Share News

‘మినీ’ కేంద్రాలకు మహర్దశ

ABN , Publish Date - Dec 30 , 2023 | 11:58 PM

పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు నూతన ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మినీ అంగన్‌వాడి కేంద్రాల ఉన్నతీకరణ (అప్‌గ్రేడ్‌)కు శ్రీకారం చుడుతూ ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని 39 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఇక ప్రధాన సెంటర్లుగా మారనున్నాయి.

‘మినీ’ కేంద్రాలకు మహర్దశ
బచ్చన్నపేట మండలం పడమటి కేశవాపూర్‌ కేంద్రంలో పిల్లలకు పాఠాలు చెబుతున్న టీచర్‌

అంగన్‌వాడి కేంద్రాల ఉన్నతీకరణకు శ్రీకారం

ఉత్తర్వులు జారీ చేసిన నూతన సర్కార్‌

అప్‌గ్రేడ్‌ కానున్న 39 కేంద్రాలు

జిల్లాలో 18 టీచర్‌, 30 ఆయా పోస్టులు ఖాళీ

భర్తీ చేసేందుకు అధికారుల కసరత్తు

గర్భిణులు, బాలింతలకు మెరుగుపడనున్న సేవలు

జఫర్‌గడ్‌, డిసెంబరు 30 : పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు నూతన ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మినీ అంగన్‌వాడి కేంద్రాల ఉన్నతీకరణ (అప్‌గ్రేడ్‌)కు శ్రీకారం చుడుతూ ఉత్వర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలోని 39 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఇక ప్రధాన సెంటర్లుగా మారనున్నాయి. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ప్రయో జనం చేకూరనుంది. మినీ సెంటర్లలో పని చేస్తున్న టీచర్లకు వేతనం పెరగడంతో పాటు ఈ కేంద్రాల్లో ఆయాలను సైతం నియమించను న్నారు. అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న టీచర్‌, ఆయా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల సాకారం కానుండడంతో కేంద్రాల టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నారుల ఎదుగుదలలో అంగన్‌వాడీలు దోహదం..

చిన్నారుల ఎదుగుదల అంగన్‌వాడీ కేంద్రాల్లోనే మొదలవుతోంది. అక్కడ పరిసరాలు, పరిశుభ్రత, పౌష్ఠికాహారం, ఇతర సౌకర్యాలు కల్పించి పిల్లల మాన సిక ఎదుగుదలకు ఈ కేంద్రాలు దోహదప డుతున్నాయి. చిన్నారులకు పోషకాహారం అందించడంతో పాటు ఆట పాటలతో విద్యనందిస్తూ వారు పాఠశాలలకు ఆకర్షి తులయ్యేలా చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు తగు పౌష్ఠికాహారం అంది స్తూ ఆరోగ్య సలహాలు, సూచనలు చేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన ఒక్కో గ్రామంలో ఒకటి నుంచి 4 వరకు ప్రధాన, మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటి ద్వారా గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్ఠికాహారంతో పాటు చిన్నారులకు ఆట పాటలతో పూర్వ ప్రాథమిక విద్యను అందిస్తున్నారు.

జిల్లాలో 695 అంగన్‌వాడీ కేంద్రాలు...

జిల్లాలో మూడు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉండగా, వీటి పరిధిలో 656 అంగన్‌వాడీ కేంద్రాలు, 39 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 220 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా, 198 కేంద్రాలు అద్దె భవనాల్లో నూ, మిగతా 277 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. మొత్తం కేంద్రాల్లో 3-6 ఏళ్ల పిల్లలు 13,607 మంది, ప్రీ స్కూల్‌ పిల్లలు 9,581 మంది, గర్భిణులు 2,958 మంది, బాలింతలు 2,896 మంది ఉన్నారు.

కేంద్రాన్ని మూసివేయాల్సిన పరిస్థితి...

మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇప్పటి వరకు కేవలం ఒక టీచర్‌ మాత్రమే ఉండడంతో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహా రం అందించడాని కే సమయం సరిపోతోంది. పిల్లలతో ఎక్కువ సమయం గడిపే అవకా శం రావడం లేదు. ప్రభుత్వం చేపట్టే వివిధ సర్వేలు, కార్యక్ర మాల్లో పాల్గొనాలంటే కేంద్రాన్ని మూసి వేయాల్సిన పరిస్థితి. అలాగే కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగు నీటి వసతి వంటి తగు సౌకర్యాలు లేక చిన్నారు లు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయాలు లేకపోవడంతో టీచర్లే వంట చేయడం, పిల్లలకు విద్యాబు ద్ధులు నేర్పడం, ఇంటి నుంచి పిల్లలను తీసుకురావడం, రికార్డులు రాయడం, తదితర పనులు చేస్తున్నారు. ప్రధాన కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్ల మాదిరిగానే మిగతా విధులు నిర్వహిస్తున్నప్పటికీ వేతనంలో వ్యత్యాసం ఉంది.

తీరనున్న ఇబ్బందులు.. కలిగే ప్రయోజనాలు...

మినీ అంగన్‌వాడీ కేంద్రాల ఉన్నతీకరణ తో ఇబ్బందులు తొలగనున్నాయి. ప్రధానం గా ఆయా పోస్టులు భర్తీ కానుండడంతో వంట చేయడం, తదితర వాటి నుంచి ఉపశమనం కలుగనుంది. నూతనంగా సౌకర్యాల కల్పన, పిల్లలకు ఆట పాటలతో విద్యా బోధన మెరగవడంతో పాటు ఆయా పోస్టులు భర్తీ చేసే అవకాశఽం ఉంటుంది. అంగన్‌వాడీ ప్రధాన కేంద్రాల్లో పని చేసే టీచర్లకు ప్రస్తుతం రూ.13,650ల వేతనం వస్తుండగా, మినీ కేంద్రాల టీచర్లకు కేవలం రూ.7,800లు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మినీ అంగన్‌వాడీ టీచర్లకు కూడా నెలకు రూ.13,650లు వేతనం చెల్లించనున్నారు. ఈ కేంద్రాల్లో ఆయా పోస్టులు సైతం భర్తీ చేయనుండడంతో వారికి పని భారం తగ్గనుంది.

పూర్వ ప్రాథమిక విద్య పటిష్టం..

- జెట్టి జయంతి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి, జనగామ

ప్రభుత్వ నిర్ణయంతో మినీ అంగన్‌వాడీ కేంద్రా లు ఇక ప్రధాన సెంటర్లుగా మారనున్నాయి. తత్ఫలితంగా కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్య మరింత పటిష్టవంతం కానుంది. జిల్లాలో మొత్తం 695 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, ఇందులో 656 ప్రధాన, 39 మినీ సెంటర్లు ఉన్నా యి. జిల్లా వ్యాప్తంగా మూడు ప్రాజెక్టుల పరిధిలో 18 అంగన్‌వాడీ టీచ ర్లు, 30 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మినీ సెంటర్లలో నూతనం గా ఆయా పోస్టులు, టీచర్‌ పోస్టులు మంజూరవడంతో పాటు అవస రం ఉన్న చోట సొంత భవనాలు మంజూరయ్యే అవకాశం ఉంది. జిల్లా లో ఖాళీగా ఉన్న టీచర్లు, ఆయా పోస్టులు జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో త్వరలో భర్తీ కానున్నాయి. ఇందుకు గాను ప్రక్రియ కొనసాగుతోంది.

Updated Date - Dec 30 , 2023 | 11:58 PM