నిఘా ఏదీ..?!

ABN , First Publish Date - 2023-07-24T23:13:23+05:30 IST

రైతన్నలు మోసాల బారిన పడక తప్పడం లేదు. విత్తనాలు, ఎరువుల పేరుతో భూపాలపల్లి జిల్లాలోని కొందరు వ్యాపారులు వారిని నట్టేట ముంచేస్తున్నారు.

నిఘా ఏదీ..?!

విత్తనాలు, ఎరువుల విక్రయాలపై దృష్టిపెట్టని అధికారులు

అక్రమాలకు పాల్పడుతున్న పలువురు వ్యాపారులు

రైతులను మోసగిస్తున్నా పట్టించుకోని వైనం

నట్టేట ముంచుతున్నా స్పందన కరువు

కృష్ణకాలనీ, (భూపాలపల్లి), జూలై 24: రైతన్నలు మోసాల బారిన పడక తప్పడం లేదు. విత్తనాలు, ఎరువుల పేరుతో భూపాలపల్లి జిల్లాలోని కొందరు వ్యాపారులు వారిని నట్టేట ముంచేస్తున్నారు. నాసిరకం సరుకులు ఇవ్వడం ఒకవైపు అయితే.. ఉద్దెర సాకుతో అధిక డబ్బులు వసూలు చేస్తూ దోచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాలం చెల్లిన విత్తనాలు, నిషేధిత మందులు, ఎరువులను కొందరు వ్యాపారులు రహస్య ప్రదేశాల్లో స్టోర్‌ చేసి అమాయక రైతులకు అంటగడుతున్నా నిఘా పెట్టే వారు కరువయ్యారు.

ఉద్దెర సాకుతో ఎర..

రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కొందరు ఆర్గనైజర్లు అందిన కాడికి దండుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పంటల సాగు సమయంలో ఉద్దెర పేరుతో రైతులకు ఎర వేసి ఎరువులను అంటగడుతునట్టు ఆరోపణలు ఉన్నాయి. పంట చేతికి వచ్చాక రెండు, మూడింతల డబ్బులు దండుకుంటున్నారని తెలిసింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాల్లో ఆర్గనైజర్లు ఎలాంటి అనుమతులు లేకుండా ఎరువులు విక్రయిస్తూ రైతుల నుంచి అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎరువులను నగదుకు ఒక రేటు.. ఉద్దెరకు ఒక రేటు నిర్ణయించి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం వ్యవసాయ శాఖ మండల అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్టు వ్యవహరిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక జిల్లా స్థాయి అధికారులు ఫర్టిలైజర్‌ దుకాణాల్లో తనిఖీలను మరచారని తెలుస్తోంది. అలాంటప్పుడు ఆర్గనైజర్లపై దృష్టి ఏం పెడతారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఉత్తుత్తి నిబంధనలు

జిల్లా వ్యాప్తంగా 260 ఫెర్టిలైజర్‌ షాపులు ఉన్నాయి. వీటిలో అత్యధిక దుకాణాల్లో నిబంధనలు పేరుకు మాత్రమే అన్నట్టు ఉన్నాయి. అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిసున్నా వ్యాపారుల్లో మార్పు కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. షాపుల్లో కచ్చితంగా ఎరువుల ధరల పట్టికను ప్రదర్శించాలనే నిబంధన ఉన్న నేపథ్యంలో దాన్ని పాటిస్తున్నట్లే చూపుతూ ఏదో ఒక సాకుతో రైతుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే రైతులు కొన్న ప్రతి ఎరువు బస్తాకూ, విత్తనాలకు రశీదు ఇవ్వాల్సి ఉండగా దాని దాఖలాలు లేవనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది వ్యాపారులు తెల్లకాగితంపై రాసిచ్చి దాన్నే రశీదుగా పేర్కొంటున్నారని రైతులు అంటున్నారు.

చోద్యం చూస్తున్న అధికారులు

ఎరువుల వ్యాపారులు నిలువు దోపిడీ చేస్తున్నా వ్యవసాయ శాఖ, టాస్క్‌ఫోర్స్‌, సీసీఎస్‌ అధికారులు దృష్టి పెట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎన్ని అక్రమాలు జరుగుతున్నా తనిఖీలు చేయడం లేదని అంటున్నారు. ఎరువులకు కొరత లేదని, జిల్లాలో సమృద్ధిగా నిల్వలు ఉన్నాయని, అన్ని రకాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్న అధికారులు బ్లాక్‌ మార్కెట్‌ నిరోధానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

తనిఖీలు ముమ్మరం చేశాం ...

- విజయభాస్కర్‌, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి (భూపాలపల్లి)

జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చే శాం. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేని ఎరువులు విక్రయాలు జరిపినట్లు మా దృష్టికి వస్తే చర్యలు తప్పవు. అలాగే రశీదు లేకుండా విక్రయాలు సాగించినట్లు తేలితే ఆ షాపు నిర్వాహకులపై కేసు నమోదు చేయిస్తాం. గ్రామాల్లో ఆర్గనైజర్లు ఎరువులను అమ్మడానికి వీలు లేదు. అలాంటి వారిపై కఠినంగా వ్యవహరిస్తాం.

Updated Date - 2023-07-24T23:13:23+05:30 IST