వైభవంగా హేమాచలుడి ‘సదస్యం’

ABN , First Publish Date - 2023-05-08T00:19:44+05:30 IST

మల్లూరు హేమాచలకొండలపై వెలిసియున్న ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఏడురోజులుగా వైభవంగా జరుగుతున్నాయి.

వైభవంగా హేమాచలుడి ‘సదస్యం’
ఉత్సవమూర్తులకు సదస్యం నిర్వహిస్తున్న అర్చకులు

మల్లూరులో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

మంగపేట, మే 7: మల్లూరు హేమాచలకొండలపై వెలిసియున్న ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఏడురోజులుగా వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం ప్రధానం వేదాశీర్వచనం (సదయ్యం) కార్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. సాయంత్రం నుంచి రాత్రి 9 గంటల వరకు ఉత్సవమూర్తులకు యాగశాలలో శాంతిహోమాలు జరిగాయి. భద్రాచలం సీతారామాచంద్రస్వామి ఆలయ ప్రధానార్చకులు అమరవాది మురళీ కృష్ణామాచార్యులు ఆధ్వర్యంలో పురోహితులు పెరుంభుదూరు మదన్‌మోహనా చార్యులు, పవన్‌కుమారాచార్యులు, రామనర్సింహాచార్యులు, వెంకటాచార్యులు, భరధ్వాజాచార్యులు నిర్వహించారు. త్సవమూర్తులను పట్టువస్త్రాలతో అలంకరించి పూజా ఇత్యాధి కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం విగ్రహాలను యాగశాల నుంచి ఆలయ ప్రాంగణంలో కల్యాణ మంటపం వద్దకు సన్నాయి, వాయిద్యాలు, మంత్రచ్ఛరణల నడుమ తీసుకొచ్చి అధిరోహించారు. వేదమూర్తులకు భక్తుల ఆనందోత్సవాల మధ్య వేదాశీర్వచనం(సదస్యం), ఉంజల్‌సేవ, లక్ష్మీహయగ్రీవ స్ర్తోత్రపారాయణ హవనం ధర్మశాస్త్ర ప్రకారంగా పురోహితులు నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉప దేవాలయమైన శ్రీరమ సత్యనారాయణస్వామి మూలవిరాట్‌కు భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి పురోహితులు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు దర్శనాలు గావించి మహానివేదనను సమర్పించారు. భక్తులు ఈ సందర్భంగా చింతామణి జలధారల వద్ద పుణ్య స్నానాలు ఆచరించి జలాంజనేయస్వామిని, పంచా ముఖాంజనేయా స్వామి, వేణుగోపాల స్వామిని, శ్రీరమ సత్యనారాయణస్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపై వెలిసియున్న ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి దేవతలను దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు కైంకైర్యం రాఘావాచార్యులు, ముక్కమల్ల రాజశేఖరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు పవన్‌కుమారాచార్యులు, వెంకటనారాయణశర్మ, ఈశ్వర్‌చంద్‌శర్మ, రాజీవ్‌నాగశర్మ మూల విరాట్‌కు తిలా, తైలాభిషేకాలు నిర్వహించి, పట్టువస్త్రాలు, గజమాలతో సుందరంగా అలంకరించి భక్తులక దర్శనాలు గావించారు. సుమారు 15 వేల మంది భక్తులు దైవదర్శనాలను చేసుకున్నారని దేవస్థానం చైర్మన్‌ నూతలకంటి ముకుందం, ఆలయ ఈ.వో శ్రవణం సత్యనారాయణ తెలిపారు.

మేడ్చల్‌ కలెక్టర్‌ అన్నదానం

భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో మధ్యాహ్నం ద్వైతమాతకు వెనుక భాగంలో వారికి వారం రోజులుగా నిత్య అన్నదాన కార్యక్రమం దాతల సహకారంతో కొనసాగుతోంది. ఆదివారం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మేడ్చల్‌ కలెక్టర్‌ దుగ్యాల అమయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో వలంటీర్లు యర్రా శ్రీదర్‌బాబు, అల్లె జనార్దన్‌, పూజరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-08T00:19:44+05:30 IST