స్వచ్ఛ సర్వేక్షణ్‌ లక్ష్యంగా గ్రామాలను తీర్చిదిద్దాలి

ABN , First Publish Date - 2023-04-29T00:27:30+05:30 IST

స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌ లక్ష్యంగా గ్రామాలను తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య అన్నారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ లక్ష్యంగా గ్రామాలను తీర్చిదిద్దాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కృష్ణఆదిత్య

పరిశుభ్రత కోసం ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేయాలి

సమీక్షలో కలెక్టర్‌ కృష్ణఆదిత్య

ములుగు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 28: స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌ లక్ష్యంగా గ్రామాలను తీర్చిదిద్దాలని కలెక్టర్‌ ఎస్‌.కృష్ణఆదిత్య అన్నారు. ములుగులోని కలెక్టరేట్‌లో శుక్రవారం అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠితో కలిసి స్వచ్ఛభారత్‌ మిషన్‌ గ్రామీణ్‌ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతీ గ్రామంలో ఉన్న జనాభా ఆధారంగా గ్రామపంచాయతీలో స్వచ్ఛభారత్‌ సర్వేక్షణ్‌ కార్యక్రమాలు నిర్వహించి జూన్‌ 30వ తేదీ వరకు నాణ్యమైన నివేదిక రూపొందించాలని అన్నారు. మే 1 నుంచి జూన్‌ 15 వరకు ప్రతీ గ్రామపంచాయతీలో ఎంపీడీవో, ప్రత్యేక అధికారుల బృందం పర్యటిచాలని సూచించారు. కనిష్ఠ స్థాయిలో వ్యర్థ పదార్థాలు ఉండేటట్లు, కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలతో ముందు వరుసలో ఉన్న గ్రామాల డాక్యుమెంటరీ రూపొందించుకోవాలన్నారు. ప్రతీ గ్రామంలో సర్పంచ్‌, గ్రామ కార్యదర్శి, వార్డుసభ్యులు భాగస్వాములు కావాలన్నారు. గ్రామపంచాయతీలో పరిశుభ్రత కోసం ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేసి పంచాయతీని అభివృద్ధి పథంలో ముందుంచాలని అన్నారు. స్వచ్ఛభారత్‌ సర్వేక్షణ్‌ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ గ్రామపంచాయతీలను జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులకు ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. గ్రామపంచాయతీలు నీటి కాలుష్య నియంత్రణ, వాయు కాలుష్య నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలు అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీవో నాగపద్మజ, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా స్వచ్ఛభారత్‌ కోఆర్డినేటర్‌ మైమున్నీసా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-29T00:27:30+05:30 IST