తప్పని అవస్థలు

ABN , First Publish Date - 2023-09-26T00:11:39+05:30 IST

మారుమూల ఏజెన్సీ గ్రామాల వాసులకు తిప్పలు తప్పడం లేదు. రవాణా సౌకర్యం లేక ఆదివాసీలు అవస్థ పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా గర్భిణులు తీవ్ర కష్టాలు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది.

తప్పని అవస్థలు
గర్భిణిని మంచంపై మోసుకొచ్చి అంబులెన్స్‌ ఎక్కిస్తున్న గ్రామస్థులు,

ఆదివాసీ మహిళకు పురిటి నొప్పులు

రహదారి లేక గ్రామానికి చేరుకోని అంబులెన్స్‌

మంచంపై మోసుకెళ్లిన గ్రామస్థులు

ఏటూరునాగారం రూరల్‌, సెప్టెంబరు 25: మారుమూల ఏజెన్సీ గ్రామాల వాసులకు తిప్పలు తప్పడం లేదు. రవాణా సౌకర్యం లేక ఆదివాసీలు అవస్థ పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా గర్భిణులు తీవ్ర కష్టాలు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. రోడ్డు సౌకర్యం లేక గ్రామం వరకు అంబులెన్స్‌ రాక గర్భిణి అవస్థ పడిన సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఆదివారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెను గ్రామస్థులు మూడు కిలోమీటర్ల మేర మంచంపై మోసుకొచ్చి అంబులెన్స్‌ ఎక్కించాల్సి వచ్చింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... ఏటూరునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి గ్రామపంచాయతీ పరిధి రాయబంధం గ్రామంలోని గొత్తికోయ తెగకు చెందిన గర్భిణి మడవ కోసికి ఆదివారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. ఈవిషయంపై కుటుంబ సభ్యులు స్థానిక ఆశా వర్కర్‌కు సమాచారం అందజేశారు. దీంతో ఆమె వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసింది. ఏటూరునాగారం నుంచి బయల్దేరిన అంబులెన్స్‌ గర్భిణి నివసిస్తున్న రాయబంధం గ్రామానికి మూడు కిలో మీటర్ల దూరంలోనే ఆగిపోయిం ది. సుమారు ఏడు కిలో మీటర్లు ప్రయాణించి వచ్చిన ఆ వాహనం రహదారి లేకపోవడంతో అక్కడే ఆగిపోయింది. దీంతో గ్రామస్థులు మంచానికి కర్రలు కట్టి గర్భిణిని అందులో పడుకోబెట్టి మోసుకెళ్లారు. అక్కడి నుంచి ఆమెను అం బులెన్స్‌లో ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ సాధార ణ ప్రసవం కాగా ఆడపిల్లకు ఆ మహిళ జన్మనిచ్చింది. తల్లీబిడ్డల ఆరోగ్యం సురక్షితంగానే ఉందని వైద్యాధికారులు తెలిపారు. సకాలంలో రావడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు.

Updated Date - 2023-09-26T00:11:50+05:30 IST