Share News

దర్శిలో 13వ శతాబ్దం నాటి శాసనం

ABN , Publish Date - Nov 25 , 2024 | 04:51 AM

ప్రకాశం జిల్లా దర్శి పట్టణ సమీపంలోని అచ్చన్నచెరువు వద్ద 13వ శతాబ్దం నాటి శాసనం బయటపడింది. చరిత్ర పరిశోధకుడు దరిమెళ్ల శ్రీనివాసప్రసాద్‌, సంఘసేవకుడు జి.వి.రత్నం దీన్ని గుర్తించారు.

దర్శిలో 13వ శతాబ్దం నాటి శాసనం

దర్శి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా దర్శి పట్టణ సమీపంలోని అచ్చన్నచెరువు వద్ద 13వ శతాబ్దం నాటి శాసనం బయటపడింది. చరిత్ర పరిశోధకుడు దరిమెళ్ల శ్రీనివాసప్రసాద్‌, సంఘసేవకుడు జి.వి.రత్నం దీన్ని గుర్తించారు. క్రీస్తు శకం 1317 సంవత్సరంలో లభించిన ఈ శాసనాన్ని ఆనాటి దర్శి పాలకుడైన నాగవంశరాజు మహామండలేశ్వర అస్తదేవ మహారాజు ఏర్పాటు చేయించినట్లు గుర్తించారు. తెలుగు నేలను పాలించిన నాగవంశ రాజుల్లో ఆయన ప్రసిద్ధుడు. ఈ శాసనంలో వారికి సంబంధించిన ఏడు తరాల రాజుల వంశవృక్షం రాసి ఉంది. 1395లో అక్కడ చెరువు తవ్వించినట్టు, వేణుగోపాలస్వామి గుడి నిర్మించినట్లు అందులో ఉంది. వేణుగోపాలస్వామి ఆలయానికి దర్శి, పొతకమూరు, దేవవరం, సామంతపూడి, పూరిమిట్ల, ఈదర గ్రామాల్లో మాన్యం ఉన్నట్లు దాని ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయాన్ని అష్టదేవ మహారాజు తల్లి ఆర్యమదేవి ఆధ్వర్యంలో నిర్మించినట్టు గుర్తించారు. ఈ మాన్యం భూములను ఆలయ సంరక్షణకు కేటాయించారు. దర్శి గ్రామంలో ఆంజనేయస్వామి గుడి, శివాలయంలో కూడా కాకతీయ రాజులనాటి శాసనాలు ఉన్నాయి. ఎంతో ప్రాచీనమైన శాసనాలు బయటపడటంతో దర్శికి ఎంతో ఘనచరిత్ర ఉందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 25 , 2024 | 04:52 AM