పెంబర్తి.. ఘనకీర్తి
ABN , First Publish Date - 2023-09-26T23:54:20+05:30 IST
హస్తకళల పుట్టినిల్లుగా పేరు గడించిన జనగామ మండలంలోని పెంబర్తి గ్రామం ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకుంది. తాజాగా కేంద్రం ప్రకటించిన బెస్ట్ టూరిజం అవార్డుల్లో చోటు దక్కించుకుని దేశస్థాయిలో ఖ్యాతిని గడించింది.
జాతీయస్థాయిలో మెరిసిన గ్రామం
బెస్ట్ టూరిజం అవార్డుకు ఎంపిక
హస్తకళల పుట్టినిల్లుగా పేరు
నేడు ఢిల్లీలో అవార్డు అందుకోనున్న సర్పంచ్
జనగామ టౌన్, సెప్టెంబరు 26: హస్తకళల పుట్టినిల్లుగా పేరు గడించిన జనగామ మండలంలోని పెంబర్తి గ్రామం ఇప్పటికే ఎన్నో అవార్డులను అందుకుంది. తాజాగా కేంద్రం ప్రకటించిన బెస్ట్ టూరిజం అవార్డుల్లో చోటు దక్కించుకుని దేశస్థాయిలో ఖ్యాతిని గడించింది. వెండి, ఇత్తడి, కంచుతో కళ్లు చెదిరే వస్తువులను తయారుచేసే విశ్వకర్మలు గ్రామానికి ఎన్నో అవార్డులు తీసుకొచ్చారు. వారి కళల నైపుణ్యం ఫలితంగానే జాతీయ స్థాయిలో బెస్ట్ టూరిజం అవార్డు దక్కింది. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం దేశంలోని 31 రాష్ట్రాల్లో మొత్తం 30 గ్రామాలను కేంద్రం టూరిజం అవార్డులకు ఎంపిక చేసింది. అందులో తెలంగాణ నుంచి రెండు గ్రామాలు ఎంపిక కాగా.. అందులో పెంబర్తి చోటు దక్కించుకుంది. ఇక్కడ విశ్వకర్మ కార్మికులు తయారుచేసే కళా రూపాలను కొనేందుకు నిత్యం వేలాది మంది వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ఇక్కడికి వస్తుండడంతో పర్యాటక ప్రాంతంగా కేంద్రం గుర్తించింది. జనగామ జిల్లా నుంచి పెంబర్తి, సిద్దిపేట జిల్లా నుంచి గొల్లబామ చీరలకు ప్రసిద్ధి చెందిన చంద్లాపూర్ గ్రామా న్ని కేంద్రం ఎంపిక చేసింది. ఈ అవార్డులను ఈ నెల 27న (బుధవారం) ప్రదానం చేయనున్నారు. అవార్డును స్వీకరిం చేందుకు సర్పంచ్ అంబాల ఆంజనేయులుకు కేంద్ర పర్యాట క శాఖ అధికారులు ఆహ్వానం పంపించారు. ఈ మేరకు ఆయన ఢిల్లీకి బయలుదేరారు.
విదేశాలకు పెంబర్తి కళాఖండాలు..
పెంబర్తిలో విశ్వకర్మలు తయారుచేసే కళాఖండాల కు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ తయారైన వస్తువులు అనేక దేశాలకు వెళ్తుంటాయి. ఆలయ అలంకార వస్తువులతో పాటు ధ్వజస్తంభాలు, తలుపు డిజైన్లు, దేవిడి రథాల అలంకరణ కళారూపాల తయారీ ఇక్కడి ప్రత్యేకం. ఇత్తడి, రాగి, కంచు, వెండిని ఉపయోగించి నగిషీలు, కిరీటాలు, ఆధ్మాత్మిక సంబంధిత వస్తువులు, షీల్డులు, పతకాలకు సంబంధించిన రూపాలు ప్రాచుర్యం పొందాయి. అమెరికాలో వెంకటేశ్వరస్వామి ఆలయం లో ఇత్తడి ద్వారాలు, ధ్వజ స్తంభాల తయారీకి ఇక్కడి కళారూపాలనే వినియోగించారు. అంతేగాకుండా దుబాయ్‌లోని మక్కా మదీనాకు పెంబర్తి నుంచే మెటీ రియల్ వెళ్లింది. మన రాష్ట్రంలోని యాదాద్రి లక్ష్మీనర్సిం హ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన ఇత్తడి, వెండి తొడుగులు పెంబర్తి హస్త కళాకారులు తయారుచేసిన వే. అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్, సింగపూర్, దుబాయ్ తదితర దేశాలకు నిత్యం ఇక్కడి నుంచి కళారూపాలు వెళ్తుంటాయి.
దేవతల విగ్రహాలు, ఆలయ అలంకరణలే కాకుండా పెంబర్తితో తయారైన గృహ అలంకరణ వస్తువులకూ మంచి ఆదరణ లభిస్తోంది.
హంస, నంది అవార్డులు ఇక్కడే తయారీ..
సినీ నటులకు ఇచ్చే హంస, నంది అవార్డులు సైతం పెంబర్తి విశ్వకర్మ కళాకారుల చేతిలో తయారైనవే. అనేక రంగాల్లో సత్తా చాటిన వారికి ఇచ్చే అవార్డులను తామే తయారుచేస్తామని విశ్వకర్మ కళాకారులు గర్వంగా చెబుతా రు. మరోవైపు పోలీసు శాఖ ఇచ్చే సేవా పతకాలు సైతం ఇక్కడే తయారుచేయిస్తారని వారు చెప్పారు. ఇక్కడ తయార య్యే వాటిలో అవార్డు కళారూపాలతో పాటు పికాకో బెడ్ ల్యామ్ (నెమలి రూపం)కు చాలా డిమాండ్ ఉంటుందని పేర్కొన్నారు.
రైల్లు, బస్సుల హాల్టింగ్ లేక ఇబ్బందులు..
పెంబర్తిలో కళా రూపాలు కొనుగోలు చేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువగా రైళ్లలో వస్తుంటారు. అయితే గతంలో కృష్ణ ఎక్స్‌ప్రెస్, కాకతీయ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడ ఆగడంతో తమకు గిరాకీ బాగా ఉండేదని, ప్రస్తుతం ఆ రైళ్ల హాల్టింగ్ నిలిపివే యడంతో కొందరు కస్ట మర్లు రాలేకపోతున్నారని వి శ్వకర్మ కళాకారులు చెబుతున్నారు. ఈ రైళ్ల సర్వీసులను పునరుద్ధరించాలని కోరుతున్నారు. మరోవైపు 163 జాతీయ రహదారి బైపాస్ రోడ్డు వేసినప్పటి నుంచి పలు బస్సులు జనగామలో ఆగకుండానే వెళ్లిపోతున్నాయని, దీనివల్ల కూడా తమ దగ్గరికి వచ్చే కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ట్రాన్స్‌పోర్టు సౌకర్యంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చొరవ చూపాలని కోరు తున్నారు.
కళాకారులకు ఆహ్వానమేది?
హస్తకళలకు ప్రసిద్ధి అయిన పెంబర్తి గ్రామాన్ని ఉత్తమ పర్యా టక ప్రాంతంగా గుర్తించిన కేంద్రం తమను మాత్రం గుర్తించడం లేదని కళాకారులు వాపోతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని కళలకు జీవం పోస్తున్న తమకు ఆదరణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకా లు ఇవ్వడం లేదంటున్నారు. కళారూపాల వల్ల గ్రామానికి పేరు రాగా.. అవార్డు స్వీకరణకు ఒక్క విశ్వకర్మ కళాకారుడి ని కూడా ఆహ్వానించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు.
అవార్డులు సరే.. పోత్సాహకమేది?
- అయిలా వేదాంతాచారి, విశ్వకర్మ పారిశ్రామిక సహకార సంఘం కార్యదర్శి
విశ్వకర్మ హస్తకళలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ వృత్తిపై ఆధారపడి సుమారు 2 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అనేక కళాఖండాలు తయారుచేసి గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి ఎంతో పేరు తెస్తున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం మాకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. 50 ఏళ్లు దాటిని వారికి నెలకు రూ.5 వేల పింఛన్ ఇవ్వాలి. విశ్వకర్మలకు ఉచితంగా పరికరాలు పంపిణీ చేయాలి.