో రెండు విడతలలో కలిపి 74,624 మంది రైతులకు రూ. 411.54 కోట్లు మాఫీ చేశామన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని, చెరువుల పునరుద్ధరణ ద్వారా సాగునీటి వనరులు పటిష్టం అయ్యాయని అన్నారు. జిల్లాలో రూ.125.53 కోట్లతో 34 చెక్‌డ్యామ్‌ల నిర్మాణ పనులు చేపడుతున్నామన్నారు.

తాగునీటి తండ్లాట లేదు

గతంలో తాగునీటి కోసం ఆడబిడ్డలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపేవారని గుర్తు చేశారు. ఆడబిడ్డల కష్టాలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మిషన్‌ భగీరథ పథకానికి సీఎం కేసీఆర్‌ రూపకల్పన చేశారన్నారు. దీంతో తాగునీటి కోసం తండ్లాట తప్పిందని అన్నారు. జిల్లాలో 611 ఆవాసాలలో రూ.221.69 కోట్లతో 1,29,847 ఇళ్లకు ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని స్పష్టం చేశారు. జిల్లాలో ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నామని, ఈ ఏడాది జిల్లాలో 5800 ఎకరాల్లో సాగు చేయాలని లక్ష్యాన్ని విధించుకోగా ఇప్పటి వరకు 4925 ఎకరాల్లో సాగు చేయించామని తెలిపారు. మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.9 కోట్ల విలువైన చేప, రొయ్య పిల్లలను అందించామన్నారు. గొర్లకాపరులకు చేయూత అందించేందుకు జిల్లాలో మొదటి విడతలో 16,275 మందికి, రెండో విడతలో 171 మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేశామన్నారు. వైద్యరంగంలో రాష్ట్రం ఎంతో పురోభివృద్ధి సాధించిందని ఆయన అన్నారు. ఒకవైపు ఆరోగ్య తెలంగాణ, మరోవైపు వైద్య విద్యను జిల్లాకు ప్రభుత్వం చేరువ చేస్తోందన్నారు. జిల్లాలో 83 ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంతభవనాలు మంజూరు కాగా 6 ఉప కేంద్రాల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. చంపక్‌హిల్స్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో 24 గంటల్లోనే 35 డెలివరీలు చేసి రికార్డు సాధించామని చెప్పారు. తెలంగాణ డయాగ్నసిస్‌ సెంటర్‌ ద్వారా ఇప్పటివరకు 99,457 మందికి 3.3 లక్షల రకాల రక్త, మూత్ర పరీక్షలు చేశామన్నారు. జనగామకు మెడికల్‌ కాలేజీని మంజూరు చేయించి 115 మంది డాక్టర్లను కేటాయించిన సీఎం కేసీఆర్‌కు జిల్లా ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచే మెడికల్‌ కాలేజీ తరగతులు ప్రారంభం కానున్నాయన్నారు.

పల్లె ప్రగతితో అభివృద్ధి

రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ పల్లెల రూపు రేఖలు మారిపోయాయని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా అభివృద్ధి జరిగి పల్లెలకు అనేక అవార్డులు వచ్చాయన్నారు. జిల్లాలో 281 గ్రామపంచాయతీలో రూ.19.43 కోట్లతో మౌలిక వసతులు కల్పించామన్నారు. దీంతో పాటు 2021-23 సంవత్సరానికి గానూ రూ.196.14 కోట్లు విడుదల చేశామని తెలిపారు. జిల్లాలో 76 గ్రామాల్లో కొత్త పంచాయతీ భవనాల నిర్మాణానికి అనుమతులు ఇచ్చామని అన్నారు. జిల్లాలోని నెల్లుట్ల గ్రామపంచాయతీకి నీటి సమృద్ధి విభాగంలో జాతీయ స్థాయిలో అవార్డు వచ్చిందని, ఇది జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. జిల్లాల్లో ఆసరా కింద ఇప్పటి వరకు 1,41,213 మందికి రూ.1922.55 కోట్లు అందించామన్నారు. 567 మంది మహిళా సంఘాల సభ్యులకు జిల్లాలో రూ.3.66 కోట్లతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాట్ల చేశామన్నారు. మహిళల స్వావలంభన కోసం బ్యాంకు లింకేజీ కింద రూ.1828.21 కోట్లు, స్త్రీనిధి కింద రూ.388.45 కోట్ల రుణాలను అందించామన్నారు.

పట్టణ ప్రగతి నిధులతో జనగామ మునిసిపాలిటీ పరిధిలో రూ.10 కోట్లతో వరద కాలువలు, శ్మశానవాటికల అభివృద్ధి, రూ.30 కోట్ల టీయూఎ్‌ఫఐడీసీ నిధులతో పట్టణ సుందరీకరణ పనులు చేపట్టామన్నారు. జిల్లాలో రూ.150.50 కోట్లతో 37 చోట్ల రోడ్లు, వంతెనల నిర్మాణం కోసం అనుమతి రాగా వీటిలో 25 చోట్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు.

దళితబంధు కింద జిల్లాలో మొదటి విడతలో 185 యూనిట్లను పంపిణీ చేయగా రెండో విడతలో 3300 యూనిట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ పార్కు మంజూరు అయిందని, దీని పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుకెళ్లడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.

వేడుకల్లో జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్‌ సీహెచ్‌.శివలింగయ్య, డీసీపీ సీతారాం, అదనపు కలెక్టర్‌ రోహిత్‌ సింగ్‌, జనగామ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎడవెళ్లి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-08-16T00:05:11+05:30 IST