Warangal: తెలంగాణలో మరో టెన్త్ పేపర్ లీక్?
ABN , First Publish Date - 2023-04-04T12:08:57+05:30 IST
వరంగల్: తెలంగాణలో మరో టెన్త్ పేపర్ లీక్ (Tenth Paper Leak) అయినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. వరంగల్‌లో పేపర్ లీక్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
వరంగల్: తెలంగాణలో మరో టెన్త్ పేపర్ లీక్ (Tenth Paper Leak) అయినట్లు వస్తున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. వరంగల్‌లో పేపర్ లీక్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. వరుసగా రెండో రోజు టెన్త్ హిందీ పేపర్ (Hindi Paper) బయటకు వచ్చినట్లు సమాచారం. మంగళవారం ఉదయం 9-30 గంటలకు హిందీ పేపర్ బయటకు వచ్చి.. వాట్సాప్ గ్రూపు (WhatsApp Group)లో చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. వరుస పేపర్ లీక్ వార్తలతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఇది ఆకతాయిలు చేసిన పనా?.. లేఖ నిజంగా పేపర్ లీక్ అయిందా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం పేపర్ లీక్ అయినట్లు తమకు సమాచారం లేదని చెబుతున్నారు. అంతటా పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న కూడా వికారాబాద్ జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ అయిన విషయం తెలిసిందే.
ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో కుదిపేస్తోంది. ఈ క్రమంలో టెన్త్ పేపర్లు లీక్ అవుతున్నట్లు ప్రచారం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవరిస్తున్నారన్నది నిన్నటి టెన్త్ పేపర్ లీక్ ఘటనతో అర్థమవుతోంది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
కాగా వరుసగా రెండో రోజు పేపర్ లీకేజితో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. వరంగల్ ఘటనపై డిఎస్ఈ (DSE) నుంచి ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. వరంగల్ డిఈవో (DEO), ఎంఈవో (MEO)పై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన సీరియస్ అయ్యారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్లు బయటకు వస్తున్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. వరంగల్ జిల్లా ఘటనపై స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విచారణకు ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారుల ప్రాథమిక సమాచారం ఆధారంగా చర్యలకు పాఠశాల విద్యాశాఖ సిద్దమవుతోంది.