బరిలో దిగేదెవరో?

ABN , First Publish Date - 2023-09-06T15:50:22+05:30 IST

అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరి నియోజవర్గంలో బీజేపీ టికెట్‌ కోసం అధిక సంఖ్యలో పోటీ నెలకొంది.

బరిలో దిగేదెవరో?

  • మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ

  • రేసులో మాజీ ప్రజాప్రతినిధులు, తాజా కార్పొరేటర్లు

  • ముమ్మర ప్రయత్నాల్లో ఎవరికి వారు బిజీబిజీ

  • ఆశావహల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

  • ఆసక్తిగా గమనిస్తున్న పార్టీ నేతలు, కార్యకర్తలు

అల్వాల్‌, సెప్టెంబర్‌ 6 (ఆంధ్రజ్యోతి): అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరి నియోజవర్గంలో బీజేపీ టికెట్‌ కోసం అధిక సంఖ్యలో పోటీ నెలకొంది. దీంతో ఈ టికెట్‌ ఎవరిని వరిస్తోందనన్న ఉత్కంఠ కార్యకర్తలు, నేతల్లో కొనసాగుతోంది. పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, తాజా కార్పొరేటర్లు ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు తహతహలాడుతున్నారు. ఆశావహులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నా టికెట్‌పై స్పష్టత వచ్చే వరకు పోటీ విషయంలో ఎవరూ మాట్లాడలేని పరిస్థితి. ఒక వైపు సైలెంట్‌గానే ఉంటూనే లోలోపల తమ గాడ్‌ఫాదర్‌ల ద్వారా టికెట్‌ దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో బీజేపీ ప్రభావం చూపకున్నా గ్రేటర్‌ ఎన్నికల్లో బలం పుంజుకుంది. మల్కాజిగిరి పరిధిలోని ఆరు డివిజన్లలో ముగ్గురు బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించి సత్తా చాటారు. అల్వాల్‌ సర్కిల్‌ పరిధిలో కూడా బీఆర్‌ఎస్‌ అభ్యర్ధులకు నువ్వా? నేనా? అన్నట్లుగా బలమైన పోటీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థులు కేవలం కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నేపఽథ్యంలో పార్టీకి పట్టు ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్‌, కార్పొరేటర్‌ శ్రావణ్‌కుమార్‌, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌, బీజేవైఎం జాతీయ కోశాధికారి పీఎం సాయిప్రసాద్‌ తదితరులు బలంగా ప్రయత్నిసున్నారు.

బలాబలాలపై ఆరా

కొంతకాలం క్రితం వరకు ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చిన వారితో ఊపుమీద ఉన్న పార్టీపై కర్నాటక ఫలితాలతోపాటు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ మార్పు కొంత ప్రభావం చూపింది. ఈ విషయాన్ని గ్రహించిన పార్టీ అధిష్ఠానం కార్యకర్తల్లో నిరుత్సాహం ఆవహించకుండా పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేస్తోంది. అధిక సంఖ్యలో ఆశావహులు టికెట్‌ కోసం పోటీపడుతున్నారు. ముందుగా అభ్యర్థిని ప్రకటిస్తే ముఖ్య నేతలు నియోజకవర్గానికి, వ్యక్తిగత ప్రచారానికి పరిమితమవుతారని అధిష్ఠానం అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా జరిగితే మిగతాచోట్ల పార్టీ కార్యక్రమాలు చక్కబెట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయనే భావనలో ఉన్నట్లు ఓ సీనియర్‌ నాయకుడు పేర్కొన్నారు. గతంలో పోటీ చేసిన వారు, ఈసారి టికెట్‌ ఆశిస్తున్న వారు నియోజకవర్గలో పార్టీ బలం, వ్యక్తిగతంగా తమకు లభించే మద్దతుపై లెక్కలు వేసుకుంటున్నారు. కాగా, పలువురు ఇప్పటికే నియోజకవర్గంలో సర్వే చేయించుకుంటున్నట్లు కూడా సమాచారం. బీజేపీ బలంగా ఉన్న మల్కాజిగిరి టికెట్‌ కోసం ఇద్దరు, ముగ్గురు నాయకులు జాతీయ నాయకత్వం వరకు వెళ్లి విన్నపాలు చేసుకున్నట్లు సమాచారం. కాగా, ఆశావహులు ఎవరికి వారు టికెట్‌పై ధీమాగా ఉన్నారు. వీరిలో ఎవరిని దింపితే పార్టీకి మేలు జరుగుతుందనే విషయంపై పార్టీ అధిష్ఠానం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. సోమవారం నుంచి పోటీ చేసే అభ్యర్థులనుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా దరఖాస్తుదారులుు మీడియాతో మాట్లాడితే వారి దరఖాస్తులను తిరస్కరిస్తామని హెచ్చరించడం, టికెట్‌ కేటాయింపు కేంద్ర నాయకత్వం చేతిలో ఉండడంతో ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడంలేదు. అసలు ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారో కూడా బయటకు తెలిసే అవకాశం లేకుండా పోయింది.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఇప్పటికే..

అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ గ్రేటర్‌ పరిధిలో దాదాపు చాలావరకు సిట్టింగ్‌లకే టికెట్లను కేటాయించింది. అలాగే మల్కాజిగిరి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే మైనపంపల్లి హనుమంతరావుకు సైతం రెండోసారి అవకాశం ఇచ్చింది. అయితే తన కుమారుడికి మెదక్‌ నుంచి సీటు దక్కకపోవడంతో మైనంపల్లి మంత్రి హరీశ్‌రావును టార్గెట్‌ చేస్తూ మాట్లాడిన విషయం తెలిసిందే. అయినా ఈ విషయమై పార్టీ అధిష్ఠానం కూడా మైనంపల్లిపై ఎలాంటి వ్యతిరేక నిర్ణయం తీసుకోలేదు. ఆయన కుమారుడి పరిస్థితీ ఏమిటో తేల్చలేదు. ఇక కాంగ్రెస్‌ సైతం ఆశావహుల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు చేసుకున్న ఆశావహులు తాము పోటీలో ఉంటామని, ఆశీర్వదించాలని ఓటర్లను కలుస్తుండటం గమనార్హం. తాజాగా డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌ తన జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీతో బలప్రదర్శన చేపట్టారు. నేడో రే పో అభ్యర్థులను ప్రకటించవచ్చని ఆశావహులు ఆశతో ఉన్నారు.

Updated Date - 2023-09-06T15:50:22+05:30 IST