చలి.. చలి..
ABN , First Publish Date - 2023-01-11T00:16:43+05:30 IST
నాలుగు రోజులుగా చల్లని గాలులు వీస్తుండడంతో జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. పల్లెల్లో పొద్దుపేయే వరకు మంచుకురుస్తోంది. నగరంలో సైతం మంచుదప్పటి పరుచుకుంటోంది. మధ్యాహ్నం వేళ ఎండ కొట్టినా చల్లదనం మాత్రం పోవడం లేదు. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారు బాగా చలిగా ఉండటంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికే జంకుతున్నారు.
పడిపోయిన ఉష్ణోగ్రతలు
నాలుగు రోజులుగా పెరిగిన చలి
వరంగల్ కలెక్టరేట్, జనవరి 10: నాలుగు రోజులుగా చల్లని గాలులు వీస్తుండడంతో జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. పల్లెల్లో పొద్దుపేయే వరకు మంచుకురుస్తోంది. నగరంలో సైతం మంచుదప్పటి పరుచుకుంటోంది. మధ్యాహ్నం వేళ ఎండ కొట్టినా చల్లదనం మాత్రం పోవడం లేదు. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారు బాగా చలిగా ఉండటంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. పొలం పనులకు వెళ్లే కూలీలు, రైతులు చలికి వణుకుతున్నారు. గ్రామాల్లో వేడికోసం చలిమంటలు కాగుతున్నాయి. మంచు తీవ్రంగా కురుస్తుండడంతో వాహనదారులు దారి కనబడక ఇబ్బంది పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వ్యాపార నిమిత్తం ఉదయం గ్రేన్ మార్కెట్, కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్కు పెద్ద సంఖ్యలో వందలాది మంది వస్తారు. కూలీలు, హమాలీలు, రైతులు చలితో భయపడుతున్నారు. మున్సిపాలిటీ శానిటేషన్ పనులు నిర్వహించే సిబ్బంది చలిని తట్టుకోలేకపోతున్నారు.
వరంగల్ నుంచి ప్రతీ రోజు ఉదయం వ్యాపార వాణిజ్య ఇతర పనుల నిమిత్తం బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాల ద్వారా ప్రజలు తమ ప్రయాణాన్ని తగ్గించుకున్నారు. ప్రతీ ఏటా మకర సంక్రాంతి రోజు వరకు చలి తీవ్రత పెరగడం కొనసాగుతుంది. ఒక్కసారిగా చలి తీవ్రమవడంతో షటర్లు విక్రయాలు జోరందుకున్నాయి. చలి బాగా ఉండటంతో వరంగల్ రైల్వే స్టేషన్, బస్టాండ్, మార్కెట్ వద్ద చాయ్ అమ్మకాలు పెరిగాయి. మకర సంక్రాంతి పర్వదినం రోజు సూర్యుడు మార్పు చెందే కాలంగా పేర్కొంటూ సంక్రాంతి మరునాడు నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి.
వాతావరణ వివరాలు ఇలా ఉన్నాయి..
గత 24 గంటలుగా జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పుల కారణంగా చలి పెరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉష్ణోగ్రత ఉన్నా కూడా చలి తీవ్రత తగ్గడం లేదు. జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. చెన్నారావుపేటలో 9.9 డిగ్రీలు, దుగ్గొండి 10.4, నెక్కొండ 10.4, సంగెం 11.4, నల్లబెల్లి 11.8, గీసుగొండ 12.5, వరంగల్ 12.6, ఖానాపూర్ 12.7, పర్వతగిరి 12.8, వర్ధన్నపేట 13.8, నర్సంపేట 14.5, ఖిలా వరంగల్ 14, రాయపర్తి 15.3 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.