ఊరంతా మేస్త్రీలే!
ABN , First Publish Date - 2023-02-12T00:35:03+05:30 IST
జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ మారుమూల గ్రామం భవన నిర్మాణ కార్మికుల తయారీకి కార్ఖానాగా విలసిల్లుతోంది.. ఊరు ఊరంతా తాపీ శిల్పులుగా మారి అందమైన భవంతులకు సుందర రూపాలను దిద్దుతున్నారు.. ఆకాశానికి నిచ్చెన మెట్లను ఏర్పాటు చేసినట్లుగా ఎత్తైన హార్మ్యాలను నిర్మిస్తూ తమ పనితనాన్ని ప్రదర్శిస్తున్నారు లింగాలఘణపురం మండలం మంధోనిగూడెం గ్రామస్థులు. గ్రామంలో సుమారు 700 మంది జనాభా ఉంటే 500 మంది భవననిర్మాణ కార్మికులుగా రాణిస్తుండటం విశేషం.
సర్పంచ్ సహా వార్డుమెంబర్లంతా తాపీ కార్మికులే
భవననిర్మాణ రంగంలో రాణిస్తున్న మంధోనిగూడెం
లింగాలఘణపురం, ఫిబ్రవరి 11: లింగాలఘణపురం మండలం మంధోనిగూడెం వాసుల్లో అత్యధికంగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారు నివసిస్తుండటం గమనార్హం. వీరందరూ గతంలో మూడున్నర దశాబ్ధాల క్రితం వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవించేవారు. కాగా గతంలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులు, అనావృష్టి కారణంగా వ్యవసాయంలో పూర్తిగా దెబ్బతిన్నారు. దీంతో ప్రత్యామ్నాయ వృత్తిని ఆలోచించి భవననిర్మాణ కార్మిక రంగంపై దృష్టిపెట్టారు. మొదట రోజువారీ కూలీలుగా పనిచేసి ప్రస్తుతం నైపుణ్యం గల మేస్త్రీలుగా ఎదిగి అందమైన భవంతులకు సుందర రూపాలను అద్దడంలో మేటిగా తయారయ్యారు.
అందెవేసిన చేయి..
ఒకప్పుడు కూలీలుగా పనిచేసిన మంధోనిగూడెం వాసులు ఇప్పుడు భవన నిర్మాణం రంగంలో రాటుదే లారు. సినీరచయిత సుద్దాల అశోక్‌తేజ చెప్పినట్లుగా ‘‘రాయి.. సలాక.. ఇసుక.. ఇటుక.. తాపీ.. తట్ట.. సిమి టీ.. సెమట అన్నీ తానై గోడా మీద గోడ.. మేడమీద.. మేడ కట్టిపోరా కూలోడా’’ అన్నట్లుగా మేడల మీద గోడలు కట్టి పట్టణాలనే నిర్మిస్తున్నారు. ఆకాశమెత్తు న్న కర్రల నిచ్చెనపై నిలబడి ఒంటి చేత్తో సిమెంట్ తట్టను చేతపట్టుకుని పనులు చేస్తున్న తీరు చూసే వారికి భవన నిర్మాణ రంగ కార్మికుల పనితనం సర్కస్ ఫీట్లను తలపిస్తుంది.
ప్రమాదపుటంచుల్లో బతుకుపోరాటం..
మంధోనిగూడెంలోని 700 మంది జనాభాలో పిల్ల లు, వృద్ధులు మినహా మిగతా 500 మంది భవనని ర్మాణ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. జనగామ పట్టణంలో ఇప్పటి వరకు నిర్మించిన భవనాల్లో 50శా తం ఇళ్లు వీరి చేతుల్లో తయారైనవేకావడం గమనా ర్హం. అయితే మంధోనిగూడెం వాసులు నిత్యం ప్రమా దపుటంచుల్లో పనులు చేస్తూ నిత్యం బతుకుపో రాటాన్ని సాగిస్తున్నారు. ఐదారు అం తస్తుల భవనా లకు ప్లాస్టరింగ్ చేయాలన్నా.. పిట్టగోడలు నిర్మించాలన్నా 70 ఫీట్ల ఎత్తులో కర్రల మీద నిటారుగా నిలబడి పనిచేయా ల్సి ఉంటుంది. ఈక్రమంలో ఒక చేత్తో తట్ట..తట్ట నిండా సిమెంట్ కాంక్రీట్, మరో చేత్తో తాపీ పట్టుకుని తాము ఎక్కడ నిల్చున్నామో కూడా మరిచిపోయి ధనాధన్ పనులు చేస్తూ ముందుకు సాగడం ఒక విన్యాసంగా కనబడుతుంది. ఈ విన్యాసంలో పొరపా టునా కాలు జారినా.. కళ్లు తిరిగినా ప్రాణంపోయే ప్రమాదం ఉంటుంది.
కాళ్లు చేతులు అరిగేలా పనులు..
ఇక్కడ పురుషులు మేస్త్రీలుగా ఎదగగా మహిళలు, భవన నిర్మాణరంగంలోకి కొత్తగా ప్రవేశించిన యువ కులు తమ కాళ్లు చేతులు అరిగేలా పనిచేయాల్సి ఉంటుంది. పై అంతస్తుల నిర్మాణానికి అవసరమైన ఇటుక, సిమెంట్, ఇసుకను పైకి మోయడంలో మహి ళలే కీలకంగా పనిచేస్తున్నారు. ప్రతీ రోజు ఐదారు అంతస్తుల్లోకి కిందనుంచి ఇసుక, ఇటుకను పైకి తరలించడం కష్టసాధ్యమైన పని. మోకాళ్లపై అధిక భారం పడి మోకాలి చిప్పలు అరిగిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తాపీకార్మికుల నుంచే పుట్టకొచ్చిన సర్పంచ్..
మంధోనిగూడెం గ్రామం ఇటీవలే నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడగా ఇక్కడ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన బోళ్ల సత్యనారాయణ సైతం తాపీ కార్మికు డు కావడం గమనార్హం. గతంలో ఇక్కడి వాళ్ళంతా మాణిక్యాపురం గ్రామానికి చెందిన వాళ్లకు ఓటు వేసి సర్పంచ్‌లను ఎన్నుకునేవారు. కానీ నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు కాగా తాపీ కార్మికుల నుంచే సత్యనారాయణ అనే కార్మికుడిని సర్పంచ్‌గా ఎన్నుకో వడం విశేషం.
గ్రామపంచాయతీ పాలకవర్గం సైతం..
ఒక్క సర్పంచ్ మాత్రమే కాకుండా గ్రామపంచా యతీ వార్డు సభ్యులు సైతం తాపీ కార్మికులు కావ డం గమనార్హం. మంధోనిగూడెం గ్రామపంచాయ తీలో 8 మంది వార్డు సభ్యులు ఉండగా నలుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వీరిలో ఉపసర్పంచ్ రమేశ్ ఒక్కడు డీసీఎం డ్రైవర్ కాగా మిగతా వారంతా తాపీ కార్మికులే కావడం మంధోనిగూడెం విశేషం.
నేనూ.. తాపీ కార్మికుడినే...
బోళ్ల సత్యనారాయణ- సర్పంచ్, మంధోనిగూడెం
గత నలబై ఏళ్లుగా తాపీ కార్మికుడిగా పనిచేస్తున్నాను. ఈసారి మా ఊరును ప్రభుత్వం ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయడంతో గ్రామస్థులు నన్ను సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. నేనొక్కడినే కాదు మా పంచాయతీలో 8 మంది వార్డు సభ్యులు ఉంటే ఒకరిద్దరు మినహా మిగతా వారంతా తాపీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులే ఉన్నారు. ఇప్పటికీ నేను తాపీ కార్మికుడిగా పనిచేస్తూ కూలీలతో ఇళ్లను నిర్మిస్తున్నాను.