ఓంకారం.. సృష్టి సారం..

ABN , First Publish Date - 2023-02-19T00:28:10+05:30 IST

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో మహాశివ రాత్రి వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు.

ఓంకారం.. సృష్టి సారం..

పాలకుర్తి, సిద్ధులగుట్టలో వైభవంగా శివపార్వతుల కల్యాణం

పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి దంపతులు

వేడుకలను చూసేందుకు తరలి వచ్చిన భక్తజనం

ఆలయాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం

జిల్లాలో ఘనంగా శివరాత్రి ఉత్సవాలు

పాలకుర్తి, ఫిబ్రవరి 18: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో మహాశివ రాత్రి వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. శనివా రం రాత్రి శివ పార్వతుల కల్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు. రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణా భివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు ప్రభుత్వం తరుపున పట్టువస్ర్తాలు, తలంబ్రాలను మేళతాళాలతో తీసు కొచ్చారు. పండితులు శానగొండ శివకిరణ్‌, పాలకుర్తి సంతోష్‌శర్మ మంత్రోచ్ఛారణల మధ్య వాటిని స్వామి వారికి సమర్పించారు. ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపం భక్తి పారవశ్యంతో నిండిపోయింది. కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న 150 మంది దంపతులకు ఆలయ సిబ్బంది కంకణాలు పంపిణీ చేశారు. సుమారు రెండు గంటల పాటు నిర్వహించిన కల్యాణ తంతును తనివితీరా వీక్షించేందుకు వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, కలెక్టర్‌ శివలింగయ్య దంపతులు, జనగామ డీసీపీ సీతారం దంపతులు, అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయి దంపతులు, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ తక్కెళ్లపల్ల్లి నారాయణరావు, ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, పసునూరి నవీన్‌, సర్పంచు వీరమనేని యాకాంతరావు, ఆలయ చైర్మన్‌ రాంచంద్రయ్య శర్మ, ఈవో రజనీకుమారి, ధర్మకర్తలు చిదురాల ఽసంఽధ్యారాణి, నర్సింహరెడ్డి, యాకూబ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గాయకులు మధుప్రియ, కనకవ్వల పాటలు భక్తులను అలరించాయి. దేవస్థానం అధికారులు భక్తుల సౌకర్యార్థం సంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

సిద్ధులగుట్టకు పోటెత్తిన భక్తులు

బచ్చన్నపేట: సుప్రసిద్ధ శైవక్షేత్రం కొడవటూరు సిద్ధులగుట్టలో శనివారం రాత్రి శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఆహా ఏమి.. ఈ భాగ్యమంటూ వేడుకలు చూసి తరిస్తూ, తన్మయత్వంలో ఊగిపోయారు. కల్యాణం కోసం మండపం వెనుక భాగంలో 90 ఫీట్ల వెడల్పుతో భారీ సెట్టింగ్‌ వేశారు. కళ్లు మిరుమిట్లు గొలిపేలా వేసిన లైటింగ్‌, పచ్చని తోరణాల మధ్య కల్యాణమండపంలో దేవదేవులైన శివపార్వతుల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిపించారు. ఆలయ ప్రధానార్చకుడు ఓంనమఃశివాయ నేతృత్వంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పట్టు వస్త్రాలు, కొడవటూరు సర్పంచ్‌ గంగం సతీ్‌షరెడ్డి, ఈవో చిందం వంశీ స్వామి వారి ఉత్సవ విగ్రహాలను డప్పుచప్పుళ్లు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు, మహిళా సాంస్కృతిక బృందాల కోలాటాలు, భక్తుల జయజయనాధాల మధ్య ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకువచ్చారు. వందలాదిగా దంపతులు కల్యాణంలో కూర్చోగా వారికి ప్రత్యేక వస్త్రాలు, స్వామివారికి సంబంధించిన పలు వస్తువులు అందించి కంకణధారణ చేశారు. ప్రధాన పూజారి శివపార్వతుల కల్యాణ వేడుకలను అత్యంత వైభవంగా జరిపించారు. కోరిన వరాలిచ్చే కొడవటూరు సిద్ధేశ్వరా.. శరణు శరణు అంటూ ఆలయ పరిసరాలు మారు మోగాయి.

కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ గిరబోయిన భాగ్యలక్ష్మీ అంజయ్య, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్‌, జనగామ కౌన్సిలర్‌ ప్రేమలతారెడ్డి, ఎంపీపీ బావండ్ల నాగజ్యోతి కృష్ణంరాజు, ఎంపీటీసీలు దూడల కనకయ్యగౌడ్‌, నీలం శైలజ రమేశ్‌తో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ఆలయ అర్చకులతో పాటు పలు వేద పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-19T00:28:12+05:30 IST