చెరువులకు దెబ్బ
ABN , First Publish Date - 2023-07-31T00:23:47+05:30 IST
భారీ వర్షా లు జిల్లాలోని చెరువులను తీవ్రంగా దెబ్బతీశాయి. పది రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పెద్దఎత్తున వచ్చిన వరదలు చెరువులపై పంజా విసిరా యి.
భారీ వర్షాలతో తీవ్ర నష్టం
జిల్లాలో 11 చెరువులకు గండ్లు
మరో 41 పాక్షికంగా ధ్వంసం
మొత్తంగా రూ.1.90కోట్ల నష్టం
సర్వే చేస్తున్న నీటిపారుదల శాఖ అధికారులు
మరమ్మతులు చేసేందుకు సమాయత్తం
హనుమకొండ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): భారీ వర్షా లు జిల్లాలోని చెరువులను తీవ్రంగా దెబ్బతీశాయి. పది రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పెద్దఎత్తున వచ్చిన వరదలు చెరువులపై పంజా విసిరా యి. ఆ దాటికి చెరువులన్నీ కుదేలయ్యాయి. పలు చెరువులకు గండ్లు పడి నీరంతా వృథాగా బయటకు వెళ్లింది. ఉధృతంగా ప్రవహించిన వరదకు అనేక చెరు వుల మత్తళ్లు దెబ్బతిన్నాయి. కొన్ని చెరువుల తూములు కొట్టుకు పోయాయి. చెరువు కట్టలు కోతకు గురై బలహీన పడ్డాయి. జిల్లాలో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరగనిరీతిలో కురిసిన వర్షాలు రైతులకు చివరకు కన్నీళ్ల ను మిగిల్చాయి. వర్షాలతో చెరువులు పూర్తిగా నిండినం దుకు అన్నదాతలు ఒక పక్క ఆనంద పడుతున్నా.. మరో పక్క చెరువులు తెగి వరదనీరు పొలాలను ముంచే సినందుకు ఆందోళన చెందుతున్నాడు.
రూ.1.90కోట్ల నష్టం
జిల్లాలో చెరువులకు జరిగిన నష్టాన్ని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు తగ్గడం తో రెండు రోజులుగా చెరువులను ప్రత్యక్షంగా సందర్శించి క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలిస్తున్నారు. ఏ చెరువు ఎంత మేరకు దెబ్బతిన్నది, ఎక్కడెక్కడ గండ్లు పడింది, కట్టలు ఎంత వరకు బలహీన పడింది, తూముల పరిస్థితి ఎలా ఉంది పరిశీలిస్తున్నారు. వారం రోజుల్లో సర్వేను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించనున్నారు. తాత్కాలిక అంచనాల ప్రకారం జిల్లాలో చెరువులకు రూ.1.90కోట్ల నష్టం వాటిల్లినట్లు నీటిపారుదల శాఖ అధి కారులు తెలిపారు. పూర్తిస్థాయి సర్వే తర్వాత ఈ నష్టం అంచనా మరింత పెరిగే అవకాశాలు లేకపోలేద న్నారు.
14 చెరువులకు గండ్లు
జిల్లాలో 922 చిన్న, పెద్ద చెరువులు ఉన్నాయి. భారీవర్షాల వల్ల 14 చెరువులు, కుంటలకు గండ్లు పడ్డాయి. మరో 41 చెరువులు పాక్షికంగా దెబ్బతి న్నాయి. 60కిపైగా చెరువుల మత్తళ్లు ధ్వంసం అయ్యా యి. రెండు చోట్ల మట్టికొట్టుకుపోయి ఎస్‌ఆర్‌ఎస్‌పీ ఇన్స్‌పెక్షన్ పాత్‌లకు గండి పడింది. 880 చెరువులు పూర్తిగా నిండి మత్తళ్లు పోస్తున్నాయి. 4 పెద్ద చెరువులు సగం వరకు నిండాయి. మరో 4 పెద్ద చెరువులోకి సగం వరకే నీళ్లు వచ్చాయి. 9 పెద్ద చెరువులు సగానికన్నా తక్కువగా నిండాయి.
విస్తారంగా కురిసిన వర్షాలకు నడికూడ మండలం లోని చౌటుపర్తి గ్రామంలోని నల్లచెరువు, నడికూడ, నార్లాపూర్‌లలో పెద్ద చెరువులు, వరికోలులో చౌట చెరువు, దాసరి కుంట, నల్లచెరువులకు గండ్లు పడ్డాయి. 700 ఎకరాల ఆయకట్టు కలిగిన శాయంపేట మండలం పెద్దకోడెపాకలోని గుడి చెరువు కోతలకు గురైంది. దామెర మండలంలోని ఊరుగొండలోని పెద్ద చెరువు కట్టకు కోత పడింది. ఐనవోలు మండలంలోని కక్కిరాలపల్లిలోని బంజరు చెరువుకు గండిపడి నీరంతా వృధాగా బయటకు వెళ్లిపోయింది. గర్మిళ్లపల్లిలోని కొంచెం కుంటకు బుంగపడింది. మడికొండలోని కొత్తకుంటకు గండిపడింది. ఈ చెరువు నీరంతా సోమిడి చెరువులో పడడంతో ఆ చెరువు నీరంతా వడ్డెపెల్లి చెరువులో కలవడంతో పరిమిళ కాలనీ, జవహర్ కాలనీ, నయీంనగర్ నాలాలు పొంగి పొర్లు పరిస్థితి బీభత్సంగా మారింది తెలిసిందే. వరద ఉధృతికి జవహర్‌నగర్ నాలాకు గండిపడింది. పరిమళ కాలనీ నాల కల్వర్టుకు కోతపడింది. మడికొండలోని మరో రెండు కుంటలు, ఉనికిచెర్లలోని ప్రేంకుంట, పెద్ద పెండ్యాలలోని ముత్యంకుంటలలకు కూడా గండ్లు పడ్డాయి. వర్షాలు ఆగిన తర్వాత వరంగల్‌లోని భద్రకాళి చెరువుకు గండిపడింది. పోతననగర్ సబ్‌స్టేషన్ వెనుక భాగాన చిన్నమత్తడి దగ్గర పడిన ఈ గండి వల్ల చెరువు నీరంతా పలు కాలనీల్లోకి ప్రవేశించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భద్రకాళి చెరువు గండిని తాత్కాలికంగా పూడ్చినప్పటికీ మిగతా చెరువుల గండ్ల పూడ్చి వేత పనులను నీటిపారుదల శాఖ అధికారులు ఇంకా మొదలు పెట్టలేదు. వరద భీభత్సవం సృష్టించిన కొత్తపేట చెరువు గండిని ఇంకా అలాగే వదిలేశారు. కొన్ని చోట్ల గ్రామస్తులే ముందుకు వచ్చి చెరువు గండ్లను పూడ్చుకుంటున్నారు. నడికూడ మండల కేంద్రంలోని పెద్ద చెరువుకు పడిన బుంగను సర్పంచ్ రవీందర్ రావు దగ్గరుండి పూడ్పిస్తున్నారు.