27న వేలేరుకు కేటీఆర్‌ రాక

ABN , First Publish Date - 2023-02-23T00:30:58+05:30 IST

ఈనెల 27న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె.తారక రామారావు హనుమకొండ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని వేలేరుకు రానున్నారు. వేలేరు, ధర్మసాగర్‌ మండలాల్లోని కరువు పీడిత, ఎత్తైన గ్రామాలకు సాగునీరందించడం కోసం రూ.133కోట్ల వ్యయంతో చేపట్టనున్న నీటిపారుదల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఈ పర్యటన విజయవంతం చేయడానికి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

27న వేలేరుకు కేటీఆర్‌ రాక
కేటీఆర్‌ పర్యటనపై సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి దయాకర్‌ రావు

రూ.133కోట్ల నీటిపారుదల ప్రాజెక్టుకు శంకుస్థాపన

భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

సమన్వయకర్తలుగా కడియం, పల్లా, తాటికొండ

హనుమకొండ టౌన్‌, ఫిబ్రవరి 22: ఈనెల 27న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె.తారక రామారావు హనుమకొండ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలోని వేలేరుకు రానున్నారు. వేలేరు, ధర్మసాగర్‌ మండలాల్లోని కరువు పీడిత, ఎత్తైన గ్రామాలకు సాగునీరందించడం కోసం రూ.133కోట్ల వ్యయంతో చేపట్టనున్న నీటిపారుదల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. ఈ పర్యటన విజయవంతం చేయడానికి రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రాజయ్య, కుడా చైర్మన్‌ సుందర్‌రాజ్‌ యాదవ్‌, జడ్పీ చైర్మన్లు, సంపత్‌రెడ్డి, సుధీర్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ పర్యటన విజయవంతానికి పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని కోరారు. కేటీఆర్‌ పర్యటనలో భాగంగా శంకుస్థాపన ప్రదేశం, బహిరంగ సభకు భారీగా జనసమీకరణకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్బంగా మండలాలవారిగా ఇన్‌చార్జిలను నియమించారు. జఫర్‌గడ్‌కు డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్‌కు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, రఘునాథపల్లికి రుణ విమోచన కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, లింగాలఘణపురానికి ఆర్‌అండ్‌బీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ మెట్టు శ్రీనివాస్‌, ధర్మసాగర్‌కు కుడా చైర్మన్‌ సుందర్‌రాజ్‌ యాదవ్‌, వేలేరుకు దివ్యాంగుల సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, చిలుపూరుకు జనగామ జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌ రెడ్డి, భీమదేవరపల్లికి హనుమకొండ జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌ను ఇన్‌చార్జిలుగా నియమించారు. కాగా, కార్యక్రమ సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ టి.రాజయ్యలు వ్యవహరిస్తారు.

Updated Date - 2023-02-23T00:30:59+05:30 IST