అక్రమార్కుల్లో గుబులు

ABN , First Publish Date - 2023-01-07T00:10:39+05:30 IST

పోలీసు శాఖలో ప్రక్షాళన మొదలైంది. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కొత్త పోలీసు కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌ తనదైన శైలిలో చర్యలకు ఉపక్రమిస్తుండటం ఆసక్తిరేపుతోంది.

అక్రమార్కుల్లో గుబులు

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో ప్రక్షాళన చర్యలు షురూ

కొరడా ఝుళిపిస్తున్న సీపీ రంగనాథ్‌

హద్దులు మీరుతున్న పోలీసులపై వేటు

వరుస సస్పెన్షన్లతో అవినీతి అధికారుల్లో కలకలం

ప్రతి రోజూ ‘ప్రజావాణి’తో సత్ఫలితాలు

ఫిర్యాదులపై తనదైన సమగ్ర విచారణ

పలువురు అధికారులపై చర్యలకు రంగం సిద్ధం

హనుమకొండ క్రైం, జనవరి 6 : పోలీసు శాఖలో ప్రక్షాళన మొదలైంది. అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కొత్త పోలీసు కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌ తనదైన శైలిలో చర్యలకు ఉపక్రమిస్తుండటం ఆసక్తిరేపుతోంది. పోలీసు శాఖలో పని చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై సీపీ తీసుకుంటున్న చర్యలు చర్చనీయాంశంగా మారాయి. సీపీ రంగనాథ్‌ గత డిసెంబరు 3న బాధ్యతలు చేపట్టారు. నెల రోజుల స్వల్ప వ్యవధిలోనే సొంత శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు.

ముందుగా కమిషనరేట్‌ పరిధిలో పోలీసు వాహనాలకు డ్రైవర్లుగా పని చేస్తున్న ప్రైవేటు వ్యక్తులను తొలగించి తన మార్క్‌ చూపించారు. కొందరు పోలీసు అధికారుల వద్ద ప్రైవేటు డ్రైవర్లుగా పాతుకుపోయిన వారి ఆగడాలు అంతా ఇంతా కాదని సీపీకి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరించి కమిషనరేట్‌ పరిధిలో 153 మంది ప్రైవేటు డ్రైవర్లను తొలగించి అవినీతి ప్రక్షాళనకు నాంది పలికారు.

అలాగే గాడితప్పుతున్న పోలీసు అధికారులపై దృష్టి సారించారు. పోలీసుశాఖలో పని చేస్తూ వివాహేతర సం బంధాలు పెట్టుకున్న వారిపై వచ్చిన ఫిర్యాదుల పట్ల ఘా టుగా స్పందించారు. గీసుగొండ ఇన్‌స్పెక్టర్‌ రాయల వెంకటేశ్వర్లు, దామెర ఎస్‌ఐ హరిప్రియపై ఆమె భర్త చేసిన ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి ఇద్దరిపై వేటు వేశారు.

అదే విధంగా సుబేదారి పీఎ్‌సలో లైంగిక వేధింపులకు గురైన మహిళ ఫిర్యాదు చేయగా ఎస్సై పున్నంచందర్‌... నిందితుడికి వత్తాసు పలికి బాధితురాలిని రాజీ పడాలని ఒత్తిడి చేయడంతో అతడిని సస్పెండ్‌ చేశారు. అదే విధం గా కేయూ పీఎస్‌ పరిధిలో కానిస్టేబుల్‌ నిర్లక్ష్యంతో కస్టడీలో ఉన్న దొంగ పారిపోవడంతో మోహన్‌నాయక్‌ అనే పోలీసు కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. కేయూ పీఎస్‌ పరిధిలో ఓ ఎస్‌ఐ పిటిషనర్‌తో తరుచుగా ఫోన్‌లో మా ట్లాడి ఇబ్బంది పెట్టినందుకు అతడిని సీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. అదే విధంగా నర్సంపేట సబ్‌డివిజన్‌ పరిధిలో పని చేస్తున్న మహిళా ఏఎ్‌సఐ నాగరాణి ఇల్లు విక్రయిస్తానని ఇబ్బంది పెట్టిందంటూ ఓ విశ్రాంత ఎస్‌ఐ స్వయంగా సీపీకి ఫిర్యాదు చేశాడు. దీంతో నాగరాణిని కమిషనరేట్‌కు అటాచ్‌ చేసి తర్వాత సస్పెండ్‌ చేశారు.

మరో రిజర్వ్డ్‌ ఇన్‌స్పెక్టర్‌ అక్రమాలు..

తాజాగా సుబేదారి పీఎస్‌ పరిధిలో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ హనుమకొండ సతీ్‌షపై కేసు నమోదు కాగా, 14 రోజుల పాటు కస్టడీకి తరలించారు. నాలుగు రోజుల క్రితం గుంటూరు నుంచి హనుమకొండ నక్కలగుట్టలోని ఓ లాడ్జీలో ముగ్గురు గోల్డ్‌స్టోన్స్‌ వ్యాపారులు దిగారు. వారు చేస్తున్న వ్యాపారం చట్టవ్యతిరేకమని ఆర్‌ఐ సతీష్‌ అక్కడకు వెళ్లి వారిని బెదిరించారు. రూ. 50 వేలు కావాలని డిమాండ్‌ చేయగా ఏటీఎం కార్డు నుంచి రూ. 25 వేలు తీసి ఇచ్చారు. అనంతరం బాధితులు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు పొక్కింది. ఆర్‌ఐ సతీ్‌షపై కేసు నమోదు చేసి శుక్రవారం 14 రోజుల పాటు రిమాండుకు తరలించారు. సతీష్‌ గతంలో ట్రాఫిక్‌ విభాగంలో పని చేస్తున్న సమయంలో అక్రమాలకు పాల్పడడంతో అక్కడి నుంచి తొలగించారు. ఇతనిపై నేడో రేపో సస్పెన్షన్‌ వేటు పడనుంది.

నేరుగా బాధితులతో వాంగ్మూలం..

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌లో గతంలో సీపీలు సోమ, గురువారాల్లో పోలీసు ప్రజావాణి నిర్వహించేవారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకునేవారు. ఇటీవల వరంగల్‌ సీపీగా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్‌ ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రతీ రోజు ప్రజావాణి అన్నట్టుగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి వరకు ఫిర్యాదుదారులు, బాధితులతో మాట్లాడుతున్నారు. ప్రధానంగా భూదందాలు, బెదిరింపులు, రియల్‌ మాఫియాపై ఫిర్యాదులు వస్తున్నట్టు సమాచారం. దీంతో రియల్‌ గ్యాంగులను టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తరలించి పోలీసు మర్యాదలు చేస్తున్నారు. గురువారం మిల్స్‌కాలనీ పీఎస్‌ పరిధిలో ఓ రియల్‌ గ్యాంగ్‌ను సీపీ ఆదేశాలతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు లాఠీలకు పని చెప్పినట్టు తెలిసింది.

సీపీ వద్ద మరికొందరి చిట్టా ?

వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పని చేస్తున్న అవినీతి పోలీసు అధికారుల చిట్టా సీపీ వద్ద ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. నిత్యం రేషన్‌ బియ్యం, సట్టా, వ్యభిచార గృహాలపై దాడి చేసిన ఓ పోలీసు అధికారి అడ్డదారిలో నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్న విషయం సీపీ దృష్టికి వచ్చినట్టు తెలిసింది. వరంగల్‌ సెంట్రల్‌జోన్‌ పరిధిలో భూమాఫియాకు వత్తాసు పలుకుతున్న పోలీసు అధికారిపై రహస్య సమాచార సేకరణ జరుగుతున్నట్టు తెలిసింది. కమిషనరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న పీఎ్‌సలో పని చేస్తున్న కింది స్థాయి పోలీసు అధికారి సమీప లాడ్జీలు, చిన్నపాటి వ్యాపారుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు సీపీకి ఫిర్యాదు అందినట్టు తెలిసింది.

ట్రాఫిక్‌ విభాగంలో పని చేస్తున్న ఓ అధికారి డ్రంకెన్‌ డ్రైవ్‌ సమయం లో ప్రభుత్వ ఉద్యోగులు పట్టుబడితే డబ్బులు దండుకొని వారిని వదిలే స్తున్నట్టు సీపీకి తెలిసింది. అలాగే ఓ మహిళా ఎస్‌ఐ లంచం లేనిదే ఇంటికి వెళ్లదని అమె వద్ద పని చేసే సిబ్బందే బాహాటంగా చెప్పుకొస్తున్నారు. ఆమెపై కూడా చర్యలు తీసుకునే అ వకాశాలున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే మరో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్‌ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలియడంతో అక్రమార్కుల్లో గుబులు మొదలైంది.

దారి తప్పిన మరో పోలీసు అధికారి

రంగురాళ్ల వ్యాపారిని బెదిరించి రూ.25 వేలు వసూలు

అరెస్టు చేసిన సుబేదారి పోలీసులు

ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ హనుమకొండ సతీష్‌ బాగోతం

నయీంనగర్‌ (హనుమకొండ), జనవరి 6: దారి తప్పిన మరో పోలీసు కథ వెలుగులోకి వచ్చింది. చట్ట వ్యతిరేకుల ఆట కట్టించాల్సింది పోయి, చివరకు తానే చట్టాన్ని ఉల్లంఘించి కటకటాల పాలయ్యాడు. రంగురాళ్ల వ్యాపారిని బెదిరించి డబ్బులు దండుకున్న కేసులో ఆర్మ్‌డ్‌ రిజర్వు (ఏఆర్‌) ఇన్‌స్పెక్టర్‌ హనుమకొండ సతీష్‌ తాజాగా కటకటాల పాలయ్యాడు. సుబేదారి సీఐ మహ్మద్‌ అబ్దూల్‌ షూకూర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... వరంగల్‌ ఎల్‌బీ నగర్‌కు చెందిన జబ్బార్‌ అలీ... గుంటూరుకు చెందిన బాలాజీతో కలిసి కొంత కాలంగా రంగురాళ్ల వ్యాపారం చేస్తున్నాడు. జబ్బార్‌ వరంగల్‌లో తనకు తెలిసిన వారికి రంగురాళ్ల అమ్ముతుంటాడు. ఈ క్రమంలో హనుమకొండకు చెందిన కేశవ్‌ అనే వ్యక్తి ఈ నెల 3న రంగురాళ్ల కోసం జబ్బార్‌ను సంప్రదించాడు. సుబేదారిలోని శ్రీరాఘవేంద్ర లాడ్జికి రావాలని జబ్బార్‌ సూచించాడు. దీంతో కేశవ్‌.. లాడ్జికి వచ్చి రేటు మాట్లాడుకొని రంగురాళ్లు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు.

అయితే ఇదే సమయంలో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేస్తున్న ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ హనుమకొండ సతీష్‌ అకస్మాత్తుగా వచ్చి చట్టవిరుద్ద వ్యాపారం చేస్తున్నావని బెదిరించాడు. కేశవ్‌ను లాడ్జి నుంచి బయటకు పంపించి, రంగురాళ్ల వ్యాపారి జబ్బార్‌ను రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అయితే తన వద్ద రూ.25వేలు మాత్రమే ఉన్నాయని చెప్పగా, ఏఆర్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ వాటిని బలవంతంగా తీసుకున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని భయపెట్టి వెళ్లిపోయాడు. అనంతరం జబ్బార్‌ సుబేదారి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు... గురువారం రాత్రి సతీ్‌షను రాంనగర్‌ ప్రాంతంలో అరెస్టు చేశారు. శుక్రవారం కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు సీఐ షూకూర్‌ తెలిపారు.

Updated Date - 2023-01-07T00:10:40+05:30 IST