Janakipuram Sarpanch Navya: కూతురులాంటి దానినన్నా వేధింపులు ఆపలే

ABN , First Publish Date - 2023-03-11T03:35:32+05:30 IST

‘అవును.. మా ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య నన్ను లైంగికంగా వే ధించాడు.

Janakipuram Sarpanch Navya: కూతురులాంటి దానినన్నా  వేధింపులు ఆపలే

ఎమ్మెల్యే రాజయ్య లైంగికంగా వేధించాడు

నన్ను చూసే టికెట్‌ ఇచ్చానన్నాడు

ఒంటరిగా వస్తేనే ఏ పనైనా చేస్తానన్నాడు

మహిళల భుజాల మీద చేతులేస్తాడు

ఎక్కడెక్కడో తాకడానికి ప్రయత్నిస్తాడు

చెప్పలేక ఇబ్బంది పడుతున్న వారెందరో

జానకిపురం సర్పంచ్‌ నవ్య ఆవేదన

రాజయ్యపై తప్పుడు ప్రచారాన్ని సహించం

బీఆర్‌ఎస్‌ మహిళా నేతల ఆగ్రహం

నాపై రాజకీయ కుట్రలు: రాజయ్య

రాజయ్యను పదవి నుంచి తొలగించండి

గవర్నర్‌ తమిళిసైకి బక్క జడ్సన్‌ విజ్ఞప్తి

జానకిపురం సర్పంచ్‌ నవ్య ఆవేదన.. ఆగ్రహం

ఓరుగల్లు, ధర్మసాగర్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ‘అవును.. మా ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య నన్ను లైంగికంగా వే ధించాడు. మీరు తండ్రిలాంటి వారు. నేను కూతురులాంటి దానినని వేడుకున్నా వేధింపులు మానలేదు’.. అని హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం జానకిపురం సర్పంచ్‌ నవ్య స్పష్టం చేశారు. ‘ఎమ్మెల్యేకు నువ్వంటే ఇష్టం’ శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు కారణమైంది. దీంతో నవ్య మరోసారి మీడియాతో మాట్లాడారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధించింది నిజమేనని చెప్పారు. ‘‘నీకు సర్పంచ్‌ టికెట్‌ నీ భర్తను చూసి కాదు.. నిన్ను చూసి, నీ మీద కోరికతో, ఆశతో మాత్రమే ఇచ్చా. నాకు సహకరించకపోతే గ్రామ అభివృద్ధికి ఏమాత్రం సహకరించను. గ్రామ ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించే విధంగా చేస్తా’’ అని ఎమ్మెల్యే బెదిరించేవారని నవ్య తెలిపారు. ఆయన మాటలను నిరాకరించినందుకుగాను.. గ్రామ అభివృద్ధికి సహకరించక పోగా గ్రామంలో గ్రూపులు ఏర్పాటు చేసి తమకు విలువ లేకుండా చేశారని ఆమె ఆరోపించారు.

‘‘ఎమ్మెల్యే రాజయ్య మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది. ఆయన మహిళలను తాకకుండా మాట్లాడలేక పోతాడు. భుజాల మీద చేతులు వేస్తాడు. కౌగిలించుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఎక్కడెక్కడో తాకడానికి ప్రయత్నిస్తాడు. ఎంతో మంది మహిళలు మానసికంగా ఇబ్బందిపడుతూ బయటకు చెప్పలేక పోతున్నారు. ఇలాంటివన్నీ భరించడానికి నేను సిద్ధంగా లేకపోవడంతో ఇబ్బందులు సృష్టించడం మొదలుపెట్టాడు. మహిళలపట్ల ఆయన ప్రవర్తన నియోజకవర్గంలో అందరికీ తెలిసిందే. కొంతమంది మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో మౌనంగా భరిస్తున్నారు. అవకాశం వస్తే వారు కూడా ముందుకు వస్తారు. నేను మాట్లాడే ప్రతీ విషయానికీ నా దగ్గర ఆధారం ఉంది. సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా బయట పెడతాను. ఏ వర్గాలకోసమో నేను ఈ ఆరోపణలు చేయట్లేదు. ఎన్నో రోజుల వేదన ఇది.. నాలాగా మరెవ్వరికీ కాకూడదనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాను’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. జిల్లాలోని ప్రజా సంఘాలు, మహిళా సంఘాల నేతలు, కాంగ్రెస్‌ మహిళా నేతలు సర్పంచ్‌ నవ్యను కలిసి సంఘీభావం ప్రకటించారు. ఆమెకు ఎలాంటి సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని మాజీ మేయర్‌ ఎర్రబెల్లి స్వర్ణ, కాంగ్రెస్‌ నేత ఇందిర ధైర్యం చెప్పారు.

ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం..

ఎమ్మెల్యే రాజయ్యపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని బీఆర్‌ఎస్‌ మహిళా నాయకులు శ్రీలత, జిల్లా కోఆప్షన్‌ సభ్యు రాలు జుబేదాలాల్‌, మాజీ సర్పంచ్‌ రజిత అన్నారు. ధర్మసాగర్‌లో శుక్రవారం విలేకరులతో వారు మాట్లాడారు. రాజయ్యకు ఐదోసారి పార్టీ టికెట్‌ వస్తుందనే విషయం జీర్ణించుకోలేక.. ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

నాపై రాజకీయ కుట్రలు

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

10.jpg

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : ప్రజల్లో తనకు ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే తనపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. మహిళా సర్పంచి చేసిన ఆరోపణలపై శుక్రవారం తెలంగాణ భవన్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు దగ్గరపడుతుండడంతో గతంలో మాదిరిగా తనను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ కుట్రలను తిప్పికొడతానని, జరిగిన విషయాలన్నిటినీ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళతానని చెప్పారు.

ఎమ్మెల్యే రాజయ్యను బర్తరఫ్‌ చేయాలి

గవర్నర్‌కు బక్క జడ్సన్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌, మార్చి 10(ఆంధ్రజ్యోతి): మహిళా సర్పంచ్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్యను ఆ పదవికి అనర్హుడిగా ప్రకటించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్‌ కోరారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తనతోనే కాకుండా మరికొందరు ప్రజాప్రతినిధుల పట్ల కూడా ఆయన ఇదే విధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ మహిళా సర్పంచ్‌ కన్నీరు పెట్టుకున్నారని గవర్నర్‌ దృష్టికి తెచ్చారు.

Updated Date - 2023-03-11T07:41:11+05:30 IST